ఏపీ మెగా డీఎస్సీ తుది ‘కీ’ను విడుదల చేశారు. దీనిని అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్టు డీఎస్సీ కన్వీనర్ ఎం.వి. కృష్ణారెడ్డి వెల్లడించారు.
ముందుగా విడుదల చేసిన ప్రాథమిక కీపై అభ్యర్థులు అందించిన అభ్యంతరాలను సేకరించి, వాటిని విషయం నిపుణుల బృందం సమీక్షించి తుది కీని రూపొందించారు. ఈ తుది కీపై ఇకపై ఎలాంటి అభ్యంతరాలు స్వీకరించబోమని కన్వీనర్ స్పష్టం చేశారు. అభ్యర్థులు తమ వివరాలతో అధికారిక వెబ్‌సైట్‌లో లాగిన్ అయి ఫైనల్ కీని పరిశీలించవచ్చు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 16,347 టీచర్ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 3,36,307 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. జూన్ 6 నుంచి జూలై 2 వరకు 23 రోజులపాటు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించగా, ఏపీతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశాల్లోనూ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 92.90 శాతం మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. త్వరలోనే ఫలితాలను విడుదల చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
































