స్త్రీశక్తి (మహిళలకు ఉచిత బస్ ప్రయాణం) పథకం ప్రారంభంతో తమ జీవనోపాధి దెబ్బతింటుందంటూ ఆటోడ్రైవర్లలో వ్యక్తమవుతున్న ఆందోళనల నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించింది. దీనిలో భాగంగా ఆటోడ్రైవర్ల కోసం ఒక కొత్త పథకాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. స్త్రీ శక్తి పథకం ఈ నెల 15వ తేది నుండి ప్రారంభం కానుండగా, ఆటోడ్రైవర్లకోసం రూపొందించే కొత్త పథకం ఎలా ఉంటుందో, విధి విధానాలు ఏమిటో, ఎప్పటి నుండి ఆ పథకం అమలులోకి వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఉచిత బస్సు పథకంపై మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో చంద్రబాబునాయుడు ఆటోడ్రైవర్ల అంశాన్ని ప్రస్తావించారు.
ఆటోడ్రైవర్లకోసం ఇప్పటికే ఉన్న కేంద్ర, రాష్ట్ర పథకాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర పథకాలతో కలిపి కొత్త పథకం రూపొందించాలని, దీనికోసం సమగ్ర అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. అధికారులు అధ్యయనం పూర్తి చేసి, ప్రతిపాదనలు సమర్పించిన తరువాత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీనికేమీ నిర్దిష్ట గడువును రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించలేదు.
మరోవైపు స్త్రీ శక్తి పథకాన్ని ఈ నెల 15న విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండులో ప్రారంభించనున్నట్లు సిఎం చంద్రబాబునాయుడు ఈ సమీక్షలో వెల్లడించారు. ఈ పథకం అమల్లో ఎటువంటి లోపాలు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ఉచిత బస్ ప్రయాణ పథకంతో ప్రయాణికుల రద్దీకి అవకాశం ఉండటంతో ట్రాఫిక్ నిర్వహణ సమర్థంగా చేయాలన్నారు. అందుకు తగ్గట్లు సామర్ధ్యం పెంచుకోవాలని, ఎక్కడా ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలన్నారు.
ఉచిత బస్ ప్రయాణంపై ఎప్పటికప్పుడు ప్రయాణికుల వద్ద నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవడంతో పాటు అందుకు తగ్గట్లు మెరుగైన ఆలోచనలు చేసి పథకాన్ని ముందుకు తీసుకెళ్ళాలన్నారు. ఇ పోస్ మిషన్లకు జిపిఎస్ తప్పనిసరిగా ఎనేబుల్ చేసి ట్రాక్ చేయడం ద్వారా ప్రయాణికులకు సమాచారాన్ని అందించాల న్నారు. ఆర్‌టిజిఎస్‌తో అనుసంధానమై పనిచేయా లన్నారు. టాయిలెట్లను ప్రతి 2 గంటలకొకసారి శుభ్రపరచాలన్నారు. అన్ని బస్‌స్టేషన్లలో తాగునీటి కోసం ఆర్‌ఓ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని, రూ.30 కోట్లతో చేపట్టిన బస్‌స్టేషన్లు మరమ్మతులు, పెయింటింగ్ పనులు ఈ ఏడాది డిసెంబరు నాటికి పూర్తి చేయాలని సిఎం అధికారులను ఆదేశించారు. రద్దీకి అనుగుణంగా బస్సు సర్వీసులు అదనంగా నడపాల్సి రావడంతో బస్సులు ఎక్కడా బ్రేక్ డౌన్ కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
































