తోబుట్టువుల మధ్య సంబంధం చాలా ప్రత్యేకమైనది. ప్రేమ, గొడవ, అసూయ ఉంటాయి. అయితే, తోబుట్టువుల మధ్య ఎంత ప్రేమ ఉన్నా, వారు ఎప్పుడూ గొడవ పడుతునే ఉంటారు.
చిన్నప్పటి నుంచీ అన్నదమ్ములు, అన్నచెల్లి మధ్య వైరం ఉంటుంది. బట్టలు, స్నాక్స్, భోజనం, టీవీ రిమోట్లు, బొమ్మలు మొదలైన వాటితో సహా ప్రతిదానికీ గొడవ పడుతుంటారు. దీనివల్ల కుటుంబంలో ఉద్రిక్తత ఏర్పడుతుంది. ఇది ప్రతి ఇంట్లోనూ చాలా సాధారణం. కానీ తోబుట్టువులు ఇలా గొడవ పడటానికి కారణం మీకు తెలుసా? దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
తోబుట్టువులు పెద్దయ్యాక కూడా టామ్ అండ్ జెర్రీ లాగా గొడవ పడుతూనే ఉంటారు. దీనికి ఒక రకంగా తల్లిదండ్రులు కూడా కారణం. ఎలా అంటే.. తల్లిదండ్రులు ఎక్కువగా చిన్న, పెద్ద అంటూ మొదట పుట్టిన బిడ్డ కన్నా రెండవ బిడ్డపై ఎక్కువగా ప్రేమ చూపిస్తారు. వారితోనే ఎక్కువగా సమయం గడుపుతారు. ఇది మొదట పుట్టిన బిడ్డకు కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. నా కన్నా తల్లిదండ్రులు చిన్నవాడిపైనే ఎక్కువగా ప్రేమగా ఉంటారని వారు అసూయ పడతారు. అలానే చిన్నవాళ్లపైన కోపం పెంచుకుంటారు. ఇది వారి మనసులో అలానే ఉండిపోతుంది. ఈ కారణంగా ప్రతి విషయానికి అన్నదమ్ముల మధ్య, అన్నాచెల్లి మధ్య గొడవలు ఎక్కువ అవుతాయి.
పిల్లలకు సమాన ప్రేమ లభించకపోతే, వారు తమ తోబుట్టువులపై కోపంగా ఉంటారు. వారి మనస్సులలో ద్వేషాన్ని పెంచుకుంటారు. ఇది తగాదాలకు దారితీస్తుంది. తోబుట్టువుల మధ్య ఆలోచనలు, భావాలలో తేడాలు ఉంటాయి. ఈ విభిన్న అభిరుచులు కూడా తగాదాలకు దారితీయవచ్చు. ఉదాహరణకు, టీవీ చూసే విషయానికి వస్తే, పిల్లలు ఒకరు కార్టూన్ చూడాలని, మరొకరు సినిమా చూడాలని గొడవ పడతారు. అలాగే, ఇంటి వాతావరణం కూడా తోబుట్టువుల మధ్య గొడవ పెరగడానికి ఒక కారణం. తల్లిదండ్రులు పిల్లల ముందు అరుస్తూ మాట్లాడితే, పిల్లలు కూడా అలాగే ప్రవర్తిస్తారు.
































