రాష్ట్రంలో స్థిరాస్తి రంగంలో నెలకొన్న స్తబ్ధత తొలగింది. కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, ప్రణాళికలతో ఆస్తుల క్రయవిక్రయాలు జోరందుకున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్, మే, జూన్ నెలల్లో స్థిరాస్తి రంగంలో రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.2,663.70 కోట్లు ఖజానాకు జమయ్యాయి. గత ఏడాది ఇదే సమయానికి రూ.1,821.17 కోట్లు మాత్రమే వచ్చాయి. అంటే ఈ ఏడాది 46.26% వృద్ధి నమోదైనట్లు. సరిగ్గా ఇదే సమయంలో తెలంగాణ (8.26%), తమిళనాడు (17.67%), కర్ణాటక (7.12%) వృద్ధిని మాత్రమే నమోదు చేశాయి. ఈ పరిణామం రాష్ట్రంలో స్థిరాస్తి రంగం పుంజుకుందనే విషయాన్ని స్పష్టం చేస్తోంది. రాజధాని అమరావతి అభివృద్ధి, నిర్మాణ పనుల్లో వేగం గుంటూరు జిల్లాలో స్థిరాస్తి కొనుగోళ్లు భారీగా పెరిగేందుకు దోహదం చేస్తోంది.
కూటమి ప్రభుత్వ చర్యలతో ఊతం
నాటి వైకాపా ప్రభుత్వం మూడు రాజధానుల ప్రకటనతో పాటు పాలనాపరంగా తీసుకున్న అనేక ప్రతికూల నిర్ణయాలతో స్థిరాస్తి రంగం కుదేలైంది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ రంగం వృద్ధికి ఊతమిచ్చేలా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. లేఅవుట్లలో రోడ్ల కొలతలు తగ్గించింది. కేంద్ర ప్రభుత్వ సంస్థల స్థలాల పక్కనే లేఅవుట్ల అభివృద్ధికి ఆయా శాఖల ఎన్వోసీ తప్పనిసరి అనే నిబంధనను ఉపసంహరించుకుంది. గతంలో పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో ఉన్న భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతుల జారీ అధికారాన్ని కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, నగర పంచాయతీల పరిధిలోకి తెచ్చింది. ఐదు అంతస్తుల వరకు భవన నిర్మాణాల అనుమతుల జారీ ప్రక్రియను సరళీకృతం చేసింది. వీటికి తోడు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రణాళికల రూపకల్పన ఆస్తుల కొనుగోళ్లు పెరిగేందుకు దోహదం చేస్తున్నాయి.
పది జిల్లాల్లో రిజిస్ట్రేషన్ల పెరుగుదల
విశాఖ, గుంటూరు, ఎన్టీఆర్, తిరుపతి, కృష్ణా, తూర్పుగోదావరి, కాకినాడ, పల్నాడు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో స్థిరాస్తి లావాదేవీలు పెరిగాయి. అన్నిరకాల రిజిస్ట్రేషన్లు కలిపి గుంటూరు జిల్లాలో అత్యధికంగా 46.23%, కృష్ణాలో 40.05%, పల్నాడు జిల్లాలో 29.10% చొప్పున పెరిగాయి. కడప, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లోని కొన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు తక్కువగా జరుగుతున్నాయి. కడప రూరల్, జమ్మలమడుగు, కమలాపురం, ప్రొద్దుటూరు, అనంతపురం, అనంతపురం రూరల్, తాడిపత్రి, గుంతకల్లు, కళ్యాణదుర్గం, బుక్కపట్నం, కదిరి, హిందూపురం కార్యాలయాల పరిధుల్లో ఆస్తుల క్రయ, విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. రాష్ట్రంలో 296 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండగా 153 కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు నిర్దేశించిన లక్ష్యానికి చేరువగా జరుగుతున్నాయి. 60 కార్యాలయాల్లో 60% నుంచి 40% మధ్య మాత్రమే రిజిస్ట్రేషన్లు నమోదవుతున్నట్లు గుర్తించారు.
జిల్లాల వారీగా
గత ఏడాది (ఏప్రిల్, మే, జూన్ నెలలు)తో పోల్చినప్పుడు ఈ ఏడాది రాష్ట్రంలోనే అత్యధికంగా గుంటూరు జిల్లాలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లలో 170.63%, నివాస స్థలాల విషయంలో 47.06% పెరుగుదల నమోదైంది. నెల్లూరు జిల్లాలో ఫ్లాట్ల కొనుగోళ్లు, పశ్చిమగోదావరి జిల్లాలో ఇళ్ల క్రయవిక్రయాలు ఎక్కువగా జరిగాయి. గత ఏడాది ఏప్రిల్, మే, జూన్ నెలల్లో నెలకొన్న ఎన్నికల వాతావరణ ప్రభావం కూడా స్థిరాస్తి రంగంపై ఉంది.































