హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి మరొక అడ్వాంటేజ్ లభించింది తాజాగా హైదరాబాద్ చుట్టూ ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్ వెంట ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు ప్రతిపాదిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ముఖ్యంగా.
దాదాపు 8 జిల్లాల గుండా వెళ్లే ఈ ప్రాజెక్టు కేవలం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి మాత్రమే కాదు యావత్ తెలంగాణకు కూడా ఒక మణిహారంగా చెబుతున్నారు. ఈ ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టు పూర్తిగా హైదరాబాద్ చుట్టూ పెద్ద ఎత్తున క్లస్టర్లను ఏర్పాటు చేయడానికి ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. దాదాపు 392 కిలోమీటర్ల మేర నిర్మించనున్న ఈ ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు మొత్తం 26 స్టేషన్లను ప్రతిపాదించారు. దాదాపు 8 జిల్లాలు 14 మండలాల పరిధిలో ఈ ప్రాజెక్టు నిర్మించనున్నారు. ప్రస్తుతం నిర్మించనున్న రీజినల్ రింగ్ రోడ్డుకు కేవలం ఐదు కిలోమీటర్ల లోపే రింగురోడ్డును అనుసరిస్తూ ఈ రైల్వే లైను ప్రతిపాదించారు. మొత్తం దీని అంచనా వ్యయం 12070 కోట్ల రూపాయలుగా ప్రతిపాదిస్తున్నారు.
రియల్ ఎస్టేట్ రంగానికి ఊతం ఇవ్వనున్న రింగు రైలు ప్రాజెక్టు
ఈ ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు హైదరాబాద్ నుంచి సుమారు 100 కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాలమధ్య కనెక్టివిటీ పెంచేలా నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల రియల్ ఎస్టేట్ రంగానికి పెద్ద ఎత్తున ఊపు వస్తుంది అని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించినప్పుడు రింగ్ రోడ్డు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు విపరీతంగా అభివృద్ధి చెందాయి. అంతేకాదు అక్కడి భూముల ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. నగరం విస్తరించే కొద్దీ ఔటర్ రింగ్ రోడ్డు అనేది హైదరాబాదుకు సరిహద్దుగా మారింది. అయితే ఇప్పుడు హైదరాబాదుకు నూతనంగా మరో సరిహద్దు ఏర్పడనుంది అదే రీజినల్ రింగ్ రోడ్డు. ఇది హైదరాబాద్ విస్తరణకు మరొక మైలురాయి అని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు ఈ రీజినల్ రింగ్ రోడ్డుకు సమానంగా ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు రానుంది. దీంతో కనెక్టివిటీ విషయంలో హైదరాబాదు ఇప్పుడు మెట్రో సిటీలతో సమానంగా దూసుకెళ్తుంది అని చెప్పవచ్చు. ఇప్పటికే మెట్రో ప్రాజెక్టుతో సిటీలో ట్రాఫిక్ కష్టాలను తగ్గించడంతోపాటు పర్యావరణ కాలుష్యాన్ని కూడా పెద్ద ఎత్తున నియంత్రిస్తున్నారు.
ఇప్పుడు ఈ ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు వల్ల హైదరాబాద్ సబర్బన్ ఏరియాలో కనెక్టివిటీ పెరగడంతో పాటు ఈ ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందడానికి పారిశ్రామికంగా మరింత వేగంగా తీసుకెళ్లడానికి తోడ్పడుతుంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ రైల్వే లైన్ చుట్టూ అనేక రకాల పరిశ్రమలు ఏర్పడే అవకాశం ఉంటుంది. దీనికి తోడు నివాస ప్రాంతాలు కూడా ఏర్పాటు చేసుకునేందుకు ఈ రైల్వే లైను ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనివల్ల హైదరాబాద్ నగరం నలువైపులా విస్తరించేందుకు చాలా వేగంగా చర్యలు తీసుకునేందుకు ఉపయోగపడుతుంది.
ప్రతిపాదిత ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు వంగపల్లి-ఆలేరు , గుట్లగూడ-చిట్టిగడ్డ, బూర్గుల-బాలానగర్, మాసాయ్‌పేట-శ్రీనివాసనగర్ , వలిగొండ-రామన్నపేట , గజ్వేల్-కొడకండ్ల గ్రామాల గుండా వెళ్లనుంది.
ప్రతిపాదిత ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు వల్ల ట్రాఫిక్ నియంత్రణతో పాటు, కనెక్టివిటీ లేని గ్రామాలకు నగరంతో కనెక్టివిటీ పెరుగుతుంది. అలాగే గ్రామీణ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చేవారు వేగంగా తరలి వచ్చేందుకు ఉపయోగపడుతుంది. దీంతోపాటు ప్రతిపాదిత 26 రైల్వే స్టేషన్లు వాటి చుట్టుపక్కల ప్రాంతాలకు రోడ్డు ఇతర సదుపాయాలు లభిస్తాయి. ఫలితంగా ఆ ప్రాంతాల్లో భూముల విలువ భారీగా పెరగడంతో పాటు రైతులకు ఆర్థికంగా ఎంతో మేలు కలుగుతుంది. ముఖ్యంగా నగరంలో ఉద్యోగం చేసేవారు ఇకపై ఈ కనెక్టివిటీ రైలు ద్వారా నగరంలోకి ప్రవేశించడం సులభతరం కానుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం ఈ రైల్వే లైన్ చుట్టూ వేగంగా విస్తరించే అవకాశం కనిపిస్తుంది. గతంలో ముంబైలో సైతం ఇదేవిధంగా అభివృద్ధి జరిగినట్లు గమనించవచ్చు.
































