ఏఐ జాబ్స్ కావాలంటే ఉండాల్సిన నైపుణ్యాలివే

ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో కృత్రిమ మేథ వేగంగా దూసుకొచ్చేస్తోంది. ముఖ్యంగా ఏఐ రాకతో ఉద్యోగాలు భారీగా ఆవిరైపోతున్నాయి. ఏఐ వాడకం ద్వారా ఉద్యోగుల సంఖ్యను ఎలా తగ్గించుకోవచ్చని ఆలోచించని సంస్థ లేదంటే ఆశ్చర్యం లేదు.


ఓవైపు ఏఐ స్కిల్స్ నేర్చుకుంటే ఉద్యోగాలను కాపాడుకోవచ్చని చెబుతున్న కంపెనీలు, ఆలోపే ఉద్యోగుల్ని తొలగించేస్తున్నాయి. మరోవైపు కొత్తగా ఏఐ స్కిల్స్ ఉన్న ఉద్యోగుల్ని నియమించుకుంటున్నాయి.

ఈ నేపథ్యంలో అసలు ప్రస్తుత మార్కెట్లో ఏఐ ఉద్యోగాలు అత్యంత డిమాండ్ ఉన్న ఏఐ నైపుణ్యాలు, వాస్తవ ప్రపంచ ఏఐ వ్యవస్థ అభివృద్ధి , విస్తరణకు అవసరమైన ప్రాథమిక సాంకేతిక సామర్థ్యాలు, కొత్తగా వస్తున్న మార్పులపై ఆధారపడి ఉన్నాయి. ఇలా ఈ ఏడాది బాగా డిమాండ్ ఉన్న కొన్ని ఏఐ నైపుణ్యాలను ఓసారి పరిశీలిద్దాం. ఇందులో పైథాన్ ప్రోగ్రామింగ్, మెషీన్ లెర్నింగ్-డీప్ లెర్నింగ్, డేటా సైన్స్-డేటా అనాలసిస్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ (ఎన్ఎల్పీ), కంప్యూటర్ విజన్, జనరేటివ్ ఏఐ, మెషిన్ లెర్నింగ్ ఆపరేషన్స్ వంటివి ఉన్నాయి.

అలాగే వేగంగా అభివృద్ధి చెందుతున్న స్పెషలైజేషన్, అనుబంధ నైపుణ్యాల్లో ప్రాంప్ట్ ఇంజనీరింగ్, క్లౌడ్ ఏఐ ప్లాట్‌ఫారమ్‌లు,

ఏఐ ఎథిక్స్, రెస్పాన్సిబుల్ ఏఐ వంటివి ఉన్నాయి. అలాగే మ్యాథ్స్ నైపుణ్యాలైన లీనియర్ ఆల్జీబ్రా, ప్రాబబిలిటీ, కాలిక్యులస్ కలిగి ఉండాలని, ప్రాజెక్ట్ మేనేజ్ మెంట్, డొమైన్ స్పెసిఫిక్ నైపుణ్యాలు ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అప్పుడే ఏఐ ఉద్యోగాలకు పోటీ పడే అవకాశం ఉంటుందని వివరిస్తున్నారు.

ప్రస్తుతం చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు ఈ స్కిల్స్ ను నేర్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. మరికొన్ని సంస్ధలు మాత్రం ఆ రిస్క్ తమకు ఎందుకని ఉన్న ఉద్యోగుల్ని తీసేసి ఈ నైపుణ్యాలు కలిగిన కొత్త ఉద్యోగుల్ని నియమించుకుంటున్నాయి. కాబట్టి ఇంజనీరింగ్ చదువుల్లోనూ వీటి హవాయే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఏఐ ఆధారిత ఉద్యోగాలు కావాలంటే మాత్రం ఈ స్కిల్స్ లో కొన్నయినా తప్పనిసరిగా నేర్చుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.