ధర తక్కువున్నా.. ఎందుకు కొంటలేరు?

కొవిడ్ సమయంలో ఎవరి నోట విన్నా డోలో మాత్ర పేరు మార్మోగింది. ప్రతీ డాక్టర్ కూడా డోలో 650 జ్వరం కోసం వేసుకోమని ప్రిస్క్రైబ్ చేశారు. కొంతమంది తమ యూట్యూబ్ వీడియోలలో ఈ మాటే పదేపదే చెప్పారు.


ఇదేదో కొవిడ్‌కి కొత్త మందు కనిపెట్టారేమో అన్నట్టు సాధారణ మనిషి మెదడును బ్రెయిన్ వాష్ చేశారు. ఇతర మాత్రలు ఉన్నప్పటికీ అందరూ అదే మాత్ర కొనడం ఆరంభించారు. తద్వారా ఈ కంపెనీ, వేల కోట్ల రూపాయల వ్యాపారం ఒక జ్వరం టాబ్లెట్‌తో చేసుకుంది.

కొవిడ్ తర్వాత ఒక సంస్థ పరిశోధనలో తేలింది ఏమిటంటే, ఈ కంపెనీ కొవిడ్ సమయంలో కూడా తన బ్రాండ్‌ను అమ్ముకోవడానికి అనైతికంగా వైద్యులకూ, హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్‌కీ దాదాపు వెయ్యి కోట్ల రూపాయల ఫ్రీబీల ప్రసాదం పంచిందని ఇదంతా ప్రజల డబ్బే కదా!

మాత్రలతోనే మస్తు లాభాలు..

బ్రాండెడ్ మందుల పేర్ల మీద ఒకే కంపోజిషన్‌ను రక రకాల కంపెనీలు వివిధ రకాల పేర్లతో వివిధ రకాల రేట్లకు అమ్ముతున్నాయి. కొన్నిసార్లు ఆ తేడా ఒక స్ట్రిప్‌కు లెక్క వేసుకుంటే, ఒక కంపెనీ దానిని 150 రూపాయలకు అమ్మితే, మరో కంపెనీ 500 రూపాయలకు కూడా అమ్ముతుంది. మరో కంపెనీ ఓ అరవై రూపాయలకు కూడా అమ్మగలదు. ఇలా ఎన్నో టాబ్లెట్లు, ఎన్నో మందులు ఫార్మసీ దుకాణాల అరల్లో నిండిపోయి ఉన్నాయి. ఈ రోజు చాలా ఎక్కువ మంది వైద్యులు తమ పాకెట్స్ నింపుకోవడం కోసం ఆలోచిస్తున్నారు. అయితే, నైతిక విలువలతో బాధ్యతా యుతంగా పనిచేసే వైద్యులు కూడా ఉన్నారు. కానీ, వారి సంఖ్య మెల్లమెల్లగా తగ్గిపోతోంది.

ఏ మందు వాడాలో.. ఎవరు చెప్పాలి!

మందుల కంపెనీలకూ, మందుల దుకాణాలకూ, డాక్టర్లకూ, హాస్పిటల్స్‌కూ మధ్య చీకటి సంబంధాలు వైద్యాన్ని సాధారణ మనిషి నుండి దూరం చేస్తున్నాయి. ఒక డాక్టర్ ఒక పేషెంట్‌కు ఏ మందు ప్రిస్క్రైబ్ చెయ్యాలో, ఏ కంపెనీ ఔషధం రాయాలో నేడు ఔషధాల కంపెనీలు నిర్ణయి స్తున్నాయి. తమ ప్రొడక్ట్ ఎంత ఎక్కువ ప్రమోట్ చేస్తే వారికి అంత ప్రయోజనం ఉంటుంది. కొవిడ్ సమయంలో డోలో కథ కూడా సరిగ్గా అలాంటి కోవకు చెందినదే. చాలా చవకగా దొరికే పారాసెటమాల్ విడిచిపెట్టి ప్రతి ఒక్కరూ కూడా డోలో 650 మీద పడ్డారు. సరిగ్గా కంపెనీలు ఇదే పని ఇతర టాబ్లెట్ల విషయంలో వాడుతున్నాయి.

