ఫాస్టాగ్ వార్షిక పాస్ రేపటి నుంచి అందుబాటులోకి రానుంది. ఈ యాన్యువల్ పాస్‌తో రూ.3వేల చెల్లిస్తే, దేశంలో ఎక్కడైనా తిరగొచ్చు! ఈ వార్షిక పాస్ని ఎలా కొనుగోలు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి
దేశంలో రహదారి ప్రయాణాలను మరింత సులభతరం చేసేందుకు తలపెట్టిన ఫాస్టాగ్ వార్షిక పాస్ ఆగస్ట్ 15న అందుబాటులోకి రానుంది. దీని ద్వారా ఏడాదికి ఒకేసారి రూ. 3,000 చెల్లించి జాతీయ రహదారులపై అపరిమితంగా ప్రయాణించవచ్చు!
ఫాస్టాగ్ యాన్యువల్ పాస్..
సాధారణ ఫాస్టాగ్ రీఛార్జి విధానంలో బ్యాలెన్స్ అయిపోయినప్పుడు మళ్లీ రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ వార్షిక పాస్‌తో ఏడాది పాటుగానీ లేదా 200 టోల్ క్రాసింగ్‌లు పూర్తయ్యే వరకు గానీ, వీటిలో ఏది ముందైతే అది వర్తిస్తుంది. ఇది తరచూ హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలపై ప్రయాణించే వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ పాస్‌తో ఏడాది పొడవునా అదనపు రీఛార్జీలు లేకుండా జాతీయ రహదారులపై అపరిమితంగా ప్రయాణించవచ్చు.
అంతేకాకుండా.. తక్కువ దూరం ప్రయాణించే వారి కోసం డిస్టెన్స్-బేస్డ్ ప్రైసింగ్ మోడల్ కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ విధానంలో ప్రయాణికులు ప్రస్తుత వేరియబుల్ టోల్ రేట్లకు బదులుగా, ప్రతి 100 కిలోమీటర్లకు రూ. 50 చెల్లించే ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. దీనివల్ల అప్పుడప్పుడు ప్రయాణించే వారికి ఇది సరసమైన, అనుకూలమైన ఆప్షన్‌గా ఉంటుంది.
ఫాస్టాగ్ వార్షిక పాస్ కొనే విధానం..
ఆగస్ట్ 15లోగా ఈ ఫాస్టాగ్ వార్షిక పాస్‌ను కొనుగోలు చేయడానికి..
- అధికారిక ప్లాట్‌ఫామ్: గూగుల్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి ‘రాజ్‌మార్గ యాత్ర’ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. లేదా ఎన్‌హెచ్‌ఏఐ/ఎంఓఆర్‌టీహెచ్ అధికారిక పోర్టల్‌లో లాగిన్ అవ్వండి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌తో లాగిన్ అవ్వండి లేదా మీ వాహనం రిజిస్ట్రేషన్ నెంబర్, ఫాస్టాగ్ ఐడీని నేరుగా ఎంటర్ చేయండి.
2. అర్హత ధృవీకరణ: మీరు యాప్‌లో లాగిన్ అవగానే, మీ ఫాస్టాగ్ యాక్టివ్‌గా ఉందా లేదా, సరిగ్గా అటాచ్ అయ్యిందా, వాహనం రిజిస్ట్రేషన్‌కు లింక్ అయ్యిందా అని సిస్టమ్ ఆటోమేటిక్‌గా తనిఖీ చేస్తుంది. అలాగే, మీ ఫాస్టాగ్ బ్లాక్‌లిస్ట్‌లో ఉందా అని కూడా తనిఖీ చేస్తుంది.
3. చెల్లింపు: తనిఖీ పూర్తైన తర్వాత, మీకు అనేక ఫాస్టాగ్ రీఛార్జ్ ప్లాన్‌లు కనిపిస్తాయి. అందులో నుంచి రూ. 3,000 వార్షిక పాస్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఆ తర్వాత మీరు యూపీఐ, డెబిట్/క్రెడిట్ కార్డులు లేదా నెట్ బ్యాంకింగ్ వంటి పేమెంట్ ఆప్షన్లలో ఒకదాన్ని ఎంచుకుని చెల్లింపు చేయవచ్చు. అయితే, ఫాస్టాగ్ వాలెట్ బ్యాలెన్స్‌ను ఈ వార్షిక పాస్ ఫీజు చెల్లించడానికి ఉపయోగించకూడదు.
