సినీ నటుడు రానాకు ఈడీ మళ్లీ సమన్లు.. ఆ రోజు హాజరు కావాల్సిందే

బెట్టింగ్‌ యాప్‌ల కేసులో విచారణకు హాజరయ్యేందుకు గడువు కావాలంటూ సినీ నటుడు రానా (Rana Daggubati) ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ)ను కోరిన సంగతి తెలిసిందే.


బెట్టింగ్‌ యాప్‌లను ప్రమోట్‌ చేసినందుకు నిర్వాహకులు ఇచ్చిన పారితోషికానికి సంబంధించి మనీలాండరింగ్‌ జరిగిందనే అనుమానంతో ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలోనే రానాతోపాటు సినీనటులు ప్రకాశ్‌రాజ్, విజయ్‌ దేవరకొండ, మంచు లక్ష్మి తదితరులకు నోటీసులు జారీ చేసింది. బుధవారం రానా ఈడీ ఎదుట హాజరుకావాల్సి ఉంది. ముందస్తు కార్యక్రమాలు, షూటింగ్‌ల వల్ల బుధవారం విచారణకు హాజరు కాలేనని, తనకు కొంత గడువు కావాలని రానా.. ఈడీని కోరారు. ఆయన చేసిన అభ్యర్థనపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ అధికారులు స్పందించారు. ఆగస్టు 11న కచ్చితంగా విచారణకు రావాలంటూ తెలిపారు.

మరోవైపు సినీ నటులు ప్రకాశ్‌రాజ్‌ ఈ నెల 30న, విజయ్‌దేవరకొండ ఆగస్టు 6న, మంచులక్ష్మి ఆగస్టు 13 తేదీల్లో విచారణ నిమిత్తం తమ ఎదుట హాజరుకావాలంటూ ఈడీ అధికారులు ఇప్పటికే తమ నోటీసుల్లో పేర్కొన్నారు. ఇంకా పలువురు సెలెబ్రిటీలు, యూట్యూబర్లకు నోటీసులు జారీ చేసి విచారించనున్నారు. రాష్ట్రంలో బెట్టింగ్‌ యాప్‌ల కారణంగా అనేకమంది అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడిన నేపథ్యంలో వివిధ పోలీస్‌ స్టేషన్లలో ఆయా యాప్‌లపై కేసులు నమోదయ్యాయి. వీటన్నింటినీ కలిపి విచారించే ఉద్దేశంతో ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ అంశంపై సిట్‌ విచారణ జరుపుతుండగా… మరోవైపు ఇదే కేసులో నిధుల మళ్లింపుపై ఈడీ మరో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం గమనార్హం.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.