ఒకప్పుడు బీపీ, డయాబెటీస్, గుండెజబ్బులు, స్ట్రోక్ వంటివి వయసు పైబడ్డాక, 50 ఏళ్ళు దాటాక వచ్చేవి. ఈ మధ్య ఇరవైలు ముప్ఫయిల్లోనే ఈ వ్యాధులను చూస్తున్నాం. ఆహారం లోనూ జీవన శైలిలోనూ కొన్ని మార్పులు చేసుకొంటే, ఈ వ్యాధులు వచ్చే అవకాశాన్ని తగ్గించు కోవచ్చు.
ప్రస్తుత ప్రపంచం ఏదైనా వ్యాధి వచ్చాక చికిత్సకన్నా… నివారణపైనే ఎక్కువ శ్రద్ధ పెడుతోంది. నా వయసు 30 ఏళ్ళు. భవిష్యత్తులో గుండెనొప్పి, బీపీ, స్ట్రోక్, డయాబెటీస్ వంటి ఇబ్బందులు రాకుండా ఆరోగ్యంగా ఉండాలంటే ఇప్పటి నుంచే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ఒకప్పుడు బీపీ, డయాబెటీస్, గుండెజబ్బులు, స్ట్రోక్ వంటివి వయసు పైబడ్డాక, 50 ఏళ్ళు దాటాక వచ్చేవి. ఈ మధ్య ఇరవైలు ముప్ఫయిల్లోనే ఈ వ్యాధులను చూస్తున్నాం. ఆహారం లోనూ జీవన శైలిలోనూ కొన్ని మార్పులు చేసుకొంటే, ఈ వ్యాధులు వచ్చే అవకాశాన్ని తగ్గించు కోవచ్చు. మితంగా తినడం, సమయానికి ఆహారం తీసుకోవడం, తప్పనిసరిగా రోజూ శారీరక శ్రమ చేయడం, నిద్ర అశ్రద్ధ చేయక పోవడం వంటివి ఆరోగ్యకరమైన జీవనశైలికి అవసరం. రోజువారీ ఆహారంలో ముడి ధాన్యాలు, పప్పు ధాన్యాలు, ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు, గింజలు, గుడ్లు, పాలు, పెరుగు మొదలైనవి తప్పనిసరిగా ఉండాలి. ఫాస్ట్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, బాగా నూనెలు వాడి తయారు చేసే చిరుతిళ్ళు, స్వీట్స్, బిస్కెట్స్ వంటివి ఎంత తక్కువ తీసుకొంటే అంత మేలు. రోజూ కనీసం 30 నిమిషాలపాటు ఏదైనా శారీరక శ్రమ లేదా వ్యాయామం చేస్తే గుండె ఆరోగ్యానికి మంచిది. ఇది బీపీ సమస్య రాకుండా, ఒకవేళ సమస్య ఉంటే అధిగమించేందుకు కూడా ఉపయోగపడుతుంది. వారాంతాల్లో అధికంగా బయటి ఆహారం తీసుకోవడం, నిద్రను అలక్ష్యం చేయడం, పార్టీలంటూ ఆల్కహాల్ సేవించడం, ఇవన్నీ కూడా అప్పటికప్పుడు ప్రభావం చూపకపోయినా చిన్న వయసులోనే అనారోగ్యాల పాలయ్యేందుకు కారణాలవుతాయి.
మైక్రోన్యూట్రియెంట్స్ అంటే ఏమిటి? వీటి కోసం ఏం తీసుకోవాలి?