4. వార్షిక పాస్ లింకింగ్: చెల్లింపు విజయవంతంగా పూర్తయిన తర్వాత, వార్షిక పాస్ మీ ప్రస్తుత ఫాస్టాగ్ అకౌంట్, వాహనం రిజిస్ట్రేషన్‌తో లింక్ అవుతుంది.
5. ఎస్ఎంఎస్ నిర్ధరణ: చివరిగా.. ఆగస్టు 15 నుంచి మీ ఫాస్టాగ్ వార్షిక పాస్ యాక్టివేట్ అవుతుందని మీకు ఎస్ఎంఎస్ ద్వారా నిర్ధారణ సందేశం వస్తుంది.
కొత్త ఫాస్టాగ్ వార్షిక పాస్‌పై ముఖ్య విషయాలు..
ఇండియన్ హైవేస్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్ ప్రకారం.. ఈ ఫాస్టాగ్ వార్షిక పాస్ ప్రైవేట్, వాణిజ్యేతర కార్లు, జీపులు, వ్యాన్‌లకు మాత్రమే వర్తిస్తుంది. వాణిజ్య వాహనాలకు దీనిని వాడితే ఎలాంటి నోటీసు లేకుండానే తక్షణమే పాస్ డియాక్టివేట్ అవుతుంది.
వార్షిక పాస్ దేశంలోని అన్ని జాతీయ రహదారులు, జాతీయ ఎక్స్‌ప్రెస్‌వేలలో చెల్లుబాటు అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు లేదా స్థానిక సంస్థలచే నిర్వహించే ఎక్స్‌ప్రెస్‌వేలు, రాష్ట్ర రహదారులపై మాత్రం సాధారణ ఫాస్టాగ్ మాదిరిగానే పని చేస్తుంది. అక్కడ వర్తించే టోల్ రుసుము వర్తిస్తుంది.
ఛాసిస్ నెంబర్‌తో రిజిస్టర్ అయిన ఫాస్టాగ్‌లపై వార్షిక పాస్‌ను జారీ చేయలేమని ఐహెచ్‌ఎంసీఎల్ తెలిపింది. వార్షిక పాస్‌ను యాక్టివేట్ చేయడానికి వాహనం రిజిస్ట్రేషన్ నెంబర్‌ను తప్పనిసరిగా అప్‌డేట్ చేయాలి.
ఈ వార్షిక పాస్ తప్పనిసరి కాదని వినియోగదారులు గమనించాలి. వారు తమ ఫాస్టాగ్‌ను పాత పద్ధతిలోనే, అంటే టోల్ ప్లాజాల వద్ద వర్తించే రుసుములకు అనుగుణంగా సాధారణ లావాదేవీల మాదిరిగా కొనసాగించవచ్చు.
ఐహెచ్‌ఎంసీఎల్ తెలిపిన వివరాల ప్రకారం.. ఫాస్టాగ్ వాలెట్ బ్యాలెన్స్ ద్వారా రూ. 3,000 వార్షిక పాస్ ఫీజును చెల్లించడానికి వీలు లేదు. వినియోగదారులు ‘రాజ్‌మార్గ యాత్ర’ యాప్ లేదా ఎన్‌హెచ్‌ఏఐ/ఎంఓఆర్‌టీహెచ్ పోర్టల్‌లో అందుబాటులో ఉన్న పేమెంట్ ఆప్షన్ల ద్వారా మాత్రమే ఫీజు చెల్లించాలి. ప్రస్తుతం ఉన్న వాలెట్ బ్యాలెన్స్‌ను రాష్ట్ర రహదారుల టోల్స్, పార్కింగ్ వంటి వాటికి ఉపయోగించవచ్చు.






























