నేటి ఆధునిక కాలంలో ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. ఇప్పటికీ కొన్ని ఇళ్ళలో అమ్మమ్మ వయసు 90, నాన్నమ్మ వయసు 95 అనే మాటలు మనం వింటూనే ఉంటాం.
మన అమ్మమ్మలు,నాన్నమ్మలు ఆ వయసులో కూడా ఇప్పటికీ వాళ్లు తమ పనులు తామే చేసుకుంటుంటారు. అందుకు వారి ఆహారపు అలవాట్లే కారణమని చెప్పవచ్చు. అందుకే పెద్దల మాట…చద్ది మూట…అనే నానుడి ఊరికే రాలేదు. పెద్దల మాటలు ఎంతో విలువైనవని, చద్ది మూట కూడా ఎంతో మేలైనది వారి మాటలతో పోల్చారు మన పూర్వీకులు. చద్దన్నం తిన్న వారిని చిన్న చూపు చూస్తారు కొందరు, పేదోళ్ళని కూడా భావిస్తారు మరికొందరు. చద్దన్నం లో ఉన్న పోషక విలువలు తెలిస్తే దాన్ని అస్సలు వదిలిపెట్టరు. ముఖ్యంగా అన్నంలో ఉన్న ఐరన్, పొటాషియం, కాల్షియం వంటివి ఒకరోజు తర్వాత పెరుగుతాయి. చద్దన్నం లో పెరుగును కలుపుకొని తింటే, శరీరంలోని వేడిని తగ్గించి చలువ చేస్తుంది. పెరుగులో ఉండే ‘ప్రోబయోటిక్స్’ జీర్ణక్రియకు సహాయపడుతూ అసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది.
అంతేకాక చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. బరువు తగ్గడం, మధుమేహం అదుపులో ఉండడం, ఊబకాయం తగ్గడం లాంటివే కాకుండా, అల్సర్లు, అలెర్జీలు, రక్తపోటు, రక్తహీనత వంటి వాటిని తగ్గిస్తుంది. అంతేకాక చద్దన్నం లో ఉండే ‘లాక్టిక్ యాసిడ్’ బ్యాక్టీరియా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే ఉదయాన్నే చద్దన్నం భుజించడం వలన శరీరానికి తక్షణమే ఎనర్జీ లెవల్స్ పెంచి, శక్తినిచ్చి రోజంతా ఉల్లాసంగా, చురుకుగా ఉండటానికి సహాయపడుతుంది. అందుకే మన పూర్వీకులు సంపూర్ణ ఆరోగ్యంగా జీవించారు. కరోనా మహమ్మారి ప్రవేశించి పాత ఆహారపు అలవాట్లలోనే ఆరోగ్యం దాగుందని, రోగ నిరోధక శక్తి పెరుగుతుందని గుర్తుచేసి, మరీ ఆ అలవాట్లను మొదలు పెట్టించింది. మారిన జీవన విధానం, పాశ్చాత్య సంస్కృతి ప్రవేశంతో పాత తరం ఆహారపు అలవాట్ల వైపు మళ్లుతూ ఆరోగ్యంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నారు నేటి జనం. వారి ప్రయత్నాన్ని గమనించిన కొందరు వ్యాపారస్తులు చద్దన్నం, మిల్లెట్ భోజనం లాంటి హోటళ్లు ను ప్రారంభిస్తున్నారు.
అందులో భాగంగా షాద్ నగర్ కు చెందిన శివ మాధవి నల్గొండ లో బీటెక్ పూర్తి చేసి, సాఫ్ట్ వేర్ జాబ్ వదిలేసి, అందురూ ఆరోగ్యంగా ఉండాలే తలంపుతో తన భర్తతో కలిసి, జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ మీడియేటర్ గోపాల్ నారాయణ సహకారంతో ‘మన చద్దన్నం’ పేరుతో షాద్ నగర్ పట్టణంలోని మార్నింగ్ వాక్ (ఉదయపు నడక) ప్రాంగణ సమీపంలో మిల్లెట్ క్యాంటిన్ ప్రారంభించింది. ఆ హోటల్ లో చద్దన్నం ప్లేట్ 40 రూపాయలకే విక్రయిస్తుంది. వాకర్స్ తమ వాకింగ్ అయిపోగానే చద్దన్నం తిని హుషారుగా ఇళ్ళకు వెళుతుంటారు.
అంతేకాక రాగులు, కొర్రలు, సామలు, అరిసెలు, జొన్న రాగి, ఒక రోజంతా పులిసిన మజ్జిగ, నూనె, మసాలాలు లేకుండా వండిన పదార్థాలు మిల్లెట్ వంటకాలతో భోజన ప్రియులను అందిస్తుంది. ఇంతే కాదండోయ్ ఓట్స్, పల్లీలు, నువ్వులు, ఖర్జూర లడ్లూ, గుమ్మడి గింజల ఔషధం, మునుగాకు, కరివేపాకు ‘పొడ్లూ’ తయారుచేసి విక్రయిస్తూ చూపరులను ఆకట్టుకుంటుంది. అంతేకాక ప్లాస్టిక్ వలన ఆరోగ్యానికి, పర్యావరణ కు ముప్పు వాటిల్లుతుందని, తన క్యాంటిన్ లో ప్లాస్టిక్ ప్లేట్స్,టీ కప్పు లను, క్యారీ బ్యాగులను నిషేధించి, స్టీల్, మట్టి పాత్రలు, ఆకుల కప్పులనే వాడుతుంది. మోదుగ, అరటి ఆకుల్లో టిఫిన్, భోజనం వడించడం, మట్టి కుండల్లో త్రాగు నీరును అందిస్తుంది. ఆరోగ్యమే మహా భాగ్యమనే సంకల్పంతో ముందుకు సాగుతున్న శివ మాధవికి అభినందనలు..































