పువ్వులే అని తీసి పారేయకండి.. 15వేల కోట్ల వ్యాపారం సాగుతోంది

అయితే జడకు.. లేకుంటే గుడికి.. మరీ కాకుంటే పార్థివ దేహానికి.. ఈ మూడింటికి పువ్వు కావాల్సిందే. పువ్వు అలంకరణ మాత్రమే కాదు.. ఆరాధన.. అశ్రునివాళికి ఒక ఆచ్చాదన. వెనుకటి కాలంలో ఏమో గాని.. ఇప్పుడైతే ప్రతి సందర్భానికి పూలను వాడాల్సిందే. అందుకే పూల మార్కెట్ మనదేశంలో అంతకంతకు పెరుగుతోంది. కేవలం పూలు మాత్రమే కాదు.. భక్తి సంబంధిత ఉత్పత్తుల మార్కెట్ అంతకుమించి అనే రేంజ్ లో ఎదుగుతోంది.


ఓ నివేదిక ప్రకారం మనదేశంలో పువ్వుల మార్కెట్ 15 వేల కోట్లకు చేరుకుంది.. వచ్చే కాలంలో ఇది 20,000 కోట్ల మార్కును చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.. భారతీయులు కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాలలో మాత్రమే కాకుండా, ఇతర వ్యవహారాలకు కూడా పూలను విరివిగా వినియోగిస్తున్నారు. అందువల్ల వాటి మార్కెట్ విపరీతంగా పెరుగుతుంది. గతంలో సంప్రదాయ పూలను మాత్రమే మన దేశంలో సాగు చేసేవారు. ఇప్పుడు విదేశాల నుంచి మొక్కలను దిగుమతి చేసుకొని సాగు చేస్తున్నారు. ఇలా విభిన్న రకాలైన పూలను సాగు చేస్తూ.. ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తూ.. విరివిగా సంపాదిస్తున్నారు. మనదేశంలో కర్ణాటకలో ఎక్కువగా పువ్వులు సాగవుతుంటాయి. అత్యాధునికమైన పద్ధతుల్లో రైతులు ఇక్కడ పూల తోటలను సాగు చేస్తుంటారు. విదేశీ మరకద్రవ్యాన్ని కూడా ఆర్జిస్తూ ఉంటారు. ఈశాన్య రాష్ట్రాల్లోనూ పువ్వులు సాగవుతుంటాయి.

పూల తర్వాత అగర్బత్తిల వ్యాపారం కూడా మనదేశంలో జోరుగా సాగుతోంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, కేరళ రాష్ట్రాలలో అగర్బత్తుల తయారీ కేంద్రాలు ఉన్నాయి. మనదేశంలో ప్రతి ఏడాది సుమారు 7000 కోట్ల వరకు అగర్బత్తిల అమ్మకాలు జరుగుతున్నాయి. శ్రావణమాసం, కార్తీకమాసం సమయంలో అగర్బత్తిలకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఇదంతా కూడా పరోక్షరంగం కావడంతో దీని ద్వారా సాగే వ్యాపారం ఇంకా వెలుగులోకి రావడం లేదు. వచ్చే పది సంవత్సరాలలో పూల వ్యాపారం, అగర్బత్తిల వ్యాపారం దాదాపు 30 వేల కోట్ల వరకు చేరుకునే అవకాశం ఉంటుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నా. ఇది మనదేశంలో సాగుతున్న ఓటీటీ వ్యాపారానికంటే రెట్టింపు అని తెలుస్తోంది. అయితే కార్పొరేట్ కంపెనీలు కూడా ఈ వ్యాపారంలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి.

 

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.