ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 20వ విడత నిధులను ఆగస్టు 2న విడుదల చేయాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది.
షెడ్యూల్ ప్రకారం ఈ ఏప్రిల్-జూలై మధ్య 41.58 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేయాల్సిన నిధుల్ని ఆగస్టు 2న జమ చేస్తామని కేంద్రం ప్రకటించింది. ‘సూపర్‌సిక్స్’ హామీల అమలులో భాగంగా ‘అన్నదాత-సుఖీభవ’ పథకం నిధులను కూడా అదేరోజు విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. పీఎం కిసాన్ కింద ఏటా రూ.6వేలు ఇస్తుండగా, అన్నదాత-సుఖీభవ కింద రూ.14వేలు ఇస్తామని రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. వీటిని కేంద్రంతోపాటు మూడు విడతలుగా ఇస్తామని అధికార వర్గాలు తెలిపాయి.
దీని ప్రకారం.. ఆగస్టు 2న కేంద్రం రూ.2వేలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.5వేలు జమ చేస్తాయని సమాచారం. అయితే కౌలు రైతులకు కేంద్రం పీఎం కిసాన్ నిధులు ఇవ్వడం లేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వమే అన్నదాత-సుఖీభవ కింద రెండు విడతల్లో రూ.20 వేలు చెల్లించాలని నిర్ణయించింది.
దీనిలో మొదటి విడతగా వచ్చే అక్టోబరులో రూ.10వేలు చెల్లిస్తామని వ్యవసాయ శాఖ తెలిపింది. ఇప్పటివరకు అన్నదాత-సుఖీభవ పథకం కింద సుమారు 46.64 లక్షల రైతు కుటుంబాలను అర్హులుగా వ్యవసాయ శాఖ గుర్తించింది. ఈ పథకానికి అర్హులైన రైతుల భూ వివరాలను వెబ్‌ల్యాండ్ నుంచి తీసుకుని, అన్నదాత-సుఖీభవ పోర్టల్ ద్వారా గ్రామస్థాయిలో ధ్రువీకరణ చేశారు. భూమి లేని కౌలు రైతులు ఈ పథకం కింద లబ్ధి పొందటానికి కౌలు గుర్తింపు కార్డు పొంది, ఈ-క్రాపులో నమోదు చేసుకోవాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్ డిల్లీరావు చెప్పారు. 2025-26లో ఇంతవరకు 5.9లక్షల కౌలు గుర్తింపు కార్డులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ పథకానికి అర్హత కలిగిన రైతులు ఇంకా ఉంటే గ్రీవెన్స్‌లో ఫిర్యాదులు స్వీకరించి, అర్హులకు సాయం అందిస్తామని సోమవారం ప్రకటించారు.
































