రోహిత్ శర్మ ఆరెంజ్ లంబోర్ఘిని ఉరుస్ SE కారును కొనుగోలు చేశాడు. ఈ కారు ప్రత్యేకత ఏంటంటే, దాని నంబర్ ప్లేట్. అతని కుమార్తె సమైరా, కుమారుడు అహన్ పుట్టిన రోజులతో లింక్ చేస్తూ ఈ నంబర్ ప్లేట్ తీసుకున్నాడు. ఇంతకీ నంబర్ ఏంటంటే..?
భారత వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ 2 నెలలకు పైగా క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయినప్పటి నుండి రోహిత్ టీమిండియాలో లేడు. అయినప్పటికీ స్టార్ బ్యాట్స్‌మన్ వివిధ కారణాల వల్ల వార్తల్లో నిలిచాడు. రోహిత్ గత కొన్ని వారాలుగా యూరప్‌లో సెలవులో ఉన్నాడు. కొన్ని రోజుల క్రితమే స్వదేశానికి తిరిగి వచ్చాక రూ.5 కోట్ల కంటే ఎక్కువ విలువైన ఖరీదైన కారును కొనుగోలు చేశాడు. అలాగే ఈ కారు గురించి అత్యంత ప్రత్యేకమైన విషయం దాని రిజిస్ట్రేషన్ నంబర్. ఆ నంబర్ ఖరీదైన కారును మరింత ప్రత్యేకంగా చేస్తుంది.
రూ.5.25 కోట్ల విలువైన కారు
రోహిత్ గ్యారేజీలో ఇప్పటికే చాలా ఖరీదైన కార్లు ఉన్నాయి. వాటిలో స్పోర్ట్స్ కార్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు రోహిత్ ప్రముఖ ఇటాలియన్ కార్ల తయారీ సంస్థ లంబోర్గిని నుండి ఒక సూపర్ కారును కొనుగోలు చేశాడు. ఈ కారుకు సంబంధించిన అనేక వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రోహిత్ ఆరెంజ్ కలర్ లంబోర్గిని ఉరుస్ SE కారును కొనుగోలు చేశాడు. దీని ఎక్స్-షోరూమ్ ధర భారతదేశంలో రూ.4.57 కోట్లు. ముంబైలో దీని ఆన్-రోడ్ ధర దాదాపు రూ.5.25 కోట్లు.
పిల్లల పుట్టిన తేదీతో నంబర్..
రోహిత్ తన కొత్త లంబోర్గిని కారు కోసం రిజిస్ట్రేషన్ నంబర్ 3015 తీసుకున్నాడు. ఈ నంబర్ ప్రత్యేకత ఏమిటంటే.. ఇది అతని ఇద్దరు పిల్లల పుట్టిన తేదీ. అతని కుమార్తె సమైరా డిసెంబర్ 30న జన్మించగా, కుమారుడు అహన్ నవంబర్ 15న జన్మించాడు. యాదృచ్ఛికంగా రోహిత్ గతంలో కూడా లంబోర్గిని ఉరుస్ కారును కలిగి ఉన్నాడు, అది నీలం రంగులో ఉంది. దాని నంబర్ ప్లేట్ కూడా చాలా ప్రత్యేకమైనది. రోహిత్ దాని కోసం 264 నంబర్‌ను తీసుకున్నాడు, ఇది వన్డే క్రికెట్‌లో అత్యధిక స్కోరు సాధించిన అతని ప్రపంచ రికార్డుకు గుర్తుగా ఉంటుంది.
































