మన శరీరంలో కిడ్నీలు రక్తంలోని వ్యర్థాలను వడపోసి, ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. వాటి పనితీరు సక్రమంగా ఉండాలంటే మనం తీసుకునే ఆహారం చాలా ముఖ్యం.
ప్రముఖ చిరోప్రాక్టర్, పోషకాహార నిపుణుడు డాక్టర్ ఎరిక్ బర్గ్.. కిడ్నీల పనితీరును మెరుగుపరచడంలో సహాయపడే మూడు అద్భుతమైన ఆహారాలను సూచించారు. అవేంటో చూద్దాం.
1. దోసకాయలు: శరీరానికి అదనపు తేమ
శరీరాన్ని ఎల్లప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంచడం కిడ్నీ ఆరోగ్యానికి అత్యవసరం. డాక్టర్ బర్గ్ తెలిపిన వివరాల ప్రకారం, దోసకాయలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల అదనపు హైడ్రేషన్ లభిస్తుంది. దోసకాయలలో 95 శాతం నీరు ఉంటుంది. ఇది కిడ్నీల నుండి క్రియాటినిన్, యూరిక్ యాసిడ్ వంటి వ్యర్థ పదార్థాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది. తక్కువ కేలరీలు ఉండటంతో బరువు పెరగడం గురించి చింతించకుండా వీటిని తినవచ్చు. సలాడ్లలో లేదా దోసకాయతో నింపిన నీటిని తాగడం ద్వారా హైడ్రేషన్ పెంచుకోవచ్చు.
2. నిమ్మకాయలు: కిడ్నీ స్టోన్ల నివారణకు
కిడ్నీల పనితీరును మెరుగుపరిచే ఆహారాలలో రెండోది నిమ్మకాయ. నిమ్మకాయలలో అధికంగా ఉండే విటమిన్ సి, సిట్రేట్ కిడ్నీ స్టోన్లు ఏర్పడే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తాయి. రోజూ అర కప్పు నిమ్మరసం లేదా రెండు నిమ్మకాయల రసాన్ని నీటిలో కలిపి తాగడం వల్ల మూత్రంలో సిట్రేట్ స్థాయి పెరుగుతుంది, తద్వారా కిడ్నీ స్టోన్ల ప్రమాదం తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. నిమ్మరసాన్ని నీటిలో లేదా టీలో కలుపుకొని తాగడం ద్వారా సులభంగా ఈ ప్రయోజనాలను పొందవచ్చు. ఇది యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
3. పార్స్లీ: యాంటీఆక్సిడెంట్ గుణాలు
సాధారణంగా కనిపించే పార్స్లీ ఆకులకు కిడ్నీలకు రక్షణ కల్పించే అద్భుతమైన లక్షణాలు ఉన్నాయి. దీనిలోని యాంటీఆక్సిడెంట్ గుణాలు కిడ్నీ వ్యాధులకు కారణమయ్యే ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. పార్స్లీలో ఉండే అపిజెనిన్, ల్యూటియోలిన్, క్వెర్సెటిన్ వంటి ఫ్లేవనాయిడ్లు శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. 2024లో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం, పార్స్లీ ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి, మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుందని కనుగొన్నారు. ఇది కిడ్నీ సంబంధిత రుగ్మతలు, ఇన్ఫెక్షన్లు, దీర్ఘకాలిక పరిస్థితులను నివారించడంలో సహాయపడుతుంది. 2017 నిర్వహించిన మరొక అధ్యయనం ప్రకారం, కిడ్నీ స్టోన్లు ఉన్న ఎలుకలకు పార్స్లీ ఇవ్వడం ద్వారా వాటి మూత్రంలో కాల్షియం, ప్రోటీన్ విసర్జన తగ్గిందని, మూత్రపిండాల pH, మూత్రవిసర్జన పెరిగాయని రిపోర్టులు వెల్లడించాయి.































