నా వల్ల కావడం లేదు.. ఇక సెలవ్.. యాంకర్ రష్మి గౌతమ్ షాకింగ్ పోస్ట్

తెలుగునాట టాప్ యాంకర్లలో ఒకరిగా వెలుగొందుతున్నారు రష్మి గౌతమ్. జబర్దస్త్ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఈటీవీలో తప్పించి మరో ఛానెల్‌లో పనిచేయరు.


జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలను హోస్ట్ చేస్తున్నారు. హీరోయిన్లను మించిన అందగత్తె అయినప్పటికీ, డబ్బు, ఇతర విలాసాలపై ఆమె ఆసక్తి చూపించరు. తన రెండు షోలు తనకు చాలు అన్నట్లుగా ఉంటారు. పర్యావరణం, జంతు ప్రేమికురాలైన రష్మి గౌతమ్ సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుంటూ తనదైన వ్యక్తిత్వంతో పలువురి మన్ననలు అందుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో రష్మి గౌతమ్ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.

విశాఖపట్నంలో స్థిరపడిన ఒడియా కుటుంబంలో జన్మించారు రష్మీ గౌతమ్. దివంగత ఉదయ్ కిరణ్ హీరోగా వచ్చిన హోలీ చిత్రంలో కమెడియన్ సునీల్‌కు జంటగా కనిపించారు. తర్వాత ఎందుకో వెండితెరకు దూరమై తిరిగి జబర్దస్త్‌తో తళుక్కున మెరిశారు. స్టార్ యాంకర్‌గా పాపులరైన రష్మి గౌతమ్ తర్వాత కరెంట్, బిందాస్, గుంటూరు టాకీస్, బొమ్మ బ్లాక్ బస్టర్, భోళా శంకర్, హాస్టల్ బాయ్స్ వంటి చిత్రాల్లో నటించారు. సినిమాలలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ జబర్దస్త్ షోను మాత్రం ఆమె విడిచిపెట్టలేదు.

సుడిగాలి సుధీర్‌తో ప్రేమాయణం

ఇక జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్‌తో రష్మీ ప్రేమలో పడ్డారంటూ గత కొన్నేళ్లుగా గాసిప్స్ వస్తున్న సంగతి తెలిసిందే. కానీ వీరిద్దరి మధ్య నిజంగా ప్రేమాయణం నడుస్తుందా? అది కేవలం స్కిట్స్‌కే పరిమితమా? అన్నది మాత్రం సస్పెన్సే. ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురైన రష్మి గౌతమ్ ఒక సర్జరీ కూడా చేయించుకున్నారు. మూగ జీవాల సంక్షేమం కోసం తొలి నుంచి పాటుపడుతున్న ఈ ముద్దుగుమ్మ.. ఆపదలో ఉన్న కుక్కల గురించి తరచుగా పోస్టులు పెడుతుంటారు. కరోనా సమయంలో కుక్కలకు ఆహారం అందించారు.

బలంగా వస్తానంటూ పోస్ట్

సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే రష్మి గౌతమ్ ఎప్పటికప్పుడు ఫోటోలు, వీడియోలతో పాటు ఇతర వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఆమె ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. తాను గత కొంతకాలంగా కెరీర్‌తో పాటు పర్సనల్ లైఫ్‌లోనూ తీవ్ర ఒడుదొడుకులను ఎదుర్కొంటున్నానని చెప్పారు. సోషల్ మీడియా మనపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే తాను నెల రోజుల పాటు దీనికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని రష్మీ తెలిపారు. డిజిటల్ డీటాక్స్ పాటించి బలంగా తిరిగి వస్తానని.. కొన్నింటిని సరిదిద్దుకోవడానికి ఇదే సమయమని ఆమె పేర్కొన్నారు. తాను సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్నా లేకున్నా.. మీ ప్రేమ, సపోర్ట్ నాకు ఉంటుందని రష్మి గౌతమ్ ఆకాంక్షించారు.

అసలేంటీ డిజిటల్ డీటాక్స్?

ఆమె పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. రష్మికి ఏమైంది? మేం ఎప్పుడూ మీకు అండగానే ఉంటామని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఇదే సమయంలో అసలు డిజిటల్ డీటాక్స్ అంటే ఏంటీ? అంటూ పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. వారంలో కొద్దిరోజులు డిజిటల్ పరికరాలు ముఖ్యంగా ఫోన్‌కు దూరంగా ఉండటమే డిజిటల్ డీటాక్స్. దీని వల్ల మనసు ప్రశాంతంగా ఉండి.. ఫుల్ రీఛార్జ్ అవుతారని నిపుణులు చెబుతున్నారు. రష్మి గౌతమ్ ఈ దిశగా అడుగులు వేయడంతో పలువురు ఆమె బాటలో నడిచే అవకాశం ఉందని అంటున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.