ఈపీఎఫ్‌ వ్యక్తిగత వివరాల్లో… తప్పుల సవరణకు అవకాశం

ఈపీఎఫ్‌లో వ్యక్తిగత వివరాల్లో మార్పులు, ఆధార్‌ అనుసంధానానికి జాయింట్‌ డిక్లరేషన్‌ను ఈపీఎఫ్‌వో మరింత సులభం చేసింది.


ఆధార్‌లోని పేరు, పుట్టిన తేదీ వివరాలు యూనివర్సల్‌ ఎకౌంట్‌ నంబరు (యూఏఎన్‌)లోని వివరాలతో సరిపోలితే యజమాని నేరుగా కేవైసీ ఆధారంగా అనుసంధానం చేయవచ్చని తెలిపింది. యూఏఎన్, ఆధార్‌ అనుసంధానానికి అదనంగా ఈపీఎఫ్‌వో ఆమోదం అవసరం లేదని పేర్కొంది. సవరణకు వచ్చే దరఖాస్తులను సంబంధిత ఏపీఎఫ్‌సీ అధికారి పరిశీలించి ఆమోదించాలని కేంద్ర కార్యాలయం సూచించింది.

  • పేరు, లింగం, పుట్టిన తేదీ వివరాలు ఆధార్, యూఏఎన్‌తో సరిపోలనప్పుడు సవరణకు చందాదారు, యజమాని జాయింట్‌ డిక్లరేషన్‌(జేడీ) సమర్పించాలి
  • ఒకవేళ యూఏఎన్‌కు తప్పుడు ఆధార్‌ నంబరు అనుసంధానమైతే, తాజాగా యజమాని సరైన ఆధార్‌ నంబరును ఆన్‌లైన్‌ జేడీలో నమోదు చేయాలి. ఈ దరఖాస్తును సంబంధిత ప్రాంతీయ కార్యాలయానికి అనుమతి కోసం పంపించాలి.
  • యజమాని అందుబాటులో లేకున్నా, ఆ సంస్థను మూసివేసినప్పటికీ ఈపీఎఫ్‌ చందాదారులు కాగిత రూప జేడీ సమర్పించేందుకు అవకాశం ఉంటుంది. తొలుత చందాదారు దరఖాస్తు పూర్తి చేయాలి. దానిపై ఈపీఎఫ్‌వో పేర్కొన్న అధీకృత అధికారితో ధ్రువీకరణ చేయించాలి. దానిని ప్రాంతీయ ప్రజా సంబంధాల అధికారి (పీఆర్‌వో) కార్యాలయంలో అందజేయాలి. పీఆర్‌వో ఆ వివరాలను నమోదు చేసి, సంబంధిత అధికారులకు పంపిస్తారు.

మైనర్లకు సంరక్షణ సర్టిఫికెట్‌ అవసరం లేదు…

చందాదారు మరణించిన సందర్భంలో మైనర్లకు పింఛను, ఇతర చెల్లింపులకు గార్డియన్‌షిప్‌ (సంరక్షణ) సర్టిఫికెట్‌ అవసరం లేదని ఈపీఎఫ్‌వో స్పష్టం చేసింది. కొన్ని కార్యాలయాలు ఆ సర్టిఫికెట్‌ అడుగుతున్నాయని, ఇక నుంచి ఇలాంటి ధ్రువీకరణ పత్రాలు అవసరం లేదని వెల్లడించింది. మైనర్ల పేరిట వ్యక్తిగత బ్యాంకు ఖాతా తెరిపించాలని, అందులో బీమా, భవిష్యనిధితో పాటు పింఛను చెల్లింపులు జమ చేయాలని ప్రాంతీయ కార్యాలయాలకు ఈపీఎఫ్‌వో ఆదేశాలు జారీ చేసింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.