ర్యాపిడో నుంచి కొత్త ఫుడ్​ డెలివరీ యాప్​ లాంచ్​- స్విగ్గీ, జొమాటో కన్నా 15శాతం తక్కువ ధర..

‘ఓన్లీ’ పేరుతో ర్యాపిడో నుంచి ఒక కొత్త ఫుడ్​ డెలివరీ యాప్​ లాంచ్​ అయ్యింది. ఇది స్విగ్గీ, జొమాటో వంటి ప్రముఖ ఫుడ్​ డెలివరీ యాప్స్​కి గట్టిపోటీగా నిలవనుంది.

బైక్ ట్యాక్సీ, రైడ్-హెయిలింగ్ సేవలతో బాగా పేరు పొందిన ర్యాపిడో సంస్థ ఇప్పుడు ఫుడ్ డెలివరీ రంగంలోకి అడుగుపెట్టింది. ‘ఓన్లీ’ పేరుతో ప్రత్యేకమైన ఫుడ్ డెలివరీ యాప్‌ను తాజాగా ప్రారంభించింది. ప్రస్తుతం ఈ యాప్​ సేవలు బెంగళూరులో అందుబాటులోకి వచ్చాయి. నగరంలోని కోరమంగళ, హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్, బీటీఎం లేఅవుట్‌ అనే మూడు ప్రాంతాల్లో సంస్థ ఈ సేవలను ప్రారంభించినట్లు సమాచారం.


ఫుడ్ డెలివరీ దిగ్గజాలైన స్విగ్గీ, జొమాటోలకు గట్టి పోటీ ఇచ్చేలా ర్యాపిడో ఈ కొత్త యాప్‌ను తీసుకొచ్చింది. ఈ యాప్‌లో ఫుడ్ ఆర్డర్ చేస్తే, ఇతర యాప్‌ల కంటే 15 శాతం తక్కువ ధరకే లభిస్తుందని కంపెనీ చెబుతోంది. దీనికి కారణం ‘జీరో కమిషన్’ మోడల్! ఇతర ఫుడ్ డెలివరీ యాప్‌లు రెస్టారెంట్ల నుంచి 30 శాతం వరకు కమిషన్ తీసుకుంటాయి. కానీ ర్యాపిడో మాత్రం రెస్టారెంట్ల నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోకుండా, ప్రతి ఆర్డర్‌కు ఒక నిర్ణీత రుసుము (ఫిక్స్‌డ్ ఫీ) వసూలు చేయనుంది.

ర్యాపిడో ఓన్లీ- తక్కువ ధరకే ఫుడ్ డెలివరీ..

ర్యాపిడో ‘ఓన్లీ’ యాప్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేస్తే “హిడెన్ ఫీజులు ఉండవు” అని, ఆన్‌లైన్‌లో కూడా “ఆఫ్‌లైన్ ధరలకే” ఫుడ్ లభిస్తుందని కంపెనీ హామీ ఇస్తోంది. ఈ ఆండ్రాయిడ్ యాప్ ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది. ఇందులో పాపులర్ బ్రాండ్స్​.. వావ్!, ఈట్‌ఫిట్, క్రిస్పీ క్రీమ్, ఫాసోస్ వంటివి ఉన్నాయి. చాలా వరకు వంటకాలు రూ. 150 లోపు ధరలోనే లభిస్తాయి. దీంతో తక్కువ ధరలో మంచి ఆహారం తినాలనుకునే వారికి ఇది ఒక మంచి ఆప్షన్‌గా మారే అవకాశం ఉంది.

ర్యాపిడీ ఓన్లీ- డెలివరీ ఫీజు వివరాలు..

నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాతో ర్యాపిడో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. 4 కిలోమీటర్లు లేదా అంతకంటే తక్కువ పరిధిలో డెలివరీ అయ్యే అన్ని ఆర్డర్‌లకు రెస్టారెంట్ భాగస్వాములే డెలివరీ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది.

పలు మీడియాని వేదికల ప్రకారం..

ఆర్డర్ విలువ రూ. 100 లేదా అంతకంటే తక్కువ ఉంటే, డెలివరీ ఛార్జ్ రూ. 10 ఉంటుంది. అయితే, కస్టమర్లు రూ. 20 చెల్లించాల్సి ఉంటుంది.

ఆర్డర్ విలువ రూ. 100 కంటే ఎక్కువ, రూ. 400 కంటే తక్కువ ఉంటే, డెలివరీ ఛార్జ్ రూ. 25తో పాటు జీఎస్​టీని కూడా చెల్లించాలి.

ఆర్డర్ విలువ రూ. 400 కంటే ఎక్కువ ఉంటే, డెలివరీ ఛార్జ్ రూ. 50గా ఉంటుంది.

ఈ కొత్త సేవలను ప్రారంభించడానికి ముందు, ర్యాపిడో తన ఉద్యోగులతో కొన్ని వారాల పాటు అంతర్గతంగా పరీక్షలు నిర్వహించింది. ఫుడ్ డెలివరీల కోసం ప్రస్తుతం ఉన్న తన టూ-వీలర్ ఫ్లీట్‌ను ఉపయోగించనుంది.

2015లో బైక్ ట్యాక్సీ అగ్రిగేటర్‌గా ర్యాపిడో ప్రారంభమైంది. తర్వాత 2023లో ఆటో రిక్షాలు, పార్శిల్‌ సర్వీసులు, క్యాబ్‌ రైడ్స్‌ వంటి సేవలను కూడా మొదలుపెట్టింది. ఇప్పుడు ‘ఓన్లీ’ యాప్‌తో ఫుడ్ డెలివరీ మార్కెట్‌లో అతిపెద్ద పోటీదారుగా నిలిచింది.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.