సర్కార్ ఎక్స్ ప్రెస్ లో ప్రయాణించే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ఇవాళ కీలక అలర్ట్ జారీ చేసింది. సర్కార్ ఎక్స్ ప్రెస్ నాలుగు రైళ్ల ప్రయాణ తేదీల్లో మార్పులు చేసింది.
ఈ మార్పులు అక్టోబర్ నుంచి అమల్లోకి రాబోతున్నాయి. కాబట్టి అక్టోబర్ నుంచి సర్కార్ ఎక్స్ ప్రెస్ లో ప్రయాణించే వారు ఈ మార్పుల్ని గమనించి టికెట్లు బుక్ చేసుకోవడంతో పాటు ప్రయాణాలు ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.
తమిళనాడు, పుదుచ్చేరి-కాకినాడ మధ్య ప్రయాణించే సర్కార్ ఎక్స్ ప్రెస్ రైళ్ల ప్రయాణ తేదీల్లో దక్షిణ మధ్య రైల్వే ఇవాళ కీలక మార్పులు చేసింది. చెంగల్పట్టు-కాకినాడ పోర్ట్ మధ్య ప్రయాణించే సర్కార్ ఎక్స్ ప్రెస్ లు నంబర్ 17643/17644, అలాగే కాకినాడ పోర్టు-పుదుచ్చేరి మధ్య ప్రయాణించే సర్కార్ ఎక్స్ ప్రెస్ లు నంబర్ 17655/17656 ల ప్రయాణ తేదీల్లో మార్పులు చోటు చేసుకోబోతున్నాయి.
చెంగల్పట్టు నుంచి -కాకినాడ పోర్టుకు ప్రయాణించే సర్కార్ ఎక్స్ ప్రెస్ రైలు నంబర్ 17643 ప్రస్తుతం ఉన్న మంగళవారం, బుధవారం, శనివారం,ఆదివారానికి బదులుగా అక్టోబర్ 3వ తేదీ నుంచి మంగళవారం, బుధవారం, శుక్రవారం, ఆదివారం నడపబోతున్నారు. అలాగే కాకినాడ పోర్టు నుంచి చెంగల్పట్టుకు వెళ్లే సర్కార్ ఎక్స్ ప్రెస్ రైలు నంబర్ 17644 ప్రస్తుతం ఉన్న సోమవారం, మంగళవారం, శుక్రవారం, శనివారానికి బదులుగా అక్టోబర్ 3 నుంచి మంగళవారం, బుధవారం, శుక్రవారం, ఆదివారం ప్రయాణించనుంది.
కాకినాడ పోర్టు నుంచి పుదుచ్చేరికి ప్రయాణించే సర్కార్ ఎక్స్ ప్రెస్ రైలు నంబర్ 17655 ప్రస్తుతం బుధవారం, గురువారం, ఆదివారం నడుస్తుండగా.. అక్టోబర్ 4 నుంచి సోమవారం, గురువారం, శనివారాల్లో నడపనున్నారు. అలాగే పుదుచ్చేరి నుంచి కాకినాడ పోర్టుకు వచ్చే సర్కార్ ఎక్స్ ప్రెస్ రైలు నంబర్ 17656 ప్రస్తుతం సోమవారం, గురువారం, శుక్రవారాల్లో ప్రయాణిస్తుండగా.. అక్టోబర్ 2 నుంచి సోమవారం, గురువారం, శనివారం నడపబోతున్నారు. కాబట్టి సర్కార్ ఎక్స్ ప్రెస్ ప్రయాణికులు తప్పకుండా ఈ మార్పులు గమనించి ప్రయాణాలు ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే సర్కార్ ఎక్స్ ప్రెస్ రైళ్ల ప్రయాణ సమయాల్లో మాత్రం ఎలాంటి మార్పులు లేవు.
































