Pune Man Dies in Gym: పిట్టల్లా రాలిపోతున్న మనుషులు.. కారణమేంటి..?

కనిపించని ఓ శత్రువు క్షణాల వ్యవధిలోనే ప్రాణాలు తీస్తోంది. నవ్వుతున్నోళ్లు నవ్వుతున్నట్లే.. ఆడుతున్నోళ్లు ఆడుతున్నట్లే తీసుకెళ్తోంది.


గత కొంతకాలంగా అకస్మాత్తు గుండెపోటుతో మరణిస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా యువత.. అర్థాయుషుతోనే వారి జీవితం ముగుస్తోంది. ఇటీవల కాలంలో జరిగిన కొన్ని సంఘటనలు ఈ సమస్య తీవ్రతను తెలియజేస్తున్నాయి.

పుణెలోని పింప్రి-చించ్వాడ్‌లో శుక్రవారం ఉదయం జిమ్ చేస్తూ ఒక వ్యక్తి అకస్మాత్తుగా కుప్పకూలిపోయి మరణించడం స్థానికంగా ఆందోళన కలిగించింది. మృతుడిని చిన్చ్వాడ్‌కు చెందిన మిలింద్ కులకర్ణి (37)గా(Milind Kulkarni Chinchwad) గుర్తించారు. సోషల్ మీడియాలో జిమ్ సీసీటీవి ఫుటేజ్ వీడియోలు(CCTV footage gym death) వైరల్ అవుతున్నాయి. మిలింద్ కులకర్ణి గత 6 నెలలుగా జిమ్‌కు వెళ్తున్నారు. శుక్రవారం ఉదయం తన వ్యాయామ సెషన్ ముగించుకుని, నీళ్లు తాగుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. జిమ్‌లోని సీసీటీవీ ఫుటేజీలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. వెంటనే అప్రమత్తమైన తోటి జిమ్ సభ్యులు, సిబ్బంది ఆయనను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

బ్యాడ్మింటన్ ఆడుతూ రాకేష్..

హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో 26 ఏళ్ల యువకుడు రాకేష్ బ్యాడ్మింటన్ ఆడుతూ కుప్పకూలిపోయాడు. వీడియోలో అతను చురుగ్గా ఆడుతూ కనిపించాడు, కానీ ఒక పాయింట్ కోల్పోయిన తర్వాత షటిల్‌కాక్ తీసుకోవడానికి వెళ్తూ అకస్మాత్తుగా పడిపోయాడు. ఆసుపత్రికి తరలించేలోపే మరణించాడు. పోస్టుమార్టం నివేదికలో గుండెపోటే మరణానికి కారణమని తేలింది. ఈ ఘటన జిమ్‌లలో, క్రీడా మైదానాల్లో యువత గుండె ఆరోగ్యంపై చర్చకు దారితీసింది.

40 రోజుల్లో 26 మంది యువకులకు గుండెపోటు

కర్ణాటక: కర్ణాటకలోని హాసన్ జిల్లాలో 40 రోజుల్లో 26 మందికి పైగా యువకులు గుండెపోటుతో మరణించారు. వీరిలో చాలామంది 30 ఏళ్లలోపు వారే. దీనిపై కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తుకు ఆదేశించింది. ఈ మరణాలకు గల కారణాలను పరిశీలించడానికి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది.

ఢిల్లీలో మోహిత్ సచ్‌దేవా

ఢిల్లీకి చెందిన 40 ఏళ్ల మోహిత్ సచ్‌దేవా అనే రియల్టర్ జిమ్‌లో లెగ్ ప్రెస్ చేస్తూ గుండెపోటుకు గురయ్యారు. సకాలంలో సీపీఆర్ అందించడం వల్ల ప్రాణాలతో బయటపడ్డారు. అతనికి మూడు ప్రధాన గుండె ధమనులు మూసుకుపోయినట్లు వైద్యులు గుర్తించారు. చాలా కాలంగా వ్యాయామం చేసేటప్పుడు తన ఎడమ చేతిలో వచ్చే నొప్పిని కండరాల నొప్పిగా నిర్లక్ష్యం చేశానని ఆయన తెలిపారు.

కారణాలు:

జీవనశైలి మార్పులు, శారీరక వ్యాయామం లేకపోవడం, ఒత్తిడితో కూడిన జీవితం, మద్యం, ధూమపానం, ఇతర చెడు అలవాట్లు యువత గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. గతంలో 60 ఏళ్లు దాటిన వారికి వచ్చే గుండెపోటు ఇప్పుడు 30, -40 ఏళ్ల వారికీ కూడా వస్తోంది. జిమ్‌లలో వ్యాయామం చేస్తూ గుండెపోటుకు గురికావడానికి కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయి.

ఓవర్ ఎక్స్‌ర్‌సైజ్:
శరీర సామర్థ్యానికి మించి కఠినమైన వ్యాయామం చేయడం వల్ల గుండెపై అధిక ఒత్తిడి పడుతుంది. ఇది గుండె కండరాలకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులలో అడ్డంకులకు దారితీస్తుంది.
సరైన గైడెన్స్‌ లేకపోవడం:
చాలా మంది యువకులు సరైన కోచ్ లేదా శిక్షకుడి పర్యవేక్షణ లేకుండా సొంతంగా వ్యాయామాలు చేస్తుంటారు. దీనివల్ల సరైన పద్ధతిలో వ్యాయామం చేయకపోవడం, లేదా తమకు సరిపడని వ్యాయామాలను ఎంచుకోవడం వల్ల ప్రమాదం పెరుగుతుంది.
ప్రీ-ఎగ్జిస్టింగ్ గుండె జబ్బులు:
చాలా మందికి తమకు గుండె జబ్బులు ఉన్నట్లు తెలియదు. జన్యుపరమైన సమస్యలు లేదా చిన్ననాటి నుంచే ఉన్న గుండె లోపాలు వ్యాయామం సమయంలో బయటపడి గుండెపోటుకు కారణం కావచ్చు.
సరైన ఆహారం తీసుకోకపోవడం:
వ్యాయామం చేసేటప్పుడు శరీరానికి అవసరమైన పోషకాలు లభించకపోవడం, లేదా అదనపు బరువు పెరగడానికి, బరువు తగ్గడానికి అనాలోచితంగా డైట్ పాటించడం వల్ల కూడా గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది.
ప్రొటీన్ సప్లిమెంట్ల వాడకం:
సరైన అవగాహన లేకుండా, వైద్యుల సలహా లేకుండా ప్రొటీన్ సప్లిమెంట్లను, స్టెరాయిడ్లను వాడటం వల్ల గుండెపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇది హృదయ స్పందనల క్రమాన్ని దెబ్బతీస్తుంది.
మెడికల్ టెస్టులు చేయించుకోక:

చాలామంది యువకులు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నామని భావించి వైద్య పరీక్షలు చేయించుకోవడానికి ఆసక్తి చూపరు. ఈ అలసత్వం వల్ల గుండె సమస్యలను ముందుగా గుర్తించలేకపోతున్నారు.
ఈ కారణాలన్నీ గుండెపోటుకు దారితీసే అవకాశం ఉంది. కాబట్టి జిమ్‌లో చేరే ముందు వైద్యుడి సలహా తీసుకోవడం, శిక్షకుడి పర్యవేక్షణలో వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం చాలా ముఖ్యం.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.