ఆకాశంలో అప్పుడప్పుడూ అద్భుతాలు చోటు చేసుకుంటాయి. ఉల్కాపాతం సంభవించి.. మనోహర దృశ్యాలు కనిపిస్తుంటాయి. ప్రధానంగా ఉరుములతో కూడిన వర్షాలు పడుతున్నపుడు పెద్ద పెద్ద మెరుపులు చూస్తుంటాం.
క్షణాల్లోనే మెరుపు మాయమైనా.. ఆ వెంటనే వచ్చే చప్పుడుకి గుండెలదిరిపోతాయి. అయితే, ఈ మెరుపులకి (Lightning) కూడా ఓ రికార్డు ఉందని తెలుసా? ప్రపంచంలోనే అత్యంత పొడవైన మెరుపు 829 కిలోమీటర్లట. అమెరికాలోని (USA) టెక్సాస్ (Texas), కన్సాస్ (Kansas) మధ్య 2017 అక్టోబర్ 22న అది ఏర్పడింది. 2020 ఏప్రిల్ 29న 768 కి.మీ పొడవుతో ఏర్పడిన మెరుపు రెండో స్థానంలో ఉంది. ఇది కూడా అమెరికాలోని టెక్సాస్, మిసిసిపీ మధ్య ఏర్పడినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారని ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) చెబుతోంది.
అయితే, మెరుపు పొడవును కొలిచే ప్రక్రియలో 8 కి.మీ ఎక్కువ లేదా తక్కువ ఉండొచ్చని డబ్ల్యూఎంవో వెల్లడించింది. సాధారణంగా ఇలాంటి భారీ మెరుపులు పెద్ద పెద్ద తుపానులు వచ్చినప్పుడు కనిపిస్తుంటాయి. ఈ సమయంలో చాలా ఎక్కువ దూరం ప్రయాణిస్తుంటాయి. దీనినే ‘బోల్ట్ ఆఫ్ ది బ్లూ’ గా పిలుస్తారు. మెరుపులు అత్యంత ప్రమాదకరం కూడా. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో ఇలాంటి భారీ మెరుపుల వల్ల ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు డబ్ల్యూఎంవో పేర్కొంది. అంతేకాకుండా పిడుగుపాటు వల్ల ఎవరూ ప్రాణాలు కోల్పోకుండా ఉండేందుకు.. ప్రపంచ వ్యాప్తంగా ఓ అధునాతన వాతావరణ హెచ్చరిక వ్యవస్థను తీసుకొచ్చేందుకు ప్రపంచ దేశాలు కృషి చేస్తున్నాయని తెలిపింది. 2027నాటికి ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
మెరుపుల రికార్డులు
- 2020 జూన్ 18న ఉరుగ్వే-అర్జెంటీనా మధ్య 17.102 సెకెన్ల పాటు ఒక మెరుపు ఏర్పడింది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ సమయం కనిపించిన మెరుపు అని డబ్ల్యూఎంవో వెల్లడించింది.
- 1994లో ఈజిప్ట్‌లోని డ్రోంకాలో చమురు ట్యాంక్‌పై ఓ పిడుగుపడింది. దీంతో 469 మంది ప్రాణాలు కోల్పోయారు. పిడుగుపాటు వల్ల పరోక్షంగా ఇంత మంది చనిపోవడం ఇదే తొలిసారి.
- 1975లో జింబాబ్వేలో భారీ పిడుగు పడింది. ఈ ఘటనలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. ఓ పిడుగుపాటు ఘటనలో ఇంత ఎక్కువ మంది చనిపోవడం ఇదే ప్రథమం.
కొనసాగుతున్న పరిశోధనలు
మెరుపుల్లో భారీ మొత్తంలో విద్యుత్ శక్తి ఉంటుంది. వాటిని ఒడిసి పట్టుకోగలిగితే.. చాలా వరకు విద్యుత్ అవసరాలను తీర్చుకోవచ్చు. మెరుపుల్ని గుర్తించేందుకు 2016లో శాటిలైట్ మ్యాపింగ్ వ్యవస్థను అమెరికా అందుబాటులోకి తీసుకొచ్చింది. అప్పటి నుంచి సమాచారాన్ని సేకరిస్తూనే ఉంటోంది. తద్వారా భారీ మెరుపులు ఎప్పుడు, ఏ ప్రాంతంలో ఏర్పడే అవకాశముందో అంచనావేయవచ్చు. అంతేకాకుండా వాతావరణ పర్యవేక్షణలో పురోగతి సాధించినట్లవుతుంది. ప్రకృతి విపత్తులను ముందే గ్రహించి తగిన హెచ్చరికలు జారీ చేయడం ద్వారా నష్టాన్ని నివారించే అవకాశం ఉంటుంది. దీనిపై ప్రస్తుతం పరిశోధనలు జరుగుతున్నాయి.
































