యూఎస్‌లో ఉంటున్న ఎంతోమంది వలసదారుల పిల్లల గ్రీన్ కార్డ్ ఆశలపై నీళ్లు చల్లేందుకు యూఎస్ సిద్ధమైంది. ఆగస్టు 15 నుంచి చైల్డ్ స్టేటస్ ప్రొటెక్షన్ యాక్ట్ (సీఎస్‌పీఏ) కింద పిల్లల వయసును లెక్కించే విధానంలో కీలకమైన మార్పులు తెస్తున్నట్లు యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) ప్రకటించింది.
ఆగస్టు 15, ఆ తర్వాత చేసుకునే దరఖాస్తులకు ఈ కొత్త విధానం అమలవుతుందని యూఎస్‌సీఐఎస్ తెలిపింది. దీంతో కుటుంబాల గ్రీన్ కార్డు దరఖాస్తు ప్రక్రియను స్టాండర్డ్ అవుతుందని పేర్కొంది. 2010 నుంచి యూఎస్‌లో అత్యధికంగా హెచ్-1బీ వీసా పొందుతున్న వారు భారతీయులే. 2023లో ఈ వీసా పొందిన 73 శాతం మంది ఇండియన్సే కావడం గమనార్హం. కాబట్టి తాజాగా సీఎస్‌పీఏ కింద వయసు లెక్కించే విధానం కూడా వీరిపైనే ఎక్కువ ప్రభావం చూపించడం ఖాయం.
పాత విధానంలో..
హెచ్-1బీ వీసాలతో యూఎస్‌లో నివశిస్తున్న కుటుంబాల్లోని పిల్లలు హెచ్-4 వీసాలపై అమెరికాలో ఉంటారు. వారికి 21 ఏళ్లు వస్తే సొంతగా యూఎస్ వీసా తీసుకోవాలి. లేదంటే స్వదేశానికి వెళ్లిపోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను ‘ఏజింగ్ అవుట్’ అంటారు. ఒకవేళ తల్లిదండ్రులు గ్రీన్ కార్డ్‌కు అర్హత సాధించి, దరఖాస్తు చేస్తే.. వారి పిల్లలు ‘ఏజింగ్ అవుట్’ అవ్వకుండా 2023 ఫిబ్రవరిలో తెచ్చిన పాత విధానం కొంత రక్షణ ఇచ్చేది. దీనికోసం పిల్లల వయసులో దరఖాస్తు తేదీ నుంచి ఫైనల్ యాక్షన్ డేట్ వరకు ఉన్న సమయాన్ని తొలగించేది. దరఖాస్తు ఫైలింగ్ సమయానికి పిల్లలు 21 ఏళ్లు నిండకపోతే వారిని ఆ కుటుంబంపై ఆధారపడిన పిల్లలుగానే గుర్తించేంది. ఎందుకంటే వీసా లభ్యతపై వచ్చే ఫైనల్ యాక్షన్ తేదీలు చాలా ఆలస్యంగా వస్తాయి. ఈ సమయంలో తల్లిదండ్రులు, పిల్లలు వేరు అవ్వకూడదనే ఆలోచనతో పిల్లలు ‘ఏజ్ అవుట్’ అవ్వకుండా పాత విధానం కాపాడేది.
కొత్త విధానం ప్రకారం..
అయితే తాజాగా ప్రకటించిన కొత్త విధానంలో ఫైనల్ యాక్షన్ డేట్‌ను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. అంటే, దరఖాస్తు చేసినప్పటి నుంచి ఫైనల్ యాక్షన్ డేట్ మధ్యలో పిల్లలకు 21 ఏళ్లు నిండితే వాళ్లు సొంతగా మరో వీసా పొందాల్సిందే. లేకపోతే యూఎస్ వదిలి వెళ్లిపోవాల్సి ఉంటుంది. సుమారు 2 లక్షల మంది పిల్లలు, కుర్రాళ్లపై ఈ కొత్త విధానం ప్రభావం చూపించే అవకాశం ఉంది.
































