ఆంధ్రప్రదేశ్‌లోని లక్షలాది మంది రైతులకు రిలీఫ్ కలిగించే నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న నీటి పన్నుపై వడ్డీ బకాయిలు మొత్తాన్ని పూర్తిగా మాఫీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
2024-25 ఆర్థిక సంవత్సరం వరకు పెండింగ్‌లో ఉన్న వడ్డీ మొత్తంగా రూ.85.81 కోట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించగా.. రైతులపై అదనపు భారం పడకూడదని భావించిన ప్రభుత్వం ఈ మొత్తాన్ని ఒక్కసారిగా రద్దు చేసింది.
ఈ మేరకు రెవెన్యూ శాఖ జూలై 31న జీవో నెం. 262ను విడుదల చేసింది. ఏపీ నీటి పన్ను చట్టం – 1988 ప్రకారం ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. రైతుల వద్ద నుంచి మిగిలిన అసలు బకాయిలను వసూలు చేస్తూ, వాటికి వడ్డీ మొత్తాన్ని మాఫీ చేయాలని భూపరిపాలన కమిషనర్ చేసిన ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదించింది.
వడ్డీ మాఫీ – రైతులకు ఊరట, ప్రభుత్వానికి ఆదాయం
వాటర్ టాక్స్ వసూలులో వడ్డీ రైతులకు పెద్ద భారంగా మారడంతో, వడ్ల సాగు చేసే చిన్న రైతులపై తీవ్ర ప్రభావం పడింది. తక్కువ సాగుపై పెద్ద మొత్తంలో వడ్డీ వేయడంతో అసలు బిల్లు చాలామంది చెల్లించలేదు. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల.. రైతులు ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులు.. అసలు పన్నులో చెల్లించే అవకాశముంది.
అటు ప్రభుత్వం కూడా వడ్డీని మాఫీ చేయడం ద్వారా.. అసలు పన్నును అయినా వసూలు చేసే వీలుంటుంది. ఇప్పటికే అంచనా ప్రకారం రూ.100 కోట్లకు పైగా అసలు బకాయిలు ఉన్నట్లు రెవెన్యూ శాఖ లెక్కలు చెబుతున్నాయి.
నిధుల అంగీకారంతో జీవో విడుదల
ఈ ఉత్తర్వు కోసం ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ అంగీకారం కూడా లభించింది. జూన్ 24న ఫైనాన్స్ విభాగం నుంచి స్పష్టమైన క్లియరెన్స్ వచ్చిందని, తదుపరి చర్యలకు సంబంధించి భూముల పరిపాలన కమిషనర్, ప్రత్యేక ముఖ్యకార్యదర్శి జయలక్ష్మి ఆదేశాలిచ్చారని ప్రభుత్వం తెలిపింది.
































