రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: రాజమహేంద్రవరంలో చుట్టుపక్కల గ్రామాల విలీనానికి కసరత్తు కొనసాగుతోంది. కొన్నేళ్లుగా ఈ అంశం వాయిదా పడుతున్న వస్తోంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం దీనిని కొలిక్కి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. వాస్తవానికి గతంలోనే విలీన ప్రక్రియకు అంకురార్పణ చేయగా, కొంత మంది రాజకీయ నేతలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇటీవల విలీన ప్రతిపాదిత గ్రామ పంచాయతీలతో కలిసి మాస్టర్ ప్లాన్ రూపొందించి ప్రభుత్వానికి నివేదించారు. తద్వారా భవిష్యత్తు అవసరాలకనుగుణంగా అక్కడ కూడా సౌకర్యాలు మెరుగుపడనున్నాయి.
ప్రతిపాదనలు ఇలా..
గతంలో నగరానికి ఆనుకొని చుట్టుపక్కల 21 గ్రామ పంచాయతీలను విలీనం చేసేందుకు ప్రతిపాదనలు చేశారు. ఆ తర్వాత అర్బన్‌కు చుట్టూ 5 కి.మీ మేర ఉన్న పంచాయతీలను నగరంలో కలిపేందుకు సిద్ధమయ్యారు. దీని ప్రకారం తొర్రేడు, వెంకటనగరం, కాతేరు, హుకుంపేట , పిడింగొయ్యి, శాటిలైటు సిటీ, బొమ్మూరు, ధవళేశ్వరం, రాజవోలు, వేమగిరి గ్రామ పంచాయతీలను నగరంలో కలపాలని ప్రతిపాదనలు చేశారు. ప్రస్తుతం నగర విస్తీర్ణం 44.5 కి.మీ ఉండగా విలీనంతో 164. కి.మీ అవుతుంది. జనాభా 2011 ప్రకారం 3.4 లక్షల మంది ఉండగా ప్రస్తుతం అదనంగా లక్షన్నర మంది ఉన్నారు. విలీనం జరిగితే పది లక్షల లోపు జనాభా పట్టణాల జాబితాలో నగరం చేరుతుంది. దీని ద్వారా కేంద్రం ప్రత్యేక గ్రాంట్లు విడుదల చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా స్మార్ట్ సిటీ ఎంపిక జాబితాలో చోటు దక్కించుకొంటుంది. గత పుష్కరాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు మహా రాజమహేంద్రవరంను ప్రకటించారు. ఆ తర్వాత వచ్చిన వైకాపా సర్కారు ఈ ప్రతిపాదనను అటకెక్కించింది.
నిధులు విడుదల కాక..పాలక వర్గాలు లేక
విలీన ప్రతిపాదిత గ్రామాల్లో మూడేళ్లుగా ఆర్థిక సంఘం నిధులు విడుదల కావడం లేదు. ఎన్నికలు లేకపోవడంతో పాలకవర్గం లేక నిధులు ఆగిపోతున్నాయి. ఆ ప్రభావం గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా తదితర మౌలిక సదుపాయాల కల్పనపై పడుతోంది. ఇటీవల రాష్ట్ర పురపాలిక శాఖ మంత్రి నారాయణ విలీన ప్రతిపాదిత అంశాలను పరిగణనలోకి తీసుకొంటున్నట్లు తెలిపారు. ముఖ్యంగా కోర్టు అంశాలను పరిష్కరించి, నగరంలో ఎన్నికలకు ముందుకెళ్తామని ప్రకటించారు. గతంలోనే విలీన గ్రామాల్లో రికార్డులను స్వాధీనం చేసుకొని వార్డుల విభజన కూడా చేపట్టారు. ప్రభుత్వం చొరవ చూపడంతో కోర్టు అంశం కొలిక్కి తీసుకురావడం ద్వారా విలీనం లాంఛనం కానుంది.
































