విద్యార్థులకు బిగ్ అలర్ట్.. రేపు స్కూళ్లు, కాలేజీలు బంద్.

 తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఈ నెల 23వ తేదీన అంటే రేపు విద్యాసంస్థలు మూతపడనున్నాయి. వామపక్ష విద్యార్థి సంఘాల పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు బంద్‌కు సిద్ధమవుతున్నాయి.


విద్యా రంగంలో జరుగుతున్న అనేక అన్యాయాలు, సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ బంద్ నిర్వహిస్తున్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని ఒత్తిడికి గురిచేసేందుకు.. వామపక్ష సంఘాలు సమన్వయంతో ముందుకు వచ్చాయి.

బంద్‌కు కారణంగా ఉన్న ప్రధాన డిమాండ్లు:
ప్రభుత్వ స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు.. పాఠశాల భవనాలు, టాయిలెట్లు, కుర్చీలు, పాఠ్యపుస్తకాలు, కంప్యూటర్లు వంటి వాటిలో తీవ్ర కొరత ఉంది. ఈ విషయాన్ని పదే పదే చెబుతున్నప్పటికీ.. ప్రభుత్వం నుంచి తగిన చర్యలు రావడం లేదు. ఈ అంశాన్ని ముఖ్యంగా ఎత్తి చూపించేందుకు బంద్‌కు పిలుపునిచ్చారు.

ప్రైవేట్ విద్యాసంస్థలలో ఫీజుల నియంత్రణ చట్టం అమలు
రాష్ట్రంలో ఎంతోమంది విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలలో చదువుతున్నారు. కానీ అధిక ఫీజులతో, చార్జీల పేరుతో వాటిలో వసూలు జరుగుతుండడంతో మధ్యతరగతి, పేద విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్రంగా ప్రభావితమవుతున్నారు. ఫీజుల నియంత్రణ చట్టాన్ని సమర్థంగా అమలు చేయాలని.. విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

విద్యాశాఖ మంత్రి నియామకం & ఖాళీ పోస్టుల భర్తీ
రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిత్వ శాఖకు.. పునర్నియామకం ఇంకా జరగలేదు. దీంతో విద్యా రంగ పాలనలో నిర్లక్ష్యం తలెత్తుతోందన్న ఆరోపణలు వస్తున్నాయి. అలాగే ఉపాధ్యాయుల ఖాళీలు, కళాశాలల్లో అధ్యాపకుల పోస్టులు పెద్ద ఎత్తున మిగిలిపోయాయి. వీటిని వెంటనే భర్తీ చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

పెండింగ్ స్కాలర్‌షిప్‌లు విడుదల చేయాలి
అనేకమంది విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు.. ఇంకా జమ కాలేదన్నది ప్రధాన ఆందోళన. డిగ్రీ, ఇంటర్మీడియట్, పీజీ విద్యార్థులకు పాత బకాయిలు ఉన్నప్పటికీ.. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపణలున్నాయి. విద్యా కొనసాగింపు అడ్డంకి కాకుండా ప్రభుత్వం తక్షణమే.. ఈ పెండింగ్ స్కాలర్‌షిప్‌లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఆర్టీసీలో ఉచిత బస్ పాసులు అందించాలి
ప్రస్తుతం ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ ఖర్చులతో.. విద్యార్థులపై ఆర్ధిక భారం పెరుగుతోంది. ప్రభుత్వ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పాస్‌లు అందించాలని, ఇది గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని విద్యార్థి సంఘాలు అభిప్రాయపడుతున్నాయి.

ఇంటర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు
ఇటీవలి కాలంలో ప్రభుత్వం పాఠశాలల్లో.. మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తుండగా, ఇంటర్ కాలేజీల్లో మాత్రం ఇది లేదు. పేద విద్యార్థులకు పోషకాహారంలో కొరత ఉండకుండా.. ఈ పథకాన్ని ఇంటర్ స్థాయిలో కూడా అమలు చేయాలని విద్యార్థి సంఘాలు కోరుకుంటున్నాయి.

ఈ బంద్‌కు పిలుపునిచ్చిన విద్యార్థి సంఘాలు, ఎఐఎస్ఎఫ్ (AISF), ఎస్‌ఎఫ్‌ఐ (SFI), డీవైఎఫ్‌ఐ (DYFI) వంటి వామపక్ష విద్యార్థి, యువజన సంఘాల సమితులే. విద్యార్థుల హక్కుల కోసం తీసుకునే ప్రతి చర్య అభినందనీయం కానీ, విద్యా వ్యవస్థ స్థిరత కోసమే ఈ డిమాండ్లు ఉండాలని వారు స్పష్టం చేస్తున్నారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు.. తమ పోరాటం కొనసాగుతుందని వారు ప్రకటించారు.

ఇక ఈ బంద్ నేపథ్యంలో తల్లిదండ్రులు, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. పాఠశాలలు, కళాశాలలు బంద్ అయ్యే అవకాశం ఉన్నందున.. ముందస్తుగా సమాచారం తెలుసుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.