ఏఐతో పోయే జాబ్స్ ఏవో చెప్పిన చాట్‌జీపీటీ సృష్టికర్త.. మీరు ఈ లిస్టులో ఉన్నారా

ఏఐ ప్రభావం అనేక రంగాల్లో కనిపిస్తోంది. ఇప్పటికే టెక్ సంస్థలు ఉద్యోగులను భారీ సంఖ్యలో తొలగిస్తున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్న అనేక ఉద్యోగాలు త్వరలో తెరమరుగవుతాయని చాట్‌జీపీటీ సృష్టికర్త శామ్ ఆల్ట్‌మన్ పలు సందర్భాల్లో చెప్పారు.


ఏఐతో ముప్పు పొంచి ఉన్న ఉద్యోగాలేవో కూడా తెలిపారు.

కస్టమర్ సపోర్టు జాబ్స్

కస్టమర్ సర్వీస్, కాల్ సెంటర్ జాబ్స్‌ను భవిష్యత్తులో ఏఐ స్వతంత్రంగా చేయగలుగుతుందని శామ్ ఆల్ట్‌మన్ అన్నారు. ప్రస్తుతం ఉన్న ఏఐ టూల్స్ రియల్ టైమ్ సంభాషణలు జరపగలుగుతున్నాయని తెలిపారు. అనేక విభాగాల్లో చాట్‌జీపీటీ లాంటి మోడల్స్ ఇప్పటికే సేవలందిస్తున్నాయని అన్నారు. ఫలితంగా మనుషుల అవసరం తగ్గిందని చెప్పారు.

డేటా ఎంట్రీ, ట్రాన్స్‌క్రిప్షన్ ఉద్యోగాలు

మాన్యువల్‌గా సమాచారాన్ని ఎంటర్ చేసే డేటా ఎంట్రీ జాబ్స్, ట్రాన్స్‌క్రిప్షన్, రికార్డు కీపింగ్ వంటి ఉద్యోగాలు మొదటగా తెరమరుగుకానున్నాయి. ఈ పనులను ఏఐ మరింత వేగంగా తప్పులు లేకుండా చేయగలుగుతుందని శామ్ ఆల్ట్‌మన్ చెప్పారు. ఫలితంగా సంస్థలకు ఖర్చులు తగ్గుతాయి.

ప్రోగ్రామింగ్ జాబ్స్

ఏఐ ప్రభావంతో కొన్ని ఎంట్రీ లెవెల్ కోడింగ్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ జాబ్స్ కూడా రిస్క్‌లో పడ్డాయి. సంక్లిష్ట వ్యవస్థలకు మనుషుల పర్యవేక్షణ అవసరం ఉన్నప్పటికీ చిన్న చిన్న స్క్రిప్ట్‌లను రాయడం, డీబగ్గింగ్ వంటివి ఏఐ సొంతంగా చక్కబెట్టగలదని అన్నారు.

న్యాయశాస్త్రం, ఫైనాన్షియల్ డాక్యుమెంట్ రివ్యూ విభాగాల్లో కూడా ఏఐ ప్రభావం కనిపిస్తోంది. ప్రస్తుతం ఏఐ భారీ స్థాయిలో డాక్యుమెంట్స్‌ను క్షణాల్లో పరిశీలించి సంక్షిప్త రూపంలో సమాచారాన్ని ఇవ్వగలదు. దీంతో, న్యాయవాద సంస్థలు, ఆర్థిక సంస్థల్లో జూనియర్‌ జాబ్స్‌పై ప్రభావం పడుతుంది.

కంటెంట్ క్రియేషన్‌పై కూడా ఏఐ ప్రభావం ఉండనుంది. ఉత్పత్తుల వివరాలు, బేసిక్ మార్కెటింగ్ కాపీలు రాసే బాధ్యతలు ఏఐకి బదిలీ అయ్యే అవకాశం ఎక్కువని ఆయన అన్నారు. ఫలితంగా ఉద్యోగాల కోతలు ఎక్కువవుతాయని తెలిపారు. మనుషులు చేసినట్టు అనిపించే కంటెంట్‌ను భారీ స్థాయిలో సృష్టించే స్థాయికి ఏఐ వచ్చిందని తెలిపారు.

ఈ మార్పులకు అటు ప్రభుత్వం, ఇటు సమాజం సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. విద్యావిధానం, ప్రభుత్వ విధానాల్లో ఈ మేరకు మార్పులు రావాలని అన్నారు. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఏఐతో కొన్ని జాబ్స్‌ పోయినా కొత్త నైపుణ్యాలు అవసరమైన ఉద్యోగాలు వస్తాయని చెప్పారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.