వెనక్కి తగ్గిన ఐసీఐసీఐ బ్యాంక్ – మినిమం బ్యాలెన్స్ రూ.50వేలు కాదు.. ఎంత ఉండాలంటే ?

సేవింగ్స్ బ్యాంక్ ఖాతాల్లో రూ.50వేల మినిమం బ్యాలెన్స్ మెయిన్టెయిన్ చేయకపోతే చార్జీలు వసూలు చేయాలన్న ఐసీఐసీఐ బ్యాంక్ ..


తన నిర్ణయాన్ని మార్చుకుంది. కస్టమర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవడంతో ICICI బ్యాంక్ తన పొదుపు ఖాతాలకు కనీస సగటు బ్యాలెన్స్ (MAB) పరిమితులను మార్చింది. కొత్త మినిమం అకౌంట్ బ్యాలెన్స్ (MAB) మెట్రో , పట్టణ ప్రాంతాలలోని కస్టమర్లకు రూ. 15,000కు తగ్గించారు. సెమీ-అర్బన్ కస్టమర్లకు రూ. 7,500 , గ్రామీణ ప్రాంతాలలోని వారికి రూ. 2,500 ఖరారు చేశారు. గతంలో ప్రకటించిన పట్టణాల్లో రూ. 50,000, సెమీ-అర్బన్ ప్రాంతాలకు రూ. 25,000 , గ్రామీణ ప్రాంతాలకు రూ. 10,000లు ఇక ఉండవు.

రూ. 50,000 మినిమం బ్యాలెన్స్ అవసరం మధ్యతరగతి ఖాతాదారులకు భారంగా ఉంటుందని, బ్యాంక్ తక్కువ ఆదాయ ఖాతాదారులను నిరోధిస్తూ ధనవంతులైన క్లయింట్లపై దృష్టి సారిస్తోందని విమర్శలు వచ్చాయి. అయితే ఆర్థిక నిపుణులు, RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా బ్యాంకులకు మినిమం బ్యాలెన్స్ నిబంధనలను స్వయంగా నిర్ణయించే స్వేచ్ఛ ఉందని స్పష్టం చేశారు. తీవ్రమైన ప్రజా వ్యతిరేకత , ఖాతాదారులు ఇతర బ్యాంకులకు వెళ్లిపోయే ప్రమాదం ఉండటంతో పాటు కొత్త ఖాతాలు ఓపెన్ చేసేవారు తగ్గిపోతారన్న కారణంతో ICICI బ్యాంక్ ఆగస్టు 13, 2025న నగర ప్రాంతాల్లో కొత్త సేవింగ్స్ ఖాతాల కోసం రూ. 50,000 మినిమం బ్యాలెన్స్ అవసరాన్ని ఉపసంహరించుకుంది.

సాధారణంగా కరెంట్ అకౌంట్లకు ఎంఏబీని చాలా పెద్ద మొత్తంలో బ్యాంకులు నిర్ణయిస్తాయి. కానీ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లు సాధారణంగా దిగువ మధ్యతరగతి వారు మాత్రమే ఉపయోగిస్తారు. ఇందులో అత్యధికంగా శాలరీ అకౌంట్లు ఉంటాయి. ఐసీఐసీఐ బ్యాంక్ కూడా.. తమ బ్యాంకులో శాలరీ అకౌంట్లు ఓపెన్ చేయాలని చాలా సంస్థలతో కలిసి ప్రైవేటు ఉద్యోగులకు అకౌంట్లు ఇచ్చింది. అయితే ఇప్పుడు కొత్తగా అలాంటి అకౌంట్లు ఓపెన్ చేయాలంటే.. మినిమం శాలరీ యాభైవేలు ఉండేలా నిబంధనలు మార్చింది. ఇది పాత ఖాతాదారులను కూడా ఆందోళనకు గురి చేసింది. త్వరలోనే తమ ఖాతాలకూ అలాంటి నిబంధనలు తెస్తే ఎలా అన్న ఆలోచనకు వచ్చే ప్రమాదం ఏర్పడింది. అలా చేస్తే పెద్ద ఎత్తున ఇతర బ్యాంకులకు ఖాతాదారులు తరలి వెళ్లే అవకాశం ఉంది. ఈ ప్రమాదాన్ని కూడా ఊహించి చివరికి.. నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.