దేశ సేవకి పెన్షన్ వద్దన్న దేశభక్తురాలు.. పేదరికంతో గుర్తు తెలియని విధంగా మరణించిన బీనాదాస్ గురించి మీకు తెలుసా..

బ్రిటిష్ అధికారులను గడగడలాడించిన పోరాటయోధులు ఎందరో.. తమని పాలిస్తున్న అధికారులు హత్య చేసి ఉరికంబానికి ఎక్కి ప్రాణత్యాగం చేసిన పోరాట యోధులు ఉన్నారు.. జైలు శిక్షని అనుభవించినవారు ఉన్నారు. అలాంటి యోధుల్లో ఎందరో కనీసం గుర్తింపుకి కూడా నోచు కోలేదు. అలాంటి గొప్ప దేశ భక్తురాలిలో ఒకరు బీనా దాస్. దేశసేవకు ప్రతిఫలం తీసుకోరాదు అని మనసారా నమ్మి అత్యంత దారుణంగా మరణించిన చరిత్ర చెప్పని నిస్వార్థ దేశభక్తురాలైన బీనా దాస్ గురించి ఈ రోజు తెలుసుకుందాం.. .

మన దేశానికి వ్యాపారం కోసం వచ్చి.. మనల్ని బానిసలుగా భావించి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మన దేశాన్ని 200 సంవత్సరాలు పరిపాలించారు. మన సంపదను కొల్ల గొట్టి తమ దేశానికి తరలించారు. అయితే రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి మన దేశానికి స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది నడుం కట్టారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రభావంతో దేశ స్వాతంత్ర్యం కోసం ఏదైనా చేయాలనీ భావించిన గొప్ప దేశభక్తురాలు బీనాదాస్.


బ్రిటిష్ అధికారుల అకృత్యాలకు అడ్డు కట్ట వేయాలని భావించిన స్టూడెంట్ బీనా దాస్. బెంగాల్ గవర్నర్ జాక్సన్ పై కాల్పులు జరిపారు. తృటిలో గురి తప్పడంతో ఆ గవర్నర్ బతికాడు. అయితే బీనాదాస్ కి తొమ్మిదేళ్ళ జైలు శిక్ష విధించారు. జైలు జీవితం పూర్తి అయ్యాక విడుదలైన బీనా దాస్ మళ్ళీ క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. మళ్ళీ అరెస్ట్ అయ్యారు. మరోసారి జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశ సేవకు ప్రతిఫలం వద్దని స్వాతంత్ర్య సమర యోధుల పెన్షన్ తీసుకోవడానికి నిరాకరించింది. కాలం గడిచింది. ఆమెను అందరూ మరిచిపోయారు. 1986లో ఋషికేశ్ గంగానది ఒడ్డున ఒక అనాథ శవం కన్పించింది. శరీరం కుళ్లి పోయింది. గుర్తుపట్టడానికి నెల రోజులు సమయం పట్టింది. ఆ మృత దేహం గొప్ప దేశభక్తురాలైన బీనాదాస్ అని.. ఆమె కలకత్తా విశ్వవిద్యాలయ విద్యార్థిని అని గుర్తించారు.

1931లోనే కలకత్తా విశ్వవిద్యాలయంలో ఆంగ్ల సాహిత్యాన్ని చదివిన బీనా దాస్ హత్య ప్రయత్నం చేయడంతో అప్పుడు డిగ్రీ పట్టా తీసుకోలేకపోయారు. మరణించిన తరవాత కలకత్తా విశ్వవిద్యాలయ అధికారులు ఆమెకు 2012లో బి.ఎ. పట్టాని ప్రదానం చేశారు

పశ్చిమ బెంగాల్ లోని కృష్ణ నగర్‌లో బీనా దాస్ జన్మించారు. తల్లి సరళాదేవి తండ్రి మదాబ్ దాస్. ఇద్దరూ సంఘసేవకులు. తమ కుమార్తెలకు సామజిక సేవని వారసత్వాన్ని అందించారు. మదాబ్ దాస్ ఇంటికి సుబాష్ చంద్ర బోస్ తరచుగా వచ్చేవారు. అప్పుడు స్వాతంత్ర్య పోరాటం జరిగే చర్చలను ఆసక్తిగా వినేవారు బీనా దాస్, ఆమె అక్ కళ్యాణి. బోస్ ప్రభావంతో కళ్యాణి దాస్, బీనా దాస్ ఇద్దరూ గొప్ప స్వాతంత్ర్య పోరాటయోధులుగా చరిత్రను సృష్టించారు.

1932 ఫిబ్రవరి 6 న కాన్వొకేషన్‌ హాల్లోనే గవర్నర్ స్టాన్లీ పైన ఐదుసార్లు తుపాకి కాల్పులు జరిపారు. అయితే అది విఫలం అయింది. ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. తొమ్మిదేళ్ళు జైలు శిక్షను అనుభవించి 1939లో జైలు విడుదలయ్యారు బీనా దాస్. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. మళ్ళీ రెండవసారి జైలుకి వెళ్ళారు. 1945లో విడుదలయ్యారు.

1946 నుంచి 1947 వరకు బెంగాల్ ప్రొవిన్షియల్ శాసనసభకు సభ్యురాలిగా పనిచేశారు. 1947లో స్వాతంత్ర్యం లభించిన తర్వాత శాసనసభ్యురాలిగా 1947 నుంచి 1951 వరకు పని చేశారు. 1947లో జుగాంతర్ గ్రూప్‌కి చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు జతీష్ చంద్ర భౌమిక్‌తో వివాహం జరిగింది. పేదల కోసం సేవాకార్యక్రమాలను నిర్వహించేవారు. 1960లో కేంద్రప్రభుత్వం పద్మ శ్రీ పురస్కారాన్ని అందించింది. భర్త మరణించిన తరువాత బీనా దాస్ దుర్భర పరిస్థితులను ఎదుర్కున్నారు. చివరి రోజులలో రిషికేష్‌లో జీవించారు. భయంకర పేదరికాన్ని అనుభవించారు. 1986 డిశంబర్ 26 వ తేదీన రిషికేష్ పాక్షికంగా కుళ్ళిపోయిన మృతదేహం పోలీసులకు దొరికింది. నెల రోజుల తర్వాత ఆమె బీనా దాస్ గా గుర్తించారు. అజ్ఞాతంలో జీవించి, అనామకంగా మరణించిన గొప్ప దేశ భక్తురాలు బీనా దాస్ వంటి చరిత్ర చెప్పని స్వాతంత్య్ర సమరయోధులు ఎందరో.. అందరికీ ఘన నివాళులు..

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.