అక్కడ స్ట్రిప్ పది.. ఇక్కడ వంద

పోనీ జనరిక్ మందులు వాడి తక్కువ ఖర్చుతో రోగం నయం చేసుకుందాం అంటే అక్కడ కూడా పరిస్థితి అయోమయంగా ఉంది. బ్రాండెడ్ మందు అంటే ఒకే కంపోజిషన్‌ను వివిధ రకాల పేర్లు పెట్టి వివిధ రకాల కంపెనీలు అమ్ముతాయి. జనరిక్ మందులు అంతే.. ఇవి అదే కంపోజిషన్‌ను వివిధ పేర్లతో చవకగా అమ్ముతాయి. ప్రభుత్వం, ప్రధానమంత్రి జన్ ఔషధీలో ఈ మందులను అందుబాటులో ఉంచుతోంది. ఒక బ్రాండెడ్ మందు పది టాబ్లెట్లు వంద రూపాయలు అయితే.. ఇవి పది రూపాయలకే అమ్మగలవు. అంత చవకగా ఉంటాయి.

జనరిక్ అంటేనే భయపెడుతున్నారు..

జనరిక్ మందులు కొనుక్కుందామని రోగి అనుకున్నా డాక్టర్లు అలా జనరిక్ పేర్లతో ప్రిస్క్రైబ్ చెయ్యరు. ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి, కొందరు తమ విపరీతమైన లాభాలు మిస్ అయిపోతాయని జనరిక్ వైపు వెళ్లడం లేదు. రెండు, ఈ జనరిక్ మందుల్లో నాణ్యతపై తమకు నమ్మకం కుదరడం లేదని వైద్యులు చెబుతున్నారు. ఏది ఏమైనా నష్టపోయేది మరలా రోగి మాత్రమే. ఎక్కువ శాతం జనరిక్ మందులు మన దేశం నుండి బయట దేశానికి ఎగుమతి అవుతున్నాయి. కానీ మన దేశంలో మాత్రం ఎక్కువ బ్రాండెడ్ మందులు మాత్రమే మందులు దుకాణాల్లో కనిపిస్తున్నాయి. పేషెంట్ తనకి కావలసిన టాబ్లెట్‌పై డాక్టర్ ఎంత ధర రాసినా కొనక తప్పడం లేదు. మరోవైపు, అదే కంపోజిషన్ జనరిక్ మందుల్లో కొందామా అంటే ఆ వైద్యులు ఆ మందుల మీద నమ్మకం కలిగించడం లేదు. తమ ప్రిస్క్రిప్షన్‌లో అలా రాయడం లేదు. ఫలితంగా రోగి ఏం చేయాలో అర్థం కానీ అయోమయంలో ఇరుక్కున్నాడు.

జనరిక్ నాణ్యతపై చెకింగ్ ఏది?

ఇక జనరిక్ మందుల విషయానికొస్తే, ఇవి నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నాయా? లేదా అన్నది ఏ సంస్థలు కూడా కచ్ఛితంగా పరిశోధన చేసి చెప్పడం లేదు. ప్రభుత్వం కూడా తమ నిర్వహణ సంస్థల ద్వారా మాటిమాటికీ క్వాలిటీ చెకింగ్‌లు చేయించి ఆయా ప్రమాణాలను వెలుగులోకి తేగలిగితే ప్రజలు ఈ మందుల విషయంలో మరింత నమ్మకం కలిగి ఉండేవారు. హైదరాబాద్ లాంటి నగరాల్లో ఈ మందులు పుట్టగొడుగుల్లా వ్యాపించినప్పటికీ సరైన నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని ఆ మధ్య వార్తల్లో మనకి తెలిసింది. ఈ ప్రమాణాలు ఎలా ఉన్నాయో బాధ్యతా యుతంగా చెప్పే ప్రభుత్వ సంస్థలు కరువైనప్పుడు సగటు పౌరుడు మందుల విషయంలో డాక్టర్‌నే కదా నమ్మేది! దీనికి తోడు గోరుచుట్టు మీద రోకటి పోటుగా నకిలీ మందులు ఒరిజినల్ మందుల మధ్య కలిసిపోయి సమస్యను మరింత జఠిలం చేస్తున్నాయి. ఇలా, వైద్య రంగంలో దోపిడీ కారణంగా కంపెనీల లాభాలూ, వైద్యుల ఆదాయాలూ అనూహ్యంగా పెరిగాయి. కానీ, పేదలనూ, మధ్య తరగతినీ మెడికల్ పావర్టీలోకి ఈ దోపిడీ నెట్టేస్తోంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.