కారు కొనాలంటే ఒక పెద్ద జీతం అవసరమా?, లేదా బ్యాంక్‌లో నుండి లోన్ తీసుకోవాల్సిందేనా?. ఇవన్నీ అవసరం కాదు, అక్కరలేదు. ఒక చిన్న ప్రణాళిక, క్రమబద్ధమైన పొదుపు, కొద్దిగా ఓపిక ఉంటే చాలు – మీరు కూడా లోన్ లేకుండానే కొత్త కారు కొంటారు.
సరిగ్గా ఇదే నిరూపించాడు ఇండోర్‌కు చెందిన ఒక 27 ఏళ్ల టెక్నీషియన్. అతని నెల జీతం రూ.34,000 మాత్రమే. అయినా, పక్కా ప్లాన్‌తో, అతను మూడు సంవత్సరాల్లో ఒక్క రూపాయి కూడా లోన్ తీసుకోకుండా రూ. 7 లక్షల విలువైన కారు కొనుగోలు చేశాడు. చార్టెడ్ అకౌంటెంట్ అభిషేక్ వాలియా ఈ కథనాన్ని తన లింక్డిన్ అకౌంట్లో షేర్ చేశారు, ఇప్పుడా పోస్ట్ వైరల్‌గా మారింది. స్ఫూర్తిదాయకమైన నిజ జీవిత పాఠంగా ప్రశంసలు అందుకుంటోంది.
సాధారణమైన ప్రణాళిక – అద్భుతమైన ఫలితం
వాలియా చెప్పిన వివరాల ప్రకారం, ఆ టెక్నీషియన్ వద్ద అప్పటికే రూ. 1 లక్ష రికరింగ్ డిపాజిట్ (RD)లో ఉంది. అతనికి క్రెడిట్ కార్డు కూడా లేదు, నిజానికి ఇదే పెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది. అంటే, అతనికి క్రెడిట్ కార్డ్ అప్పులు లేవు. అతను, మూడేళ్ల క్రితం నుంచి, ప్రతి నెలా రూ. 6,000 ను షార్ట్ టెర్మ్ డెట్ మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేశాడు. నెలకు మరో రూ. 2,000 చొప్పున, కార్ కోసం ప్రత్యేకంగా ఓ రికరింగ్ డిపాజిట్లో వేయడం ప్రారంభించాడు.
సంపాదన నుంచి పొదుపు చేయడం ప్రారంభించిన ఆ టెక్నీషియన్, వారాంతాల్లో ఫ్రీలాన్స్ వైరింగ్ పనులు చేస్తూ ప్రతి నెలా అదనంగా రూ. 5,000 సంపాదించాడు.
మూడు సంవత్సరాల తర్వాత…
ఇలా క్రమశిక్షణతో పొదుపు చేస్తూ, అతను మూడేళ్లలో రూ. 2.5 లక్షలను మ్యూచువల్ ఫండ్స్ ద్వారా, రూ. 2.10 లక్షలను RDల ద్వారా పొదుపు చేశాడు. అదనంగా, ఫ్రీలాన్స్ పనుల ద్వారా రూ. 2 లక్షలు, మూడేళ్లలో దీపావళి బోనస్‌గా రూ. 50,000, పాత స్కూటర్ అమ్మడం ద్వారా మరో రూ. 10,000 సంపాదించాడు. మొత్తంగా, అతని దగ్గరకు రూ. 7.10 లక్షలు వచ్చి చేరింది. ఆ డబ్బుతో, ఒక్క రూపాయి కూడా అప్పు లేకుండా కొత్త కారును కొనుగోలు చేశాడు.
“చిన్న జీతగాడికి ఇది పెద్ద విజయం. ఇది చిన్న జీతంతో ఇది సాధ్యమే. కానీ, పెద్ద డిసిప్లిన్, ఖచ్చితమైన ప్రణాళిక అవసరం” – అభిషేక్ వాలియా
మీరూ ఇలా చేయవచ్చు
ఈ కథనం, సొంత కారు కల ఉన్న మన లాంటి చిరుద్యోగులకు & అల్పాదాయ వ్యక్తులకు ఒక మంచి పాఠం. వెయ్యి ఉద్యోగాలు మారినా, లక్షల జీతం వచ్చినా లాభం లేదు – మన అసలైన లక్ష్యం ఏమిటో తెలుసుకుని, దానికి తగ్గట్టు వాస్తవికమైన ప్రణాళిక వేసుకుంటే చాలు, లక్ష్య సాధన పూర్తవుతుంది.
కారు కొనాలంటే లోన్ తీసుకోవడం తప్పనిసరి కాదు
మీ ఆదాయాన్ని బట్టి పొదుపును ప్రారంభించండి. పొదుపు చేసే అలవాటు తెచ్చుకోండి. అవసరమైతే అదనపు ఆదాయం కోసం చిన్న చిన్న పనులు చేయండి. మూడు సంవత్సరాలు గట్టిగా ఓపిక పట్టిన మనిషి, ఈ రోజు మంచి కారులో తిరుగుతున్నాడు – ఎలాంటి EMI లేకుండా!.
ఓ మంచి మాటను గుర్తు పెట్టుకుందా
పెద్ద కలలు సాకారం కావాలంటే పెద్ద జీతం అవసరం లేదు – చిన్న చిత్తశుద్ధి, క్రమబద్ధమైన ప్రణాళిక, ఓపిక చాలు. మీరు కోరుకునే కారుకు మీరు యజమాని అవుతారు. ఇప్పుడు మిగిలింది… మీరు ఎప్పుడు మొదలు పెడతారన్నదే.
































