డిస్కమ్‌లలో 2,511 పోస్టుల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌

రాష్ట్ర విద్యుత్తు పంపిణీ సంస్థల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ఏటా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.


ప్రస్తుతం 2,511 పోస్టులు భర్తీ చేసేందుకు సీఎం చంద్రబాబు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఇందులో 1,711 జూనియర్‌ లైన్‌మన్‌, 800 ఏఈఈ పోస్టులు ఉన్నాయి. కాగా ఏపీఎస్పీడీసీఎల్‌లో 2,850, ఏపీసీపీడీసీఎల్‌లో 1,708, ఏపీఈపీడీసీఎల్‌లో 2,584.. మొత్తంగా 7,142 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏపీ జెన్కో, ట్రాన్స్‌కోల్లోనూ మరికొన్ని ఉన్నాయి. చివరిసారిగా 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం విద్యుత్తు పంపిణీ సంస్థల్లో ఖాళీలను భర్తీ చేసింది. ఆ తర్వాత భర్తీకి నోచుకోలేదు.

2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఏటా జనవరి 1న జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తానంటూ జగన్‌ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక నిరుద్యోగ యువత మోసపోయారు. 2019-24 మధ్య రాష్ట్ర విద్యుత్తు పంపిణీ సంస్థలు భారీగా నష్టాల్లో కూరుకుపోయాయి. కూటమి ప్రభుత్వానికి ఈ పరిస్థితి భారంగా మారింది. 7,142 పోస్టులను భర్తీ చేయడం కత్తిమీద సాముగా మారింది.

అయితే మానవ వనరులు లేకుండా ఇంధన రంగాన్ని నడపడం కష్టమని మంత్రి గొట్టిపాటి రవికుమార్‌, సీఎస్‌ విజయానంద్‌ బుధ, గురువారాల్లో ఇంధన శాఖపై చంద్రబాబు నిర్వహించిన సమీక్షలో వెల్లడించారు. పోస్టులన్నింటినీ ఒకే దఫాలో కాకున్నా ఏటా క్రమం తప్పకుండా భర్తీ చేయడం వల్ల ఇంధన పంపిణీ సంస్థలపై ఆర్థిక భారం పడబోదని వివరించారు. అలాగే ఉన్న కొద్దిపాటి ఉద్యోగులపై అదనపు భారం పడదని కూడా వివరించారు. మంత్రి గొట్టిపాటి, సీఎస్‌ విజయానంద్‌ అభిప్రాయంతో సీఎం చంద్రబాబు ఏకీభవించారు. ముందస్తుగా ఏఈఈ, జేఎల్‌ఎం పోస్టులను అవసరమైన మేరకు భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. దీంతో ఈపీడీసీఎల్‌, సీపీడీసీఎల్‌, ఎస్పీడీసీఎల్‌ పరిధిలో ఏఈఈ, జేఎల్‌ఎం పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్‌ లభించింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.