ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం రెవిన్యూ పెంచుకునే మార్గాలకు ఆమోద ముద్ర వేసింది. కొత్త బార్ల పాలసీతో పాటుగా మందుబాబులకు ఊరటనిచ్చే నిర్ణయం వెల్లడించింది.
వీటితో పాటుగా నూతన బార్ పాలసీలో భాగంగా వైన్ షాపుల తరహాలో బార్లలోనూ కల్లుగీత కార్మికులకు 10 శాతం కేటాయించాలని ఫీజులో 50 శాతం రాయితీ ఇచ్చి ప్రోత్సహించాలని తీర్మానించింది.
ఏపీ ప్రభుత్వం నూతన బార్ పాలసీకి ఆమోదం తెలిపింది. కాగా, సుదీర్ఘ కాలంగా ఎక్సైజ్ శాఖ వేచి చూస్తున్న నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బార్ షాపులకు అనుబంధంగా పర్మిట్ రూములకు అనుమతి ఇవ్వాలనే ప్రతిపాదనను మంత్రివర్గం ఆమోదించింది. మద్యం దుకాణాల వద్ద పర్మిట్ రూమ్స్ పైన గతంలో మంత్రివర్గ ఉప సంఘం ఆమోదం తెలపలేదు. అయితే.. ఎక్సైజ్ శాఖ ఈ ప్రతిపాదన పైన పలుమార్లు ప్రభుత్వానికి వినతులు పంపింది. ఇప్పటికే మద్యం షాపుల వద్దనే తాగుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో, పర్మిట్ రూమ్స్ కు అనుమతి ఇవ్వాలని కోరింది. దీనికి తాజాగా జరిగిన మంత్రివర్గ భేటీలో ఆమోద ముద్ర వేసారు.
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించకుండా లా అండ్ ఆర్డర్ సమస్యలు రాకుండా ఉండేందుకే పర్మిట్ రూములు ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వం వెల్లడించింది. ఇక.. బార్ల పాలసీ పైన పలు నిర్ణయాలు తీసుకున్నారు. బార్ లైసెన్స్ ఫీజును రూ.5 లక్షలుగా నిర్ణయించింది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు బార్ల వేళలు ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. కాగా, నూతన బార్ పాలసీ 2025 సెప్టెంబర్ 1 నుంచి 2028 ఆగస్టు 31వ తేదీ వరకు అమలులో ఉంటుంది. ఏపీవ్యాప్తంగా 840 బార్లకు లైసెన్సులు ఇచ్చేందుకు టెండర్లు పిలువనున్నారు. గతానికి భిన్నంగా ఈసారి లాటరీ విధానాన్ని తీసుకురానున్నారు. పారదర్శకత కోసం మార్గాన్ని ఎంచుకున్నారు.
ఇదే సమయంలో తమ వృత్తిలో ఉన్నవారికి జీవనోపాధిని మరింత స్థిరంగా మార్చేందుకు 50 శాతం రాయితీతో బార్ లైసెన్స్‌లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైంది. 10 శాతం రిజర్వేషన్ కూడా కల్పించనుంది. ఈసారి లైసెన్స్ ఫీజులను సమతుల్యంగా, వ్యాపారధారుల సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయించారు. జనాభా 50 వేల లోపు ఉంటే లైసెన్సు ఫీజు రూ.30 లక్షలు, 50 వేల నుంచి 5 లక్షల లోపు అయితే రూ.55 లక్షలు, 5 లక్షల పైగా జనాభా ఉన్న నగరాల్లో రూ.75 లక్షలు నిర్ణయించారు. పట్టణ స్థాయి, జనాభా పరిమాణం బట్టి వ్యాపార ఫీజులు ఖరారు చేసారు. కొత్త పాలసీలో బార్లకు ఉదయం 10 నుంచి రాత్రి 11 వరకు పని చేయడానికి అనుమతి లభించింది. పాలసీ అమలులోకి వచ్చే ముందు గ్రీన్ పీరియడ్ పాటించనున్నారు.
































