దేశవ్యాప్తంగా ఉన్న టోల్ ప్లాజాలు, ఫాస్టాగ్ ల విషయంలో కేంద్ర ప్రభుత్వం రోజుకో సంచలన నిర్ణయాన్ని తీసుకుంటూ వస్తోంది. జాతీయ రహదారులపై నిర్మించిన టోల్ ప్లాజాల వద్ద వాహనాల రాకపోకలు మరింత సజావుగా సాగడానికి సరికొత్త వ్యవస్థకు శ్రీకారం చుడుతోన్నప్పటికీ..
అది వాహనదారులకు భారంగా పరిణమిస్తోంది.
ప్రస్తుతం జాతీయ రహదారులపై నెలకొల్పిన ప్లాజాల వాహనాల నుంచి టోల్ మొత్తాన్ని వసూలు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. దీని కోసం ఫాస్టాగ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫాస్టాగ్ విధానం అందుబాటులో ఉన్నప్పటికీ.. టోల్ ప్లాజాల వద్ద తప్పనిసరిగా కొంతసేపయినా వాహనాలను నిలిపివేయాల్సి వస్తోంది.
కొన్ని సందర్భాల్లో ఫాస్టాగ్ రీడర్లు మొరాయించడం, సాంకేతిక లోపాలు తలెత్తుతోండటం వల్ల టోల్ ప్లాజాల వద్ద కిలోమీటర్ల కొద్దీ వాహనాలు బారులు తీరి నిల్చున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ఫాస్టాగ్ ఉన్నప్పటికీ.. వాహనాల రాకపోకలు సజావుగా సాగట్లేదనే అభిప్రాయానికి వచ్చింది కేంద్రం.
దీన్ని దృష్టిలో ఉంచుకుని- మరో సరికొత్త వ్యవస్థపై దృష్టి సారించింది. కొత్తగా టోల్ పాసులను ప్రవేశపెట్టింది. వార్షిక టోల్ పాస్ ధర- 3,000 రూపాయలు. దీన్ని కొన్న తేదీ నుంచి మరుసటి ఏడాది అదే తేదీ వరకు 200 ట్రిప్పులు రాకపోకలు సాగించే వీలు వాహనదారులకు ఉంటుంది. ఈ సౌకర్యం నాన్ కమర్షియల్ వెహికల్స్ అంటే కార్లు, జీపులు, వ్యాన్లకు మాత్రమే వర్తిస్తుంది. కమర్షియల్ వాహనాలకు ఈ పాస్ వర్తించదు.
ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ వార్షిక ఫాస్టాగ్ టోల్ పాస్ ను అమలులోకి తీసుకుని రానున్నట్లు ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. వార్షిక పాస్ కొన్న తేదీ నుంచి ఏడాది పాటు అంటే పాస్ కొన్న తేదీ వరకు లేదా.. 200 ట్రిప్పులు.. వీటిలో ఏది ముందుగా వస్తే అది- చెల్లుబాటు అవుతుంది.
ఇప్పుడిదే ఫాస్టాగ్ ను తిరుమల తిరుపతి దేవస్థానం తప్పనిసరి చేసింది. ఈ నూతన విధానం ఈ నెల 15 నుండి అమలులోకి రానుంది. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వివిధ వాహనాల్లో చేరుకునే భక్తులకు మెరుగైన భద్రతా ప్రమాణాలు, అధిక రద్దీ నివారణ, పారదర్శక సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ నెల 15వ తేదీ నుండి తిరుమలకు వెళ్లే వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి చేసింది టీటీడీ.
ఇకపై ఫాస్టాగ్ లేని వాహనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తిరుమలకు అనుమతించబోమని టీటీడీ తేల్చి చెప్పింది. ఫాస్టాగ్ లేని వాహనదారుల సౌకర్యార్థం అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద ఐసిఐసిఐ బ్యాంకు వారి సహకారంతో వాటిని జారీ చేస్తామని, దీనికోసం ప్రత్యేకంగా కౌంటర్ ను ఏర్పాటు చేశామని తెలిపింది.
ఫాస్ట్ టాగ్ లేని వాహనదారులు ఈ కౌంటర్ వద్ద అతి తక్కువ సమయంలో వాటిని పొందవచ్చని, వాటిని తీసుకున్న తరువాత మాత్రమే వారి వాహనాలను తిరుమలకు అనుమతిస్తారని స్పష్టం చేసింది టీటీడీ. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని టీటీడీకి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేసింది.































