ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఏపీని అన్ని విధాలుగా ప్రగతి పథంలో ముందుకు నడిపించడానికి ప్రయత్నం చేస్తుంది.
ఈ క్రమంలోనే నిరుద్యోగుల విషయంలో కూడా ఉద్యోగాలు, ఉపాధి కల్పన పైన పెద్ద ఎత్తున ఫోకస్ చేస్తుంది. ఇక తాజాగా నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది ఏపీ ప్రభుత్వం విద్యుత్ సంస్థల్లో దశాబ్ద కాలం తర్వాత ఖాళీల భర్తీకి సిగ్నల్ ఇచ్చింది.
విద్యుత్ సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్
దాదాపు పది సంవత్సరాలుగా విద్యుత్ సంస్థల్లో ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం ఈ మేరకు సంబంధిత శాఖకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ క్యాడర్లో 9849 ఉద్యోగాలు ఖాళీలు ఉండగా వాటిలో 75% భర్తీ చేయాలని నిర్ణయించింది. టెక్నికల్ క్యాడర్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్లు పోస్టులను భర్తీ చేయనుంది.
పోస్టులను వెంటనే భర్తీ చెయ్యాలని కసరత్తు
ఏఈఈ, ఏఈ, సివిల్, ఎలక్ట్రికల్, టెలికం, ఐటి విభాగాలలో పోస్టులను భర్తీ చేయనుంది. జూనియర్ ఇంజనీర్లను కూడా నియమించనుంది. ఇక నాన్ టెక్నికల్ క్యాడర్లో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్లు, ఆపరేషన్, నిర్వహణ కేటగిరీలో జూనియర్ లైన్మెన్, ఎనర్జీ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు.
వివిధ క్యాడర్ లలో ఖాళీగా 40 శాతం పోస్టులు
గతంలో టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2014లో స్వల్ప సంఖ్యలో ఖాళీలను భర్తీ చేసింది. ఆ తర్వాత వైసిపి హయాంలో ఖాళీలు భర్తీ చేస్తారని భావించిన ఐదేళ్లపాటు అది జరగలేదు. గత ఐదేళ్లలో పలువురికి పదోన్నతులు రావడం, పలువురు రిటైర్ కావడం తో చాలా పోస్టులు ఖాళీ అయ్యాయి. వివిధ క్యాడర్ లలో 40 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఖాళీలు భర్తీ కాక సిబ్బందిపై పని ఒత్తిడి
ఇక ఈ సమస్యను ఉద్యోగ సంఘాలు యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లగా, కూటమి సర్కార్ ఈ ఖాళీలను భర్తీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే పోస్టులు భర్తీ చేయకపోవడంతో ఇప్పటివరకు పదోన్నతులు వచ్చిన వారు పదోన్నతి తో పాటు , తాము గతంలో నిర్వహించిన బాధ్యతను కూడా అదనంగా నిర్వహించాల్సి వస్తుంది. రెండు పోస్టుల విధులతో వారిపైన పని ఒత్తిడి పెరిగింది.
డిస్కంలో ఉద్యోగుల సమస్య.. ప్రభుత్వ నిర్ణయంతో త్వరలోనే భర్తీ
ఇదే సమయంలో క్షేత్రస్థాయిలో ఏదైనా ఇబ్బంది తలెత్తితే పరిష్కరించడం, తక్కువ సిబ్బందితో విద్యుత్ సంస్థలకు కష్టంగా మారింది. జెన్కో, ట్రాన్స్ కో లో ఎలాగోలా నెట్టుకొస్తున్నా, డిస్కం లో మాత్రం సమస్య చాలా తీవ్రంగా ఉంది. దీంతో నియామకాలు చేపట్టక తప్పదని అధికారులు గుర్తించారు. ఈ మేరకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరితగతిన నియామకాలు చేయాలని చూస్తున్నారు.
































