ముఖంలో డబుల్ చిన్ తయారై వేలాడుతోందా? రెండో గడ్డం ఇలా తగ్గించేద్దాం.. అమ్మాయిలే కాదు, అబ్బాయిలు కూడా డబుల్ చిన్ వల్ల ఇబ్బంది పడుతుంటారు.
ఈ డబుల్ చిన్ ముఖ సౌందర్యాన్ని దెబ్బతీస్తుంది. గడ్డం దగ్గర అదనపు కొవ్వు పొర కనిపించడం వల్ల చాలా మంది అసౌకర్యంగా ఫీల్ అవుతారు.
డబుల్ చిన్ రావడానికి బరువు పెరగడం, వంశపారంపర్య కారణాలు, వయసు పెరగడం వంటివి కారణాలు కావచ్చు. డబుల్ చిన్‌ను తగ్గించి, ముఖ సౌందర్యాన్ని పెంచుకోవడానికి కొన్ని వ్యాయామాలు సహాయపడతాయి. ఆ వ్యాయామాల గురించి తెలుసుకోవాలంటే ఈ వివరాలను చదవండి.
సీలింగ్ వైపు చూస్తూ: నిటారుగా నిలబడి, తలను వెనక్కి వంచి సీలింగ్ వైపు చూడండి. పెదవులతో పాటు గడ్డాన్ని ముందుకు చాచినట్లు, ముద్దు పెట్టేలా చేయండి. ఈ స్థితిలో 5-6 సెకన్లు ఉండి, తిరిగి సాధారణ స్థితికి రండి. ఇలా 10-15 సార్లు పునరావృతం చేయండి.
నాలుక వ్యాయామం: తలను వెనక్కి వంచి, సీలింగ్ వైపు చూస్తూ నోటిని పెద్దగా తెరవండి. మనసులో 1 నుంచి 5 వరకు లెక్కిస్తూ, నాలుకను సీలింగ్ వైపు నెమ్మదిగా బయటకు చాచండి. తర్వాత మళ్లీ 5 సెకన్లు లెక్కిస్తూ నాలుకను లోపలికి తీసుకోండి. ఈ విధంగా 10 సార్లు చేయండి.
గడ్డం ఛాతీకి తాకేలా: నిటారుగా నిలబడి, గడ్డాన్ని ఛాతీకి తాకేలా తలను కిందకు వంచండి. నెమ్మదిగా తలను కుడివైపు తిప్పి, ఆ స్థితిలో 5 సెకన్లు ఉండండి. తిరిగి సాధారణ స్థితికి రండి. ఇదే విధంగా ఎడమవైపు కూడా చేయండి.
తల తిప్పడం: నిటారుగా నిలబడి, తలను ఎడమవైపు తిప్పి 10 సెకన్లు ఆ స్థితిలో ఉంచండి, ఆపై సాధారణ స్థితికి రండి. అదే విధంగా కుడివైపు చేయండి. ఇప్పుడు తలను కిందకు వంచి, వీలైనంత వరకు కుడివైపు, ఆ తర్వాత ఎడమవైపు తిప్పండి. ఈ వ్యాయామాన్ని 2-3 సార్లు చేసి, కొద్దిగా విశ్రాంతి తీసుకోండి.
నోరు తెరవడం-మూయడం: తలను వెనక్కి వంచి, నోటిని తెరుస్తూ, మూస్తూ 10 సార్లు చేయండి. ఆ తర్వాత సాధారణ స్థితికి రండి. ఇప్పుడు తలను కుడివైపు కొద్దిగా ఎత్తుగా తిప్పి, నోటిని తెరుస్తూ, మూస్తూ 10 సార్లు చేయండి. అదే విధంగా ఎడమవైపు రిపీట్ చేయండి. చివరగా సాధారణ స్థితికి రండి.
మెడ వ్యాయామాలు: మెడను గుండ్రంగా నెమ్మదిగా తిప్పడం, పైకి-కిందకు కదిలించడం వంటి సాధారణ వ్యాయామాలు కూడా గడ్డం కింది కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి.
నవ్వడం, మాట్లాడడం: ఎక్కువగా నవ్వడం, మాట్లాడడం వల్ల ముఖ కండరాలకు మంచి వ్యాయామం లభిస్తుంది. ఇది డబుల్ చిన్ సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది.
రోజూ ఈ వ్యాయామాలను స్థిరంగా చేస్తే, గడ్డం కింది కొవ్వు కరిగి, ముఖ సౌందర్యం మెరుగుపడుతుంది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే.
































