తెలంగాణకు భారీ నుండి అతిభారీ వర్షసూచన నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ స్కూల్స్ కి సెలవు ప్రకటించింది. హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాలలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు 13,14వ తేదీన సెలవు ప్రకటించింది.
GHMC పరిధిలో 13, 14వ తేదీలలో పాఠశాలలకు ఈ రెండురోజులు కూడా ఒక్కపూట సెలవు ప్రకటించింది. GHMC పరిధిలోని అన్ని పాఠశాలలు ఉదయంపూట మాత్రమే తరగతులు నిర్వహించనున్నాయి.
ఇకపోతే మంగళవారం సాయంత్రం రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయనే హెచ్చరికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలోనే స్కూల్స్, కాలేజ్‌లకు సెలవులు ఇవ్వాలా? వద్దా? అనేది పరిస్థితిని బట్టి అంచనా వేసుకోవాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలలు, కాలేజీలు నడపాలా, సెలవు ప్రకటించాలా అన్నది స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అధికారులు నిర్ణయం తీసుకోవాలని చెప్పారు.సమీక్ష అనంతరం విద్యాశాఖ మంగళవారం రాత్రి ఉత్తర్వులను జారీచేసింది.
అలాగే ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోం నిర్వహించుకునేలా ఆయా సంస్థలతో ఐటీ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ సమన్వయం చేయాలని సూచించారు. అలాగే భారీ వర్షాలు కురిసే సమయంలో ప్రజలు రోడ్ల మీదకు రాకుండా ఉండేలా అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు.
వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో అధికార యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్‌తో పాటు భారీ వర్షాలు, వరద ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాల్లో ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులు, జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. రానున్న 72 గంటల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి… రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అప్రమత్తం చేశారు.
రానున్న పరిస్థితులను ఎదుర్కొనడానికి తీసుకోవలసిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాబోయే మూడు రోజులు కీలకంగా మారినందున అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది సెలవులను రద్దు చేయాలని చెప్పారు. అధికారులు 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండాలని… ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టం జరకుండా, పశు సంపదకు నష్టం జరక్కుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
24 గంటల్లో 2 సెం.మీ వర్షాన్ని తట్టుకునే విధంగా పట్టణాలు నిర్మితమై ఉన్నాయని… అయితే క్లౌడ్ బరస్ట్ సమయాల్లో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అందరూ సన్నద్ధంగా ఉండాలని కోరారు. గతంలో 2 గంటల వ్యవధిలోనే 42 సెం.మీ వర్షం పడటంతో నష్టం జరిగిన విషయాన్ని గుర్తుచేశారు. అవసరమైన చోట విపత్తు నివారణ నిధులను వినియోగించుకోవాలని సూచించారు. భారీ వర్షాలు, విపత్తులను ఎదుర్కొవడానికి నిధులకు కొరత లేదని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్, గ్రామీణ ప్రాంతాల కోసం టోల్ ఫ్రీ హెల్ప్ లైన్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
































