20,000 అడుగుల ఎత్తులో ఆకాశాన్ని చీల్చుకుంటూ దూసుకెళ్తున్న ఓ విమానాన్ని, అందులోని ప్రయాణికుల గుండెల్లో ఓ చిన్న పక్షి గుబులు పుట్టించింది.
బతుకు జీవుడా అనుకుంటూ ప్రయాణికులు ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకున్నారు. విమానం సురక్షితంగా ల్యాండ్ అవ్వాలని నూటొక్క దేవుళ్లను మొక్కుకున్నారు. ఇంతకీ అసలేం జరిగింది?
ఇటీవల కాలంలో విమాన ప్రయాణ ప్రాణ సంకటంగా మారింది. విమానం టేకాఫ్ నుంచి ల్యాండ్ అయ్యే వరకు ఎంత వరకు సురక్షితం అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. ఈ క్రమంలో టేకాఫ్ అయిన 20 నిమిషాల్లో మాడ్రిడ్ నుంచి పారిస్ వెళ్తున్న ఐబీరియా ఎయిర్‌బస్ ఏ321ఎక్స్ ఎల్ ఆర్‌ను 20,000 అడుగుల ఎత్తులో ఉండగా ఓ చిన్న పక్షి దాని తల భాగాన్ని ఢీకొట్టింది.
ఈ ఘటనలో విమానం తల భాగం తీవ్రంగా దెబ్బతిన్నది. ఫలితంగా విమానం మొత్తాన్ని పొగ కమ్మేసింది. అప్రమత్తమైన విమాన సిబ్బంది ప్రయాణికులకు ఆక్సిజన్ మాస్కులు అందించారు. పొగలు వ్యాపించడంతో విమానం ప్రమాదానికి గురవుతందనే భయంతో ప్రయాణికులు ఆహాకారాలు చేశారు. చిన్న పిల్లలు ఏడుస్తున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ప్రమాదంతో అప్రమత్తమైన పైలెట్ విమానాన్ని సురక్షితంగా కిందకు దించారు.
దీంతో హమ్మయ్యా అనుకుంటూ ప్రయాణికులు కిందకు దిగారు. ఈ సందర్భంగా విమాన ప్రయాణంలో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి ప్రయాణీకుడు జియాన్‌కార్లో సాండోవాల్ మాట్లాడారు. కెప్టెన్ మాట్లాడుతుండగా.. మాకు ఓ పెద్ద శబ్ధం వినిపించింది. ఏదో అశుభం జరగతోందని అనుకున్నాం. దేవుడి దయవల్ల మాకు ఎలాంటి విపత్కర పరిస్థితి ఎదురవలేదంటూ సంతోషం వ్యక్తం చేశాడు.
































