యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నారా..? అయితే ఇది మీకోసమే.

ప్రస్తుత రోజుల్లో జీవనశైలి మారడం వల్ల చాలా మందికి యూరిక్ యాసిడ్ సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా చేతులు, మోకాళ్లు, అరికాళ్లలోని కీళ్లలో నొప్పులు, వాపు లాంటి ఆరోగ్య సమస్యలు బాధిస్తుంటాయి.


యూరిక్ యాసిడ్ పెరిగి రక్తంలో పేరుకుపోతే.. అది గౌట్, ఆర్థరైటిస్ లాంటి వ్యాధులకు దారి తీస్తుంది. కొన్ని తీవ్రమైన కేసుల్లో కిడ్నీల్లో రాళ్లు కూడా వస్తాయి.

యూరిక్ యాసిడ్ ను తగ్గించే సహజ మార్గాలు

యూరిక్ యాసిడ్ సమస్యను మందులు లేకుండానే.. సహజంగా తగ్గించుకోవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. వారు చెబుతున్నదాని ప్రకారం.. కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా యూరిక్ యాసిడ్‌ ను అదుపు చేయవచ్చు.

కీరలో దాగివున్న ఆరోగ్య రహస్యం

కీర దోసకాయలో నీరు చాలా ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల మూత్ర విసర్జన బాగా జరుగుతుంది. ఇందులో ప్యూరిన్ తక్కువగా ఉంటుంది. అందుకే ఇది యూరిక్ యాసిడ్ స్థాయిని పెంచదు అని నిపుణులు చెబుతున్నారు. సుమారు 95 శాతం నీరు ఉండడం వల్ల ఇది శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను సులభంగా బయటకు పంపడానికి సహాయపడుతుంది.

కీర దోసకాయను ఇలా వాడండి..

యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారు.. తాజా దోసకాయ ముక్కలను నిమ్మరసం, చిటికెడు ఉప్పు కలిపి తినవచ్చు. అలాగే దోసకాయ రసం చేసి తాగడం కూడా మంచిదే. ఇంకో ఇంటి చిట్కా కూడా ఉంది.. రాత్రి ఒక గ్లాసు నీటిలో దోసకాయ ముక్కలు, పుదీనా ఆకులు, కొద్దిగా నిమ్మరసం కలిపి నానబెట్టండి. ఉదయం ఖాళీ కడుపుతో తాగితే మంచి ఫలితం ఉంటుంది.

విటమిన్ Cతో పరిష్కారం

విటమిన్ C యాంటీఆక్సిడెంట్ గుణాల వల్ల శరీరంలో వాపును తగ్గిస్తుంది. యూరిక్ యాసిడ్‌ను మూత్రం ద్వారా బయటకు పంపడానికి సహాయపడుతుంది. నిమ్మ, నారింజ, జామ, ఉసిరి లాంటి పండ్లలో విటమిన్ C పుష్కలంగా ఉంటుంది. ఇవి శరీరాన్ని శుభ్రపరచడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

బార్లీతో యూరిక్ యాసిడ్ డౌన్

బార్లీ నీరు లేదా గంజిని రోజూ తీసుకోవడం వల్ల శరీరాన్ని శుద్ధి చేయవచ్చు. ఇది యూరిక్ యాసిడ్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. రాత్రి బార్లీని నానబెట్టి ఉదయం ఉడకబెట్టి తీసుకుంటే మరింత ప్రయోజనం ఉంటుంది.

నీరు మస్ట్

యూరిక్ యాసిడ్‌ ను తగ్గించాలంటే ఎక్కువగా నీరు తాగడం చాలా ముఖ్యం. నిపుణులు చెప్పినట్లు రోజూ కనీసం 2 నుంచి 3 లీటర్ల నీరు తాగాలి. చక్కెర లేని నిమ్మకాయ నీరు కూడా ఆల్కలైన్ ఔషధంగా పని చేస్తుంది.

యూరిక్ యాసిడ్ ఎలా పెరుగుతుంది..?

ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఆహారాలలో ప్యూరిన్ అనే పదార్థం ఎక్కువగా ఉంటుంది. శరీరంలో ఇవి విచ్ఛిన్నమై యూరిక్ యాసిడ్‌గా మారతాయి. సాధారణంగా ఇది మూత్రం ద్వారా బయటకు పోతుంది. కానీ ఎక్కువగా పేరుకుపోతే.. అది కీళ్ల నొప్పులు, గౌట్, కిడ్నీలో రాళ్లు లాంటి సమస్యలకు కారణమవుతుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.