శ్రీ చైతన్య స్కూల్ సీజ్.. మరో బ్రాంచ్ కు విద్యార్థుల తరలింపు

ఎట్టకేలకు అక్రమంగా నిర్వహిస్తున్న శ్రీ చైతన్య పాఠశాలను విద్యాశాఖ అధికారులు సీజ్ చేశారు. గత మూడేళ్లుగా చుంచుపల్లి తండాలో ఎటువంటి అనుమతులు లేకుండా పాఠశాలను నిర్వహిస్తున్నప్పటికీ పట్టించుకోని విద్యాశాఖ అధికారులు బుధవారం సీజ్ చేశారు.


ఆ క్యాంపస్ లో చదువుకుంటున్న విద్యార్థులను ఇతర శ్రీ చైతన్య బ్రాంచ్ లకు వాహనాల్లో తరలించారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇదేం పద్ధతని విద్యార్థుల తల్లిదండ్రులు సిబ్బందిని నిలదీశారు.

మూడేండ్లుగా నిర్వహణ, పట్టించుకోని విద్యాశాఖ అధికారులు..

మమ్మల్ని ఆపే వాళ్ళు ఎవరూ లేరు అన్న చందంగా ప్రైవేట్ విద్యాసంస్థలు ఇష్టమొచ్చినట్లుగా ఎటువంటి అనుమతులు లేకుండా విద్యాసంస్థలను నెలకొల్పుతున్నారు. చుంచుపల్లి మండలంలోని నందా తండాలో అక్రమంగా మూడేళ్ల నుంచి శ్రీ చైతన్య పాఠశాల పేరుతో ఎటువంటి అనుమతులు లేకుండా పాఠశాలను నిర్వహిస్తున్నారు. అప్పటి నుంచి స్పందించని జిల్లా విద్యాశాఖ అధికారి, రిటైర్మెంట్ కి మూడు నెలల ముందు అక్రమ పాఠశాలలను మూసివేయాలని ఆదేశాలు ఇవ్వడం పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యంతో విద్యాశాఖ అధికారులకు ఏమైనా ఒప్పందం జరిగి ఉంటుందేమో అని, అందువల్లనే ఇప్పటిదాకా చూసి చూడనట్లు వ్యవహరించారని, జిల్లా విద్యాశాఖ అధికారి రిటైర్మెంట్ ముందు కావాలని ఆదేశాలు జారీ చేసినట్లు అనుమానాలు వస్తున్నాయని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపణలు చేస్తున్నారు.

దిక్కుతోచని స్థితిలో తల్లిదండ్రులు..

మా పాఠశాలలో చేరితే మీ పిల్లలకి ఐఐటీ కోర్సులు నేర్పిస్తామని, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తామని అడ్మిషన్ల కోసం తల్లిదండ్రుల ఇళ్లకు వెళ్లి మాయమాటలు చెప్పి ప్రైవేటు విద్యాసంస్థలు పాఠశాలలో చేర్పించుకుంటారు. ఎన్నో ఆశలతో తమ పిల్లలు వృద్ధిలోకి రావాలని, వేలకు వేలు ఫీజులు కట్టి తల్లిదండ్రులు పాఠశాలలో చేర్పిస్తారు. కానీ ఆ పాఠశాలకు పర్మిషన్లు ఉన్నాయా, అర్హత కలిగిన ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తున్నారా అని మాత్రం ముందుగానే చెక్ చేసుకోవడం లేదు. ఫలితంగానే శ్రీ చైతన్య లాంటి అక్రమ పాఠశాలలు పుట్టుకొస్తున్నాయి, తల్లిదండ్రులను మోసం చేస్తున్నాయి. అర్ధాంతరంగా విద్యాశాఖ అధికారులు పాఠశాలను సీజ్ చేసే సరికి విద్యార్థుల తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. శ్రీ చైతన్య యాజమాన్యం ఇంత మోసం చేస్తారని ఊహించలేదని వాపోతున్నారు. విద్యాశాఖ అధికారుల అలసత్వం వల్లనే ఇటువంటి అక్రమ పాఠశాలలు పుట్టుకొస్తున్నాయని, తద్వారా విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారుతుందని విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.