ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే చైనా నుంచి మరో షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. డ్రాగన్ కంట్రీ లోని హునాన్ ప్రావిన్స్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు నిల్వ కనుగొన్నట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది.
ఈ బంగారు గని ద్వారా ప్రపంచ పసిడి మార్కెట్లో చైనా టాప్ లీడర్ గా ఎదిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే బంగారం ధర నియంత్రణ మొత్తం చైనా చేతుల్లోకి వెళ్లిపోతుంది. పసిడి ధరను డ్రాగన్ కంట్రీ డిసైడ్ చేసే రోజులు వస్తాయి.
చైనా ప్రభుత్వానికి చెందిన స్టేట్ మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం.. హునాన్ ప్రావిన్స్‌లోని పింగ్జియాంగ్ కౌంటీలో దాదాపు 1,000 మెట్రిక్ టన్నుల అధిక నాణ్యత కలిగిన బంగారు నిక్షేపాలను చైనా శాస్త్రవేత్తలు గుర్తించారు. దీని విలువ అంచనాల ప్రకారం దాదాపు 83 బిలియన్ డాలర్లు. మన కరెన్సీలో చెప్పాలంటే దాదాపు రూ. 7 లక్షల కోట్లుకి పైగానే ఉంటుంది.ఇది ఇప్పటి వరకు ప్రపంచంలో కనుగొనబడిన అత్యంత భారీ బంగారు నిల్వ అని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటి వరకు ఈ రికార్డు దక్షిణాఫ్రికాలోని సౌత్ డీప్ మైన్ పేరు మీద ఉంది. అక్కడ 900 మెట్రిక్ టన్నుల బంగారు నిల్వలు గుర్తించారు. తాజాగా ఈ రికార్డును చైనా అధిగమించింది.
ఈ నిక్షేపాలను హునాన్ జియోలాజికల్ బ్యూరోకు చెందిన శాస్త్రవేత్తల బృందం కనుగొంది. వారు 2 కిలోమీటర్ల లోతులో బంగారు అవశేషాలను గుర్తించారు. ప్రాథమికంగా అక్కడే సుమారు 300 మెట్రిక్ టన్నుల బంగారం ఉందని అంచనా వేయబడింది. అయితే ఆధునిక 3D మోడలింగ్ ఆధారంగా ఇంకా 3 కిలోమీటర్ల లోతులో అధిక మొత్తంలో బంగారు నిక్షేపాలు ఉండే అవకాశాలు ఉన్నాయని వారు తెలిపారు. శాస్త్రవేత్త చెన్ రులిన్ తెలిపిన వివరాల ప్రకారం.. డ్రిల్లింగ్ ద్వారా సేకరించిన రాతి పొరల్లోని ప్రతి మెట్రిక్ టన్నులో సగటున 138 గ్రాముల బంగారం ఉండే అవకాశం ఉందన్నారు. ఇది అసాధారణంగా అధిక నాణ్యతగా (హై గ్రేడ్) పరిగణించబడుతుందన్నారు. సాధారణంగా 8 గ్రాముల కంటే ఎక్కువ బంగారం ఉండే నిక్షేపాలు హై గ్రేడ్‌గా వర్గీకరించబడతాయి.
చైనా ఇప్పటికే ప్రపంచ Gold మార్కెట్లో అగ్రస్థానంలో ఉంది. దేశంలో 2 వేల మెట్రిక్ టన్నులకు పైగా బంగారు నిల్వలు ఉన్నట్టు అనధికార సమాచారం. డ్రాగన్ కంట్రీ ప్రపంచ బంగారు ఉత్పత్తిలో సుమారు 10 శాతం వాటాను కలిగి ఉంది. తాజాగా కనుగొన్న బంగారు నిల్వలతో బంగారం మార్కెట్ మీద చైనా ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
బంగారం ఎలా ఏర్పడుతుంది: భూమి లోపలున్న మాగ్మా లేదా మినరల్ రిచ్ ఫ్లూయిడ్స్ భూమి పగుళ్ల ద్వారా కదులుతూ రాళ్లలోని బంగారాన్ని సమీకరిస్తూ ఉంటాయి. ఆ ద్రవాలు ఉష్ణోగ్రతలు లేదా ఒత్తిడి మారినప్పుడు బంగారాన్ని పగుళ్లలో నిక్షిప్తం చేస్తాయి. ఈ ప్రక్రియలు మిలియన్ల సంవత్సరాల పాటు సాగుతూ చివరికి భారీ Gold నిక్షేపాలుగా మారతాయి. ఇంకొక ప్రక్రియలో పీజోఎలక్ట్రిసిటీ.. భూకంపాల వల్ల ఏర్పడే భౌగోళిక ఒత్తిడిని కేంద్రంగా చేసుకుని పెద్ద Gold ముక్కల ఏర్పాటుకు దోహదపడుతుంది. ఇదే తీరులో హునాన్‌లో బంగారం ఏర్పడిందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.చైనా కనుగొన్న నిల్వతో బంగారంపై గ్లోబల్ సెంటిమెంట్ బలపడే అవకాశముంది. ధరలు పెరిగే సూచనలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి.
డిస్క్లైమర్: ఈ వ్యాసం కేవలం సమాచారం కోసం మాత్రమే అందించబడింది. ఇది విలువైన లోహాలు, వస్తువులు, స్టాకులు లేదా ఇతర ఆర్థిక పెట్టుబడులను కొనుగోలు చేయమని లేదా అమ్మమని చెప్పడం కాదు. ఈ వ్యాసంలోని సమాచారం ఆధారంగా ఎవరైనా నష్టాలు లేదా సమస్యలను ఎదుర్కొంటే, గ్రేనియమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు, భాగస్వాములు లేదా రచయితలు ఎలాంటి బాధ్యత వహించరు. కాబట్టి మీరు ఏవైనా లావాదేవీలు జరిపే ముందు నిపుణులను సంప్రదించి నిర్ణయం తీసుకోండి.
































