సెయింట్ కిట్స్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో ఆస్ట్రేలియా ఆటగాడు టిమ్ డేవిడ్(Tim David) విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో 29 ఏళ్ల డేవిడ్ అద్బుతమైన సెంచరీతో మెరిశాడు.
214 పరుగుల లక్ష్య చేధనలో డేవిడ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
వార్నర్ పార్క్‌లో బౌండరీల వర్షం కురిపించాడు. అతడిని ఆపడం ఎవరి తరం కాలేదు. ఈ క్రమంలో 37 బంతుల్లోనే 6 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో తన తొలి టీ20 సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.
ఫాస్టెస్ట్ సెంచరీ..
తద్వారా టీ20ల్లో ఆస్ట్రేలియా తరపున ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆటగాడిగా డేవిడ్ చరిత్ర సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు తన సహచర వికెట్ కీపర్ బ్యాటర్ జోష్ ఇంగ్లిష్ పేరిట ఉండేది. ఇంగ్లిష్ గతేడాది స్కాట్లాండ్పై 43 బంతుల్లోనే శతక్కొట్టాడు. తాజా మ్యాచ్‌తో ఇంగ్లిష్ ఆల్‌టైమ్ రికార్డును డేవిడ్ బ్రేక్ చేశాడు. ఓవరాల్‌గా టెస్టు హోదా కలిగిన జట్టుపై ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన మూడో ప్లేయర్‌గా డేవిడ్ నిలిచాడు.
ఈ ఆసీస్ క్రికెటర్ కంటే ముందు డేవిడ్ మిల్లర్, రోహిత్ శర్మలు తమ సెంచరీ మార్క్‌ను కేవలం 35 బంతుల్లోనే అందుకున్నారు. మిల్లర్ బంగ్లాదేశ్‌పై, రోహిత్ శర్మ శ్రీలంకపై ఈ ఫీట్ సాధించారు. టీమిండియా యువ ఆటగాడు అభిషేక్ శర్మ కూడా 37 బంతుల్లోనే టీ20 సెంచరీని నమోదు చేశాడు.
వీటితో మరో రెండు రికార్డులను డేవిడ్ తన పేరిట లిఖించుకున్నాడు. టీ20ల్లో ఆస్ట్రేలియా తరపున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ ఆటగాడిగా డేవిడ్ నిలిచాడు. ఈ మ్యాచ్‌లో డేవిడ్ కేవలం 17 బంతుల్లోనే ఆర్ధశతకం సాధించాడు. దీంతో డేవిడ్ వార్నర్(18 బంతులు)ను ఈ ఆర్సీబీ క్రికెటర్‌కు అధిగమించాడు.
ఐపీఎల్-2025లో ఆర్సీబీకి డేవిడ్ ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే. అదేవిధంగా ఒక టీ20 ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన రెండో ఆసీస్ ఆటగాడిగా డేవిడ్ నిలిచాడు. ఈ మ్యాచ్‌లో డేవిడ్ 11 సిక్సర్లు బాదాడు. ఈ జాబితాలో మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్(16) ఉన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో డేవిడ్.. విండీస్ విధ్వంసకర ఆల్‌రౌండర్ అండ్రీ రస్సెల్ బ్యాట్‌ను ఉపయోగించడం గమనార్హం. రస్సెల్ ఆసీస్‌తో జరిగిన రెండో టీ20 అనంతరం అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకొన్నాడు.
ఆసీస్ ఘన విజయం..
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆతిథ్య వెస్టిండీస్‌పై 6 వికెట్ల తేడాతో ఆసీస్ ఘన విజయం సాధించాడు. డేవిడ్ (102 నాటౌట్) విధ్వంసకర శతకంతో చెలరేగడంతో.. 215 పరుగుల భారీ లక్ష్యాన్ని కంగారులు కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 16.1 ఓవర్లలో చేధించింది. డేవిడ్‌తో పాటు మిచెల్ ఓవెన్(36 నాటౌట్) రాణించాడు.
ఈ విజయంతో మరో రెండు మ్యాచ్‌ల మిగిలూండగానే 5 టీ20ల సిరీస్‌ను 3-0 తేడాతో ఆసీస్ సొంతం చేసుకుంది. కాగా ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 214 పరుగుల భారీ స్కోర్ సాధించింది. విండీస్ కెప్టెన్ షాయ్ హోప్(102) ఆజేయ శతకంతో కదం తొక్కగా.. బ్రాండెన్ కింగ్(62) రాణించాడు.
































