ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మికులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరాల జల్లులు కురిపించారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం చేనేత రంగానికి మద్దతుగా అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది.
చేనేత వస్త్రాలపై విధించే జీఎస్టీ భారాన్ని ఇకపై ఏపీ ప్రభుత్వమే భరించనుందని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ పన్ను మొత్తాన్ని కేంద్రానికి రాష్ట్రమే చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ నిర్ణయం చేనేత కార్మికులకు భారీ ఊరటను కలిగించనుంది.
రూ.5 కోట్లతో త్రిఫ్ట్ ఫండ్ ఏర్పాటు
ఏపీ సచివాలయంలో మంగళవారం జరిగిన చేనేత, జౌళిశాఖ సమీక్ష సమావేశంలో చంద్రబాబు ఈ ప్రకటనలు చేశారు. చేనేత కార్మికుల భద్రత కోసం రూ.5 కోట్లతో త్రిఫ్ట్ ఫండ్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నేత మగ్గాలకు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అందజేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ కీలక నిర్ణయాలన్నింటినీ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా, ఆగస్టు 7వ తేదీ నుంచి అమలులోకి తేవాలని అధికారులకు సీఎం ఆదేశించారు. ఇటీవల జమ్మలమడుగు పర్యటనలో తనను కలిసిన చేనేత కుటుంబాలు తన దృష్టికి తీసుకొచ్చిన అంశాలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.
ఏపీ చేనేత ఉత్పత్తులకు ఇటీవల 10 జాతీయ అవార్డులు లభించాయని గుర్తుచేశారు. అంతే కాకుండా “ఒకే జిల్లా – ఒకే ఉత్పత్తి” విభాగంలో రాష్ట్రానికి తొలిసారి అవార్డు లభించిందని అధికారులు వెల్లడించారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సంబంధిత శాఖల అధికారులను అభినందించారు. వ్యవసాయం తర్వాత రాష్ట్రంలో చేనేత రంగమే అత్యంత ప్రాధాన్యం కలిగిన రంగమని చంద్రబాబు పేర్కొన్నారు.
1. చేతి మగ్గాలకు 200 యూనిట్లు, పవర్ లూమ్స్ కు 500 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్
2. చేనేత వస్త్రాలపై విధించే జీఎస్టీని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించడం
3. రూ.5 కోట్లతో నేతన్నలకు త్రిఫ్ట్ ఫండ్ ఏర్పాటు అంశాలపై అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలిచ్చారు.
ప్రసిద్ధి చెందిన ఒక చేతివృత్తి చేనేత
చేనేత ఒక ప్రముఖమైన కుటీర పరిశ్రమ. ఈ వృత్తికి అనేక కులాలవారు అనుబంధంగా ఉన్నారు. వీరిలో పద్మశాలీ, పట్టుశాలి, జాండ్ర, స్వకులసాలి, నేతకాని, దేవాంగ, తొగట, తొగటవీర క్షత్రియ, కైకాల, కుర్ణి, కర్ణ భక్తులు, కరికాల భక్తులు, నెస్సి, కురిమిచెట్టి, ముదలియార్, కత్రి, భవసార క్షత్రియ, నీలి, నీలకంఠ, సెంగుందంలు ముఖ్యమైనవారు. ఈ కులాల వారు చేనేత వృత్తిలో ఉన్నారు.
చేనేతతో అనుసంధానంగా కొన్ని ఇతర చేతివృత్తులూ ఉన్నాయి. మగ్గం పై వర్క్ చేసే ప్రక్రియలో 2 ముఖ్యమైన దశలు ‘పడుగు’, ‘పేక’ ఉన్నాయి.. నిలువు దారాలను ‘పడుగు’ అని, పరస్పరం అడ్డంగా వెళ్లే దారాలను ‘పేక’ అంటారు. ఈ రెండు దారాలను మగ్గం ద్వారా కలిపే ప్రక్రియనే “నేత”గా పిలుస్తారు. దీన్ని చేతితో మగ్గం మీద చేయడం వల్ల దీనిని “చేనేత”గా వ్యవహరిస్తారు..
చేనేత ద్వారా తయారయ్యే వస్త్రాలు ప్రధానంగా మూడురకాల నేతల రూపంలో తయారవుతాయి. ఇవి చేనేత ఉత్పత్తుల మూల ఆధారాలుగా ఉంటాయి.
- సాదా నేత (Plain weave)
- శాటిన్ నేత (Satin weave)
- ట్విల్ నేత (Twill weave)
































