వేరుశెనగ వృద్ధాప్యాన్ని దూరం చేస్తుందా..? అధ్యయనంలో విస్తుపోయే విషయాలు

అందరికీ అందుబాటులో ఈజీగా తినగలిగే నట్స్‌ ఏవంటే వేరుశెనగనే చెప్పాలి. టైం పాస్‌గా, స్నాక్స్‌గా తినే ఈ గింజలతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయట. తాజాగా ఆ విషయాన్ని శాస్త్రీయ పూర్వకంగా నిర్థారించారు పరిశోధకులు.


అంతేగాదు అధ్యయనంలో చాలా ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అవేంటంటే..

శాస్త్రవేత్తలు ఈ వేరుశెనగ గింజల వల్ల కలిగే ప్రయోజనాలపై అధ్యయనం చేస్తున్నారు. ఇందులో ఉండే ఫైబర్లు, విటమిన్లు, ఆరోగ్యకరమైన కొవ్వు, బరువు తగ్గడానికి, కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గించడానికి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి, వాపుతో పోరాడటానికి, గుండె జబ్బులు, స్ట్రోక్‌ ప్రమాదాన్ని నివారించడానికి సహాయపడతాయని తేలింది.

వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే శారీరకంగా చురుకుగా ఉండగలరని అంటున్నారు. అలాగే ఒమెగా-3 కొవ్వులు, ఫైటోకెమికల్స్‌, కండరాల పునరుద్ధరణకు సహాయపడతాయని, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయని చెబుతున్నారు. మానసికంగా కూడా స్ట్రాంగ్‌గా ఉంటామని చెబుతున్నారు. అలాగే దీనిలోని సెల్యులార్‌ వృద్ధాప్యాన్ని మందగించేలా శక్తిమంతమైన యవ్వనాన్ని ప్రసాదిస్తుందని చెబుతున్నారు.

అధ్యయనంలో విస్తుపోయే విషయాలు..
అందుకోసం 59 మంది యువకులపై మూడు వేర్వేరు సముహాలుగా విభజించి అధ్యయనం చేశారు. ఆరునెలల పాటు ప్రతిరోజూ ఒక సముహానికి 25గ్రాముల వేరుశెనగ గింజలు, 32 గ్రాముల వేరుశెనగ వెన్న లేదా క్రీమ్‌ మరో సముహంకు ఇచ్చారు. ఆ తర్వాత వారందరిలోని టెలోమీర్‌ పొడవుని కొలవగా..గింజలు తిన్నవారిలో టెలోమీర్‌ పొడవు మెరుగ్గా ఉంది.

వేరుశెనగ క్రీమ్‌ తీసుకున్నవారికంటే గింజల రూపంలో తిన్నవారిలోనే ఈ పొడువు కాస్త మెరుగ్గా ఉండటం విశేషం. అయితే ఆ ఇరు సముహాల్లోనూ మరీ అంతా వ్యత్యాసాలు లేవని..అయితే ఈ వేరుశెనగ తినడం వల్ల టెలోమీర్‌ పొడవు తరిగిపోదనే విషయం మాత్రం హైలెట్‌ అయ్యిందని చెబుతున్నారు.

టెలోమీర్‌ పొడవు అంటే..
టెలోమీర్ అనేది క్రోమోజోమ్ చివరన ఉన్న ఒక రక్షణ నిర్మాణం, ఇది వయస్సు పెరిగే కొద్దీ తగ్గిపోతుంది. ఇది కుంచించుకుపోవడాన్ని పూర్తిగా ఆపలేం. కానీ అవి కుంచించుకుపోయే రేటును తగ్గించడం సాధ్యమవుతుందట. ఇది గనుక వేగంగా కుచించుకుపోతే వ్యాధి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నట్లు లెక్క అని చెబుతున్నారు.

చివరగా బిలియనీర్‌ టెక్‌ వ్యవస్థాపకుడు బ్రయాన్‌ జాన్సన్‌ రోజుకు 100 సప్లిమెంట్లను తీసుకుంటూ, వృద్ధాప్యాన్ని నెమ్మదింపజేయాలనే లక్ష్యంతో ఉన్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలో ప్రతి ఒక్క కేలరీని లెక్కవేస్తూ దీర్ఘాయువు కోసం పాటుపడుతున్నారు.

కానీ ఈ అధ్యయనం మంచి పోషకాహారాన్ని సరైన విధంగా తీసుకోవడం అనేది ప్రధానమని, దాంతో దీర్ఘాయువుని పొందడం, వృద్ధాప్యాని నెమ్మదించగలమని హైలెట్‌ చేసిందని చెబుతున్నారు నిపుణులు.

గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.