ఏపీలో నిరుద్యోగులకు పండగే.. భారీగా ఉద్యోగాల భర్తీకి గ్రీన్‌సిగ్నల్ వచ్చింది. రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థల్లో ఖాళీ పోస్టులను ఏటా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రస్తుతం 2,511 పోస్టులను భర్తీ చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం తెలిపారు. వీటిలో 1,711 జూనియర్ లైన్మెన్ పోస్టులు, 800 ఏఈఈ పోస్టులు ఉన్నాయి. చివరిసారిగా 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఖాళీలను భర్తీ చేసింది.. మళ్లీ చాలా కాలం తర్వాత మళ్లీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. బీటెక్, డిప్లొమా, ఐటీఐ చేసిన నిరుద్యోగ యువతకు పండగలాంటి వార్త ఇది.
వాస్తవానికి ప్రస్తుతం ఏపీఎస్పీడీసీఎల్లో 2,850 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏపీసీపీడీసీఎల్‌లో 1,708 పోస్టులు, ఏపీఈపీడీసీఎల్‌లో 2,584 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తంగా 7,142 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏపీ జెన్కో, ట్రాన్స్‌కోల్లో కూడా కొన్ని ఖాళీలు ఉన్నాయి. అయితే రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థల్లో 7,142 పోస్టుల భర్తీ కత్తిమీద సాములా మారింది. కానీ మానవ వనరులు లేకుండా ఇంధన రంగాన్ని నడపడం కష్టమని ఇటీవల నిర్వహించిన సమీక్షలో సీఎం చంద్రబాబుకు మంత్రి గొట్టిపాటి రవికుమార్, సీఎస్ విజయానంద్ తెలిపారు. పోస్టులను వెంటనే కాకున్నా, ఏటా క్రమం తప్పకుండా భర్తీ చేయాలని కోరారు. దీనివల్ల ఆర్థిక భారం పడదని, ఉద్యోగులపై పని ఒత్తిడి తగ్గుతుందని వివరించారు.
మంత్రి గొట్టిపాటి రవికుమార్, సీఎస్ విజయానంద్ అభిప్రాయంతో సీఎం చంద్రబాబు ఏకీభవించారు. వెంటనే AEE, JLM పోస్టులను భర్తీ చేయాలని సూచించారు. దీంతో EPDCL (ఈపీడీసీఎల్), CPDCL (సీపీడీసీఎల్), SPDCL (ఎస్పీడీసీఎల్) పరిధిలో AEE, JLM పోస్టుల భర్తీకి అనుమతి లభించింది. ఇంధన రంగాన్ని మానవ వనరులు లేకుండా నడపడం కష్టమని.. పోస్టులను క్రమం తప్పకుండా భర్తీ చేయడం వల్ల ఆర్థిక భారం పడదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఉన్న ఉద్యోగులపై అదనపు భారం పడకుండా ఉంటుందని కూడా ఆయన వివరించారు. మొత్తం మీద ఏపీ ప్రభుత్వం భారీగా ఉద్యోగాల భర్తీపై ఫోకస్ పెట్టింది.
































