నేటి నుంచే ఉచిత బస్సు ప్రయాణం – ఎక్కాల్సిన బస్సులు, మీ వద్ద ఉండాల్సిన గుర్తింపు కార్డులివే

పీ సర్కార్ మరో సూపర్ సిక్స్ పథకం అమలుకు సిద్దమైంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మహిళలకు ప్రయాణ ఖర్చుల భారం నుంచి విముక్తి కల్పిస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించే పథకాన్ని స్త్రీ శక్తి పేరుతో ఇవాళ ప్రారంభించనుంది.


ఈ మేరకు ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడ పిఎన్బీఎస్ లో కూటమి నేతలతో కలిసి ప్రారంభింస్తారు.

5 రకాల బస్సుల్లో అమలు…

  • రాష్ట్ర వ్యాప్తంగా ఐదు రకాల బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి అనుమతించారు.
  • బస్సుల్లో ప్రయాణించే మహిళలకు జీరో ఫేర్ టిక్కెట్లు ఇవ్వడానికి అవసరమైన సాఫ్ట్ వేర్ కూడా ఆర్టీసీ సిద్దం చేసింది.
  • పల్లె వెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్, మెట్రో ఎక్స్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే వెసులుబాటు మహిళలకు ప్రభుత్వం కల్పించింది.
  • ఉచిత బస్సు ప్రయాణాన్ని రాష్ట్రంలోని సుమారు 2.62 కోట్ల మంది మహిళలు వినియోగించుకోవచ్చు.
  • నాన్‌స్టాప్‌లు, సూపర్ లగ్జరీలు, ఏసీ బస్సులు, ఘాట్ రూట్లలో తిరిగే సర్వీసుల్లో ఉచిత ప్రయాణం వర్తించదు.
  • ఆర్టీసీ పరిధిలో మొత్తంగా 11,449 బస్సులు ఉంటే.. అందులో 74 శాతం బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ ఉచిత ప్రయాణాన్ని ట్రాన్స్ జెండర్లకు కూడా వర్తింప చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఈ పథకం కోసం సుమారుగా రూ. 1942 కోట్ల భారం రాష్ట్ర ప్రభుత్వంపై పడనుంది. ఈ మొత్తాన్ని ప్రభుత్వం ఆర్టీసీకి ప్రభుత్వమే చెల్లిస్తుంది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో ఈ మొత్తం భరించడం కష్టమే అయినా.. మహిళలకు ఆర్థికంగా కొంత వెసులుబాటు కల్గించేలా ఉంటుందని ప్రభుత్వం ఈ పథకం అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రయాణికులు రాష్ట్ర వాసులు అయ్యుండాలి. ఓటర్ ఐడీ, ఆధార్, రేషన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ సహా ఇలాంటివి కండక్టర్లకు చూపించి ఉచిత ప్రయాణం చేయవచ్చు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.