మన శరీరానికి చాలా తక్కువ మోతాదులో అవసరమయ్యే పోషకాలను మైక్రోన్యూట్రియెంట్స్ అంటారు. విటమిన్లు, ఖనిజాలు ఈ కోవకు చెందుతాయి. ఇవి కేవలం మైక్రోగ్రాములు, మిల్లీ గ్రాముల మోతాదులోనే సరిపడతాయి. కానీ వీటి లోపాలతో జీవక్రియల్లో వివిధ ఇబ్బందులొస్తాయి. ఉదాహరణకు మనకు కేవలం 18 మిల్లీ గ్రాముల ఐరన్ మాత్రమే అవసరం, కానీ ఐరన్ లోపం వలన రక్తహీనత చాలా తరచుగా చూస్తుంటాం. విటమిన్ ఏ రోజుకు 600-700 మైక్రోగ్రాముల మేరకు అవసరమవుతుంది. కానీ ఈ చిన్న మొత్తంలో అయినా విటమిన్ ఏ ఉంటేనే మన రోగనిరోధక వ్యవస్థ, లైంగిక వ్యవస్థ, మొదలైనవాటి పనితీరు సక్రమంగా ఉంటుంది. మైక్రోన్యూట్రియెంట్స్ అనేవి మనం ప్రత్యేకంగా ఏ ఒకటో రెండో తీసుకొంటే సరిపోదు. శరీరంలో అన్ని వ్యవస్థలు సక్రమంగా పని చేయాలంటే అన్ని పోషకాలు తగినంత అవసరమే. సమతులాహారం తీసుకొంటే అన్నీ తగినంత లభిస్తాయి. ధాన్యాలు, ధాన్యాల ఉత్పత్తులు, పప్పు ధాన్యాలు, గింజలు, కాయగూరలు, ఆకుకూరలు, పండ్లు, పాలు, పాల పదార్థాలు, మాంసం, చేపలు, గుడ్లు- వీటన్నింటిలోనూ మైక్రోన్యూట్రియెంట్స్ పుష్కలం. ఫాస్ట్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, మైదాతో చేసిన పదార్థాలను ఆహారంలో అధికంగా తీసుకున్నప్పుడు పోషకాల లోపాలు వస్తాయి.
ఈ మధ్య మార్కెట్లో రకరకాల ఉప్పు చూస్తున్నాం. అయోడిన్ ఉన్న ఉప్పు మాత్రమే వాడాలని వైద్యులు, నిపుణులు సూచిస్తున్నారు, ఎందుకు? అయోడిన్ వలన ఉపయోగాలేమిటి? మరేదైనా ఆహారం ద్వారా కూడా అయోడిన్ పొందవచ్చా?
శరీరంలో ముఖ్యమైన జీవక్రియలు నిర్వర్తించే థైరాయిడ్ హార్మోను ఉత్పత్తికి ఐయోడిన్ అత్యవసరం. పద్దెనిమిదవ శతాబ్దానికి ముందు అయోడిన్ లోపం వల్ల గాయిటర్ వ్యాధి రావటాన్ని గుర్తించారు. పందొమ్మిదవ శతాబ్దంలో వివిధ దేశాలు ఈ గాయిటర్ వ్యాధిని తేలికగా నివారించేందుకు అందరూ రోజువారీ ఆహారంలో వాడే ఉప్పును వాహకంగా ఎంచుకొన్నారు. భారత దేశంలో 1950ల నుంచి అయోడైజ్డ్ ఉప్పు వాడకాన్ని గాయిటర్ అధికంగా ఉన్న ప్రాంతాల్లో మొదలు పెట్టారు. తరువాత నెమ్మదిగా అన్ని ప్రాంతాలకు విస్తరించింది.
ఇప్పుడు కూడా మార్కెట్లో అధిక శాతం అయోడైజ్డ్ ఉప్పుగానే దొరుకుతోంది. పరిమిత మోతాదుల్లో ఇది వాడడం వల్ల థైరాయిడ్ సమస్యలు, గాయిటర్ వ్యాధిని అడ్డుకోవచ్చు. గర్భిణుల్లో అయోడిన్ లోపం ఉంటే పుట్టే బిడ్డ శారీరక, మానసిక ఎదుగుదల సక్రమంగా ఉండదు. పెద్దలలో రోజుకు సుమారు 150 మైక్రో గ్రాముల అయోడిన్ అవసరం. మార్కెట్లో దొరికే అయోడైజ్డ్ ఉప్పులో ప్రతి గ్రాముకు 30-40 మైక్రో గ్రాముల అయోడిన్ లభిస్తుంది. రోజుకు ఐదు గ్రాముల అయోడైజ్డ్ ఉప్పు తీసుకున్నప్పుడు రోజుకు సరిపడా అయోడిన్ దాదాపుగా లభిస్తుంది. కొద్ది మోతాదుల్లో అయోడిన్ సీవీడ్ (సముద్రపు నాచు), సముద్రపు చేపలు, గుడ్లు, పాల పదార్ధాల నుంచి లభిస్తుంది కానీ రోజుకు కావలసిన పరిమాణంలో రాదు. కాబట్టి ఆహారంలో అయోడైజ్డ్ ఉప్పు చేర్చుకోవడం మంచిది.
































