రాత పరీక్ష లేకుండానే ఎస్సీ గురుకులాల్లో టీచర్‌ పోస్టులు.. ఆగస్టు 13న ఈ అడ్రస్‌కి వెళ్లండి

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ గురుకులాల్లో బోధన సిబ్బంది పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేసేందుకు ఆగస్టు 13న డెమో తరగతులు నిర్వహించనున్నట్లు సొసైటీ ప్రకటించింది. మొత్తం పోస్టుల్లో జేఎల్, పీజీటీ, టీజీటీ, ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్, లైబ్రేరియన్, పీడీ/పీఈటీ, హెల్త్‌ సూపర్‌వైజర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తన ప్రకటనలో పేర్కొంది. ఆసక్తి కలిగిన మహిళా అభ్యర్థులు నేరుగా ఆగస్టు 13న ఉదయం 8 గంటలకు సరూర్‌నగర్‌ బాలికల గురుకుల పాఠశాలలో, పురుష అభ్యర్థులు షేక్‌పేట ఎస్సీ గురుకుల పాఠశాలలో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించింది. ఆ తర్వాత అదే రోజు ఉదయం 10 గంటల నుంచి డెమో తరగతులు ప్రారంభమవుతాయని తెలిపింది. ఇందులో ప్రతిభ ఆధారంగా పోస్టులకు ఎంపిక చేస్తామని వివరించింది. ఇతర వివరాలకు 7569017276, 9701110138 ఫోన్‌ నంబర్లను సంప్రదించాలని గురుకుల సొసైటీ తెలిపింది.


ఆగస్టు 25 నుంచి గేట్ 2026 దరఖాస్తులు ప్రారంభం

దేశవ్యాప్తంగా 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిఎంటెక్, పీహెచ్‌డీలో ప్రవేశానికి నిర్వహించనున్న గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు ఇన్‌ ఇంజినీరింగ్‌ (గేట్‌)-2026 నోటిఫికేషన్‌ మరికొన్ని రోజుల్లోనే ప్రారంభంకానుంది. ఇప్పటికే పరీక్షల షెడ్యూల్‌ కూడా విడులైంది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు ఆగస్టు 25 నుంచి ప్రారంభమవుతాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7, 8, 14, 15 తేదీల్లో గేట్‌ 2026 ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహించనున్నట్లు ఐఐటీ గువాహటి తెలిపింది. ఈ మేరకు వెబ్‌సైట్‌ను కూడా తాజాగా అందుబాటులోకి తీసుకువచ్చింది.

మొత్తం 30 పేపర్లకు ఆన్‌లైన్‌ పరీక్షలు జరుగుతాయి. బీటెక్‌, బీఎస్సీ, బీఏ, బీకాం విద్యార్థులు కూడా ఈ పరీక్ష రాయవచ్చు. గేట్‌ స్కోర్‌కు గరిష్టంగా మూడేళ్లపాటు వ్యాలిడిటీ ఉంటుంది. ఈ స్కోర్‌తో మూడేళ్లలో ఎంటెక్‌ వంటి తదితర కోర్సుల్లో ప్రవేశాలతోపాటు కొన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా పనికొస్తుంది.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.