న్యాయవాదుల ముందు గుంజీలు తీసిన ఐఏఎస్‌ అధికారి బదిలీ

ఉత్తర్‌ప్రదేశ్‌లోని షాజహాన్‌పుర్‌ జిల్లా పువాయా పట్టణ సబ్‌ డివిజనల్‌ మేజిస్ట్రేటు (ఎస్‌డీఎం)గా నియమితులైన ఐఏఎస్‌ అధికారి రింకూసింగ్‌ రాహీ వైరల్‌గా మారిన ఓ వీడియో కారణంగా ఒక్కరోజులో బదిలీ కావాల్సి వచ్చింది. లఖ్‌నవూలోని రెవెన్యూ కౌన్సిలుకు ఆయన బదిలీ కాగా, షాజహాన్‌పుర్‌ జిల్లా మెజిస్ట్రేటు ధర్మేంద్ర ప్రతాప్‌సింగ్‌ బుధవారం ఈ విషయాన్ని ధ్రువీకరించారు. మంగళవారం ఎస్‌డీఎం బాధ్యతలు చేపట్టిన రింకూసింగ్‌ తొలిరోజు కార్యాలయ ఆవరణను, మరుగుదొడ్లను పరిశీలించి అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు. ఇకపై బహిరంగంగా ఎవరైనా మూత్ర విసర్జన చేసినా, ఆవరణను అపరిశుభ్రం చేసినా శిక్షగా గుంజీలు తీయాల్సి ఉంటుందని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం సమ్మెలో ఉన్న న్యాయవాదుల బృందం తనను కలవగా రింకూసింగ్‌ ‘గుంజీల శిక్ష’ గురించి ప్రస్తావించారు. ప్రస్తుత దుస్థితికి అధికారుల బాధ్యత కూడా లేకపోలేదని న్యాయవాదులు చెప్పారు. రింకూసింగ్‌ ఈ విషయాన్ని అంగీకరిస్తూ తన రెండు చెవులను పట్టుకొని అందరి ముందు గుంజీలు తీశారు. ఈ చర్య ఆయన బదిలీకి దారితీసింది.


👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.