40 ఏళ్ల గణిత సూత్రాన్ని బ్రేక్ చేసిన 17 ఏళ్ల అమ్మాయి

గణితంలో ఎంతో మంది మేధావులు వస్తూనే ఉంటారు. అయితే తొలి డిగ్రీ కూడా సంపాదించకుండానే గణిత ప్రపంచానికి షాకిచ్చిందో 17 ఏళ్ల అమ్మాయి.


బహమాస్‌కు చెందిన హన్నా కైరో చిన్నప్పటి నుంచి ఇంటి వద్దనే చదువుకుంది. గణితంలో ఆమె చూపిన ఆసక్తికి తల్లిదండ్రులు కూడా మద్దతుగా నిలిచారు. దీంతో గణితంలో ఎన్నో అంశాలను వంటబట్టించుకున్న ఆమె.. కరోనా లాక్‌డౌన్ సమయంలో ఆన్‌లైన్‌లో చికాగో మ్యాథ్ సర్కిల్‌లో చేరింది.

ఈ వేదికలో పలు గణిత ప్రశ్నలను పరిష్కరించేందుకు అందరూ ప్రయత్నిస్తుంటారు. ప్రొఫెషనల్ గణిత శాస్త్రవేత్తలు ఎదుర్కొనే సవాళ్లను తొలిసారి చూసిన ఆమె మరింత ఆసక్తిగా గణితంపై ఫోకస్ పెట్టింది. 14 ఏళ్ల వయసులో ఎటువంటి డిగ్రీ లేకపోయినా సరే అడ్వాన్స్‌డ్ అండర్‌ గ్రాడ్యుయేట్ స్థాయి గణితాన్ని తాను మాస్టర్ చేశానని ఆమె పేర్కొంది. ఈ క్రమంలోనే బార్కిలీ మ్యాథ్ సర్కిల్ సమ్మర్ ప్రోగ్రాంకు దరఖాస్తు చేసింది. ఆమె నైపుణ్యాన్ని చూసిన ఆ సంస్థ కూడా హన్నాను ఆహ్వానించింది.

ఇక్కడే ఫోరీర్ రిస్ట్రిక్షన్ థియరీలో సుమారు 40 ఏళ్లుగా సమస్యగా ఉన్న మిజొహట-తకెయుచీ కంజక్చర్ ఆమెకు పరిచయమైంది. దీనిపై పలు పరిశోధనలు చేసిన హన్నా.. ఈ కంజక్చర్‌లో ఉన్న పరిమితులను బ్రేక్ చేసేందుకు ప్రయత్నించింది. చివరకు ఈ సూత్రం పనిచేయని పరిస్థితిని గుర్తించింది. తన ప్రయోగాన్ని ఏఆర్‌ఎక్స్ఐవీలో పంచుకోగా.. ప్రపంచంలోని గణిత శాస్త్రవేత్తలు ఇంత చిన్న వయసులోనే ఆమె ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడాన్ని నమ్మలేకపోయారు.

ఇదంతా గమనించిన యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్.. ఎలాంటి హైస్కూల్ డిప్లొమా, అండర్‌ గ్రాడ్యుయేట్ డిగ్రీలు లేకపోయినా సరే హన్నాను నేరుగా గణితంలో తమ పీహెచ్‌డీ ప్రోగ్రాంలో చేర్చుకోవాలని నిర్ణయించుకుంది. ఇది పూర్తి చేస్తే ఆమె తన జీవితంలో తీసుకునే తొలి అకాడమిక్ డిగ్రీ ఇదే అవుతుంది. అయితే ఇప్పటికే గణిత శాస్త్రంపై హన్నా తన ముద్ర వేసిందనే చెప్పాలి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.