సాధారణంగా ప్రజలు తమ ఇళ్లల్లో ఏడాదికి సరిపడా బియ్యం, పప్పుల్ని నిల్వ చేసుకుంటూ ఉంటారు. కానీ, చాలా సార్లు అలా నిల్వ వుంచిన బియ్యం, పప్పుకు నల్లటి లక్క పరుగు, తెల్లటి పురుగులు పట్టేస్తుంటాయి.
ముఖ్యంగా వర్షాకాలంలో బియ్యం, పప్పులు వంటివి ఎక్కువగా పాడైపోతుంటాయి. దాంతోపాటుగా ఇలాంటి కీటకాలు కూడా ఎక్కువగా కనిపిస్తాయి. పురుగులు పట్టిన బియ్యం, పప్పులు తినేందుకు చాలామంది ఇష్టపడరు. దాంతో వాటిని చెత్తలో పడేస్తుంటారు. కానీ, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే.. ఇంట్లో నిల్వ ఉంచిన పప్పులు, బియ్యాన్ని ఏడాది కంటే ఎక్కువగానే కాపాడుకోవచ్చు అంటున్నారు నిపుణులు. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం..
సాధారణంగా, బియ్యం డబ్బాలు ఎప్పుడూ మూసి ఉంటాయి. అయినా కూడా బియ్యం పప్పులను ఎక్కువసేపు నిల్వ చేసినప్పుడు పురుగులు వస్తుంటాయి. అలాంటప్పుడు బియ్యానికి పురుగు పట్టకుండా ఉండాలంటే వేప ఆకులు అద్భుతంగా ఉపయోగపడతాయి. వేప ఆకులు సహజంగానే కీటక నాశినిగా పనిచేస్తాయి. బియ్యం డబ్బాలో కొన్ని ఎండిన వేప ఆకులను ఉంచితే, కీటకాలు పారిపోతాయి. ఇలా ఎప్పటికప్పుడు పాత ఆకులను తీసివేస్తూ కొత్త వాటిని వేస్తూ ఉంటే బియ్యంలో ఒక్క పురుగు కూడా ఉండకుండా పోతాయి.
నిల్వ ఉంచిన బియ్యం, పప్పులను కాపాడుకునేందుకు ఇంగువ కూడా ఉపయోగిస్తారు. ఇంగువ బలమైన వాసన బియ్యంలో ఉండే లక్కపురుగు ఇతర నల్ల కీటకాలను తరిమికొట్టడానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఇంగువ బలమైన వాసనను కీటకాలు తట్టుకోలేవు. ఇంగువ ఉంచిన చోట కీటకాలు సంచరించవు. దీనిని బియ్యం డబ్బాలో ఉంచడం వల్ల బియ్యం పప్పులు వంటి పురుగులు పట్టే అవకాశం ఉంటుంది.
అలాగే, బియ్యం పప్పుల్ని రక్షించుకోవటానికి మరో మందు నల్ల మిరియాలు. ఇవి కూడా బియ్యం, పప్పుల్లోని కీటకాలను తరిమేస్తాయి. మిరియాల ఘాటైన వాసన పురుగుల్ని పరిపోయేలా చేస్తాయి. లేదంటే బియ్యం డబ్బాలో ఎండు మిరపకాయలు వేసినా కూడా పురుగు పట్టకుండా ఉంటుంది. అయితే, మీరు ఎండుమిరపకాయల్ని వాడితే గనుక దాదాపు రెండు వారాల తర్వాత పాత మిరపకాయలను తీసి కొత్త వాటిని వేసుకోవాలి. లేదంటే, మిరపఘాటు తగ్గిపోయి పురుగులు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది.
































