శ్రీ కృష్ణుడి అన్నయ్య బలరాముడు అనేది అందరికీ తెలిసిందే. కానీ బలరాముడు కంటే ముందు ఆరుగురు అన్నయలు కృష్ణుడికున్నారు. వారందరూ మేనమామ కంసుడి చేతిలో మరణించారు.
దేవకి గర్భాన జన్మించే ఎనిమిదవ శిశువు చేతిలోనే తనకు మరణం ఆసన్నమవుతుందని తెలుసుకున్న కంసుడు దేవకి వసుదేవులను చెరశాలలో బందించాడు. వాళ్లకు బిడ్డలు పుట్టగానే తనకు అందించాలనే షరతు మీద చెల్లెలు దేవకి దేవిని చంపకుండా వదిలేశాడు. ఆ మాట ప్రకారమే తొలి బిడ్డ పుట్టగానే ఆ శిశువును కంసుడికి అప్పగించాడు వసుదేవుడు. అతని నిబద్ధతకు మెచ్చుకున్న కంసుడు తనకు ప్రాణహాని ఎనిమిదో గర్భంలో ఉందని అంతవరకు మిగిలిన వాళ్ళను నువ్వే ఉంచుకోమని పంపిశాడు కంసుడు.
పనిగట్టుకుని చంపించిన నారదుడు.. ఎందుకు?
అయితే కంసుడ్ని కలిసిన నారదుడు దేవకీదేవి ఎనిమిదవ బిడ్డతో ప్రాణహాని ఉన్నప్పటికీ అతనికి మిగిలిన అన్నలు తోడైతే కంసుడికి మరింత ఇబ్బంది కదా అని చెప్పడంతో కంసుడు ఆ మొదటి బిడ్డను తీసుకొచ్చి బండ కేసి కొట్టి మరీ చంపేశాడు. అక్కడితో ఆగలేదు దేవకీ దేవికి పుట్టిన ఆరుగురు బిడ్డలను అదేవిధంగా చంపాడు . ఏడవ గర్భంలో ఆదిశేషువు ప్రవేశించాడు. అయితే మహావిష్ణువు ఆ గర్భాన్ని వసుదేవుడి రెండో భార్య అయిన రోహిణి గర్భం లోకి మార్చాడు. ఆలా “సంకర్షణం ” చెందాడు కాబట్టి బల రాముడి కి “సంకర్షుణుడు” అనే పేరు వచ్చింది. 8వ గర్భంలో విష్ణువు స్వయంగా కృష్ణుడిగా ప్రవేశించడం చిన్నప్పుడే ఆ బిడ్డను వసుదేవుడు గోకులానికి తరలించడం తర్వాత కాలంలో “కంస వధ ” జరగడం అందరికీ తెలిసిందే. అయితే నారదుడు లాంటి దేవర్షి పనిగట్టుకుని ఆ బిడ్డలను కృష్ణుడి అన్నలు ఆరుగురిని ఎందుకు చంపించాడు అనేదానికి పురాణాల్లో ఆసక్తికరమైన కథనం ఉంది.
తండ్రి చేతిలోనే చనిపోయేలా శాపం
హిరణ్యకశిపుడి వంశం లో జన్మించిన 6గురు సోదరులు హంస, సువిక్రమ,క్రథ,దమన, రిపుమర్థన,క్రోధహనత. వీరు గొప్ప సంపన్నులు. మీరు బ్రహ్మ దేవుడి గురించి మరోసారి తపస్సు చేస్తున్న విషయం తెలుసుకున్న హిరణ్యకశిపుడు ముల్లోకాలను జయించిన తండ్రి లాంటి తాను ఉండగా దేవతల గురించి తపస్సు చేయడమేంటి అంటూ అగ్రహం చెంది కన్నతండ్రి చేతుల్లోనే చావండి అంటూ శపించాడు. దాని ప్రకారమే తరువాతి జన్మలో ఈ ఆరుగురు శ్రీమహావిష్ణువు ప్రబల విరోధి అయిన “కాలనేమి” కి కొడుకులు గా పుట్టారు. కాలనేమిని శ్రీ మహా విష్ణువు చంపడం తో ఆ జన్మలో శాపం తీరలేదు. ద్వాపర యుగం నాటికి కాలనేమి యాదవుల రాజు ఉగ్రససేనుడి కి కొడుకు గా కంసుడి పేరుతో జన్మించాడు. శాపం తీరడం కోసం పాతాళం లో ఎదురుచూస్తున్న ఆరుగురు అన్నదమ్ములు దేవకి గర్భాన జన్మించి ముందు జన్మలో తమ తండ్రి, ఈ జన్మలో మేనమామ అయిన కంసుడి చేతిలో చనిపోయి శాపవిమోచనం పొంది స్వర్గానికి వెళ్ళిపోయారు. వాళ్లకా శాపం తీరడం కోసమే నారదుడు వారిని పనిగట్టుకుని కంసుడి చేతిలో చనిపోయేలా రెచ్చ గొట్టాడు.
ఏం జరిగినా లోక కళ్యాణం కోసమే కదా. ఈ కథ అంతా మహాభారతం, హరివంశం, దేవీ భాగవతం, పద్మ, విష్ణు పురాణాల్లో వివిధ బాగాలుగా రాసి ఉంది.































