విజయ్ దేవరకొండ హీరోగా, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘కింగ్‌డమ్’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘కింగ్‌డమ్’ ఒక స్పై యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది.
ఇందులో అన్నదమ్ముల సెంటిమెంట్ ప్రధానంగా ఉంటుంది. శ్రీలంక బ్యాక్‌డ్రాప్‌తో రూపొందిన ఈ యాక్షన్ డ్రామాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించగా, సత్యదేవ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. గురువారం ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా, బుధవారమే యూఎస్‌లో ప్రీమియర్స్ మొదలయ్యాయి. దీనిలో భాగంగానే సినిమా చూసిన అభిమానులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
కథ
‘కింగ్‌డమ్’ కథ ఒక యువకుడు సూరి (విజయ్ దేవరకొండ) చుట్టూ తిరుగుతుంది. అతను ఒక అత్యవసర ఆపరేషన్ కోసం అండర్‌కవర్ స్పైగా మారాల్సి వస్తుంది. ఈ క్రమంలో శ్రీలంకకు వెళ్ళిన సూరి, అక్కడ ఒక క్రిమినల్, మాఫియా డాన్‌గా ఉన్న వ్యక్తి తన సొంత అన్నయ్య శివ (సత్యదేవ్) అని తెలుసుకుంటాడు. అన్నయ్యను చంపాల్సిన పరిస్థితులు ఏర్పడినప్పుడు, సూరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? మాఫియాలో ఉన్నా రాబిన్‌హుడ్ లాగా ప్రజలకు సహాయం చేసే అన్నయ్య శివ నేపథ్యం ఏమిటి? సూరి జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుంది, తన లక్ష్యాన్ని ఎలా చేరుకుంటాడు అన్నది ‘కింగ్‌డమ్’ సినిమా కథ.
ట్రైలర్‌లోనే కథను చెప్పేసిన దర్శకుడు, సినిమాను మాత్రం ఆసక్తికరంగా తెరకెక్కించినట్టు చెబుతున్నారు.మొదటి భాగాన్ని యాక్షన్ డ్రామాగా తెరకెక్కించిన దర్శకుడు, ఇంటర్వెల్‌లో ఇచ్చిన ట్విస్ట్‌తో మంచి ఫీల్ కలుగుతుందని నెటిజన్లు చెప్పుకొస్తున్నారు.
సెకండాఫ్‌లో సినిమాను పూర్తిగా వేరే మలుపు తిప్పుతుందని, ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని అభిప్రాయపడుతున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ నేపథ్య సంగీతం సినిమాకు బలంగా నిలిచిందని, మొత్తంగా, ‘కింగ్‌డమ్’ ఒక అన్నదమ్ముల అనుబంధం, యాక్షన్, భావోద్వేగాలు, ట్విస్ట్ అంశాలతో కూడిన సినిమాగా ప్రేక్షకుల అభిప్రాయపడుతున్నారు. సినిమా పూర్తి ఫలితం ఎలా ఉండనుందో గురువారం తెలిపోనుంది.